మహా శివరాత్రి


ఓం నమః శివాయః
మహా శివరాత్రి చాంద్రమాన మాసముల లెక్కింపు ప్రకారంగా మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. మన పండుగలలో మహాశివరాత్రి చాలా విశేషమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత ప్రశస్త మైనది.
పంచాక్షరి మంత్రం.




పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు "న" "మ" "శి" "వా" "య" (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.


మహాశివరాత్రి వ్రత కథ.
ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.
ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.
మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.


రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.



మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.
ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. "ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.
అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."
ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము.
ఓం నమః శివాయః
తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.
ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు.






ఓం నమః శివాయః
తపస్సు, యోగ, ధ్యానం వాటి అభ్యాసంతో క్రమంగా, వేగంగా జీవితంలో అత్యధికంగా భక్తి. ముక్తి పొందడానికి నిర్వహిస్తారు. మహ శివ రాత్రి రోజు, ఉత్తర ధ్రువం లోని గ్రహ స్థానాలు అంతా బలమైనవిగా ఉత్ప్రేరకాలు చర్యతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా అతని లేదా ఆమె ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి సహాయంగా ఉంటాయి.

మహా ప్రళయ కాలంలో సర్వ లోకాలు సముద్రపు నీరుతో నిండి ఉన్నప్పుడు పార్వతి దేవి మహా ప్రళయ అనంతరం మళ్ళీ జీవులని, జీవ శక్తిని పెపొందించే నిమిత్తం తన భర్త అయిన శివున్ని  ప్రార్థించింది. 




శివుడు పార్వతి వివాహ మహోత్సవమును కూడా శివరాత్రిగా జరుపుకుంటారు.





శివునికి ఇష్టమైన రోజు మహ శివరాత్రి 

భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తరువాత, భక్తులు, అనేక ఆచారాలు పాటించేవారు, పార్వతి దేవి భక్తితో భక్తులు ఈశ్వరుణ్ణి సంతోష పెట్టేందుకు వరం కోరారు. అందుకు శివుడు జవాబుగా,  చతుర్దశి రాత్రి, ఫాల్గున మాసములో కృష్ణ పక్షం, తనకు ఇష్టమైన  రోజు అని బదులిచ్చాడు. పార్వతీ దేవి, ఆమె స్నేహితులకు  ప్రమధ గణాలకు చెప్పడం వలన మరియు   వారి ద్వారా ఈ విషయం  సృష్టి అంతా వ్యాపించింది.


మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విశ్వేశ్వర సంహితలో చెప్పబడింది. గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు. 

ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపుమంటాడు.


అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.





లింగోద్భవము..
ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, "నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావులే, నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది " అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగం తో వచ్చాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడుతున్నావు" అంటాడు.
ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు. ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మద్యలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శ్రద్ధతో వింజామరలు వీచుతుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందబాష్పాలతో శ్హస్త్రంగమ్ ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవితో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం యొక ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు (బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి.










 ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటితో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి, అక్కడ డస్సి ఉన్న విష్ణువుని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడశోపచారా లతో పూజ చేస్తాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.








కాల భైరవ వృత్తాంతం



శివ పురాణం, విశ్వేశ్వర సంహితలోని ఏడవ మరియు ఎనిమిదవ అధ్యాయములలో ఉన్నదీ విషయం.


ఈశ్వర ఉవాచ

అరాజ భయమేతద్వైజగత్సర్వం నశిష్యతి! తతస్త్వం జహి దండార్హం వహ లోకథురం శిశో!!

వరందదామి తే తత్ర గృహాణ దుర్లభం పరమ్! వైతానికేషు గృహ్యేషు యజ్ఙేషు చ భవాన్గురుః!!

నిష్ఫలస్త్వదృతే యజ్ఙః సాంగశ్చ సహ దక్షిణః! ........


శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు శరణు జొచ్చిన బ్రహ్మను (పిల్లవానిని తప్పుడు చేతకై దండించి తప్పు తెలుసుకొన్న తరువాత కారుణ్యమును ప్రకటించిన తండ్రిలా) ఉద్దేశించి గొప్ప వరమును ప్రసాదించెను. బ్రహ్మ దేవుణ్ణి  క్షమించి, "ఓ బ్రహ్మా నీకు గొప్పనైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను, అగ్నిష్టోమము, దర్శ మొదలగు యజ్ఙములలో నీది గురుస్థానము. ఎవరేని చేసిన యజ్ఙములలో అన్ని అంగములు ఉన్నా అన్నింటినీ సరిగా నిర్వర్తించినా, యజ్ఙనిర్వహణముచేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చినా, నీవు లేని యజ్ఙము వ్యర్థము అగును" అని వరమిచ్చెను.



మొగలి పువ్వుకు శాపము.

ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి, అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.




కామధేనువుకు శాపము.

అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు , శాంతించి, " ముఖము తో అసత్యమాడితివి కనుక నీముఖము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వరమిచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములైనవై, పూజా, పునస్కారములలో వాడబడుతున్నవి.





జాగరణ - జాగారం 
ఓం నమః శివాయః
జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యుల మాట ప్రత్యక్ష సత్యము. 
ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. 
శివ రాత్రి రోజున జాగరణ ఉపవాసము ఉంటారు.
ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో, తమ స్వంత పంటపొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజించాలి.  
ఓం నమః శివాయః
వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. రుద్ర మంత్ర సహితంగా శివలింగానికి ఉభయ సంధ్యా సమయములలో అభిషేకం చేస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో పాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.   

ఆధ్యాత్మిక శక్తి.



తపస్సు, యోగ, ధ్యానం వాటి అభ్యాసంతో క్రమంగా, వేగంగా జీవితం యొక్క పరమావధిని మంచిని ముక్తిని చేరటానికి ముక్తి పొందడానికి నిర్వహిస్తారు. ఈ రోజు, ఉత్తర ధ్రువం లోని గ్రహ స్థానాలు అంతా బలమైనవిగా ఉత్ప్రేరకాలు అనేక చర్యలతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా అతని లేదా ఆమె ఆధ్యాత్మిక శక్తిని పెంపొoదించడానికి సహాయంగా ఉంటాయి.





కాశీ అన్నపూర్ణా దేవి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్యాకేజీ యాత్ర @17000/-

మహాలయ పక్షము 2025

🙏 దక్షిణ భారత తీర్థ యాత్ర 🙏 ప్యాకేజ్ @17300/-