మాఘ పురాణం

*_మాఘ మాసం" విశిష్టత_*🌹
"మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి *_శుక్ల పక్ష చవితి_* దీనిని *_తిల చతుర్థి_* అం టారు. దీన్నే *_కుంద చతుర్థి_* అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు."కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు 
*_దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!_*
 అని చేసిన తరువాత 
*_సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!_* 
అని చదవాలి. 
*_సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి._*
ఈ మాసాన్ని *_కుంభమాసం_*  అని కూడా అంటారు.కొంతమంది *_ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు_*
.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. 
*_మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి_* అంటారు.
ఈ పంచమి నాడే *_సరస్వతీదేవి_* జన్మించిందట. 
ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.
అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది. ఇక 
*_మాఘశుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి"_* అని కూడా పిలువబడుతుంది.ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.ఈ రోజున *_అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట_*. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. *_నమస్కారం ప్రియ:సూర్య:_* అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున *_చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం_*.
సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే "శమంతకమణి" ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం *_సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్_* అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో *_మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట._* స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. *_భీష్మ ఏకాదశి_* నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే *_ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే._* ఈ విధంగా *_మాఘమాసమంతా "శివరాత్రి"వరకూ అన్నీ పర్వదినాలే._*🌹




ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రచయిత సదా మా శ్రేయోభిలాషి కాశీ విశ్వేశ్వర అనుగ్రహ పాత్రులు APBSSS రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాకు ఆత్మీయులు 

AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో పూర్తి మాఘ పురాణం

ఒక చోట సంకలనం చేస్తున్నాము.

గంగా మ తల్లి సాక్షిగా శ్రీ కాశీ విశాలాక్షీ అన్నపూర్ణా సహిత విశ్వేశ్వర స్వామి అనుగ్రంతో పాఠకులకు అంకితం.


*మాఘ పురాణం - 1 వ అధ్యాయము*
        *మాఘమాస మహిమ*
*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*
*ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||*
*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |*
*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*
*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |*
*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||*
           ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము, కర్మధర్మ ధ్యాన పరాయణమై, సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది  పర్వతములు, గంగాదినదులూ, నైమిశం మొదలైన అరణ్యములూ, మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ, మొదలైనవానికి, అనేకరెట్లు, ఫలితాన్నిచ్చేవిగా, ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం, మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం, మొదలైన వాని వలన, వచ్చే పుణ్యం, బగణ్యమైనది. అంటే, యింత అని లెక్కకురానిది.



       పూర్వం మహర్షులు, శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి, ''స్వామీ! స్నానానికీ, ధ్యానాధికమైన తపస్సుకీ, ప్రశాంతమూ, పావనమూ, సిద్దిప్రదమూ, అయిన ప్రదేశాన్ని, మాకీ భూమండలంలో, నిర్దేశింపుడని, ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, వారితో, "మహర్షులారా! నేను నా చక్రాన్ని విసురుతాను. అది యెక్కడ పడుతుందో, ఆ ప్రదేశం, తృణకాష్ఠజల సమృద్ధమైన, తపో యోగ్యమైన ప్రదేశంగా, గుర్తించండీ, అని చెప్పి, తన చక్రాన్ని విసిరినాడట, ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని, నైమిశారణ్యమని వ్యవహరిస్తూ, శౌనకాది మహర్షులు, అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూవుంటే, భూమండలంలో, వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ, చూడడానికి, వస్తూ వుండేవారు. అలగే, రోమహర్షుణుడో, ఆయన కుమారుడు సూతమహర్షియో , అందరిలా, ఆయాగాన్ని, చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు, వాళ్ళని ప్రార్థించి, విరామకాలంలో, పుణ్యకరములైన కథలని, విశేషాలని,చెప్పించుకునేవారు. అంటే నైమిశారణ్యంలోని, ఆ ఆశ్రమంలో, జపహోమాదులు లేనప్పుడు, పుణ్యకథాప్రవచనాలు, అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని, పెoపొందించేవి.
ఇలా ఒకప్పుడు, శౌనకాది మహర్షులు, చిరకాలం జరిగే యాగమునొకదానిని, ప్రారంభించారు. ఆ యాగం, కొన్ని సంవత్సరాలు, జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని, చాలా మంది మునులు, దేశం నలుమూలలనుండి, ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో, సూతమహర్షి వున్నారు. శౌనకాది మునులు, ఆయనకెదురు వెళ్ళి, సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి, అతిధి సత్కారాలు, చేశారు. ఆయనతో ఇలా అన్నారు. "సూతమహర్షి! మీ తండ్రిగారు, రోమహర్షణులవారు, పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో, సాటిలేని వారు. శరీరము పులకించి, ఆనంద పారవశ్యంచే, రోమములు కూడా, పులకరించేటట్లు చేయగల  సమర్థులు, రోమములకును, హర్షము కలిగించువారు కనుగ, రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ, ఆయన అంతటివారై, ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన, మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో, మాకు పుణ్యకరములైన విషయాలని వినడం, మరింత ఫలప్రదం అవుతుంది కదా! దయవుంచి, మాకు పుణ్య కథలని వినిపించండి" అని ప్రార్థించారు.
సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి, సుఖాసనంపై కూర్చుని, వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి, చిరునవ్వుతో, మీకు నా మీద వున్న అభిమానానికి, కృతజ్ఞణ్ణి, పుణ్యకార్యాలు జరిగే చోట, పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా, ఒక అదృష్టమే. అది కూడ, యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా, నన్నూ, ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు, నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి, వ్యాసమహర్షుల వారి, దయా విశేషం చేత, నాకు తెలిసిన విషయాన్ని, మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని, యధాశక్తి  వినిపించి, మీ ఆనందాశీస్సులనీ, భగవత్కృపను, పొంద ప్రయత్నిస్తున్నాను, మీ ఆజ్ఞయేమిటి" అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు, ''సూతమహర్షి, లోగడ వైశాఖమాసం, కార్తీకమాసం, వైశిష్ట్వాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి, మాకానందం కలిగించారు. ప్రస్తుతం, మాఘమాస మహిమను వివరింపుడని'' కోరారు.
 అప్పుడు సూతమహర్షి, క్షణకాలం కళ్ళు మూసుకుని, ధ్యానంలో ఉండి, తండ్రిగారిని, గురువులను, తలచుకొని, నమస్కరించి, కనులు తెరచి, మునులకు, మరల, నమస్కరించి, యిలా ప్రారంభించాడు. "మహర్షిసత్తములారా! మీరు అడిగిన ప్రశ్న, సారవంతమైనది. విశేషించి, సామాన్య ప్రజానీకానికి, మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది, అయినా, యజ్ఞయాగాలు జపతపాలు చేసి, పాపం పోగొట్టుకొని, పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు, తరించడానికి, ఈ విషయం బాగా ఉపకరిస్తుంది.పూర్వం, ఒకప్పుడు, జగన్మాత అయిన పార్వతీదేవి, పరమేశ్వరుణ్ణి, యిదే  విషయాన్ని అడిగింది.
గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని, పార్వతీదేవికి, పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు, చెప్పెదను వినండి.
 పార్వతీదేవి, పరమేశ్వరునితో, "విశ్వాత్మకా! సర్వలోకేశ్వరా! సర్వభూతదయానిధీ! ప్రాణేశ్వరా! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై, నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని" ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు "కళ్యాణీ! జగన్మంగళా! నీవు అడిగిన విషయము, మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియండును? తప్పక చెప్పెదను,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా, మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు, పాపవిముక్తులై ముక్తినందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా, చేసిన స్నానం, అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం, వాని సర్వపాపములను పోగట్టును. రెండవస్నానము, వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం, అతనికి, శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు, చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి, నేనేమి యివ్వాలని, శ్రీమహవిష్ణువే, ఆలోచనలోపడును. ప్రయాగలో, మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి, పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో, ఉదయాన్నే, నది ప్రవాహంలోగాని, సరస్సులో గాని, స్నానం చేసినవారికి ముక్తి, కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ, మొదలైనవానిలో చేసిన స్నానం, పాపనాశకం, మోక్షదాయకం సుమా! తెలిసికాని, తెలియకకాని, బలవంతంగాకాని, మాఘ మాసమున, ఒకమారు స్నానమైనను, సూర్యోదయమునకు ముందుగా చేసినచో, వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో, నెలoతయు చేసినచో, విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో, అతడు ఋషియై జన్మించును.
మాఘస్నానమును మాని, విష్ణువునర్చింపక, దానము చేయక, పురాణమును వినక, మాఘమాసమును గడిపిన వానికి, మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును? అతడు భయంకరమైన, కుంభీపాకనరకమున, బాధలు పడును. మదగర్వముచే, మాఘస్నానము మానిన, అధముడు, నీచజన్మలను, పలుమార్లుపొందును. చలికి భయపడి, స్నానము చేయనివారిని, చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో, సూర్యుని చూచి, నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు, పెక్కుమార్లు నీచజన్మలనందుదురు సుమా! దరిద్రులైనను, బాలురైనను, ప్రాతఃకాల స్నానముచేసిన, శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు, హరినామస్మరణ చేయుచు, ముమ్మారు, జలబిందువులను, శరీరముపై చిలుకరించుకొన్నను, పుణ్యమే. నీచుడైనను, మాఘస్నానము చేసిన, పాపములను వీడి, ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను, మాఘమాస ప్రాతఃకాలమున, మాయందు స్నానమాడినచో, వాని పాపములను, మేము నశింపజేయుదుమని, జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి, సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని, భయముచే గాని,, బలవంతముగాగాని, మాఘస్నానము చేసినవాడు, పాపవిముక్తుడై, పుణ్యాత్ముడగును. అశక్తుడు, తాను మాఘస్నానము చేయలేకపోయినచో, స్నానము చేసినవానికి, దక్షిణనిచ్చి, వానినుండి, స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున, నిరుపేదలకు, వస్త్రదానముగాని, కంబళదానముగాని, చేసిన, స్నానఫలమునంది, పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని, చేయించిన వారికిని, పుణ్యముకల్గును. ఈ స్నానమును, అన్ని వర్ణములవారును, చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును.
పార్వతీ! మాఘస్నానము, సద్యోముక్తిప్రదము. దానికి సాటిలేదు. శక్తిలేనివారు, కాలు చేతులను కడుగుకొని, ఆచమనముచేసి, పురాణమును విన్నను, వారికి స్నానఫలము కలుగును. అన్నిమాసములలో, మాఘమాసముత్తమము. 
శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో, మాఘమాసముత్తమము. వృక్షములలో, అశ్వత్తవృక్షముత్తమము. తేజోస్వంతులందరిలో, సూర్యుడుత్తముడు. శాస్త్రములన్నిటిలో, వేదములుత్తమములు. కావున, మాఘమాస స్నానము చేయువారిని, నిందించినను, నివారించినను, మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో, బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమనంత, పుణ్యప్రదము సుమా.
దిలీపుడను మహారాజు, పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి, అలసిపోయెను.మనోహరమైన సరస్సునొకదానిని చూచి, అచట కొంతకాలము విశ్రమించి, తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు, వృద్ధ బ్రాహ్మణుడొకడా, మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి, ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు, ''మహారాజా! పరమపవిత్రమైన మాఘమాసమున, నీ సరస్సున, స్నానము చేయకుండపోవుచున్నానేమి? మాఘమాసమున చేయు నదీస్నానముకాని, సరస్స్నానము కాని, మిక్కిలి పుణ్యమునిచ్చునని, యెరుగువా?" యని ప్రశ్నించెను. రాజు, మాఘస్నానమహిమను చెప్పుడని కోరగా,అతడు. "రాజా! నీ విప్పుడీ సరస్సున, తప్పక స్నానము చేసిపొమ్ము. మాఘమాస స్నాన మహిమను, మీ గురువగు, వశిష్ఠమహర్షివలన, తెలిసికొనుమని చెప్పి," తన దారిన పోయెనుl.
దిలీపమహారాజు, మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని, తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు, వెళ్లెను. గురువును దర్శించి, నమస్కరించి, మాఘమాసస్నాన మహిమను, తెలుపగోరెను. వశిష్టమహర్షి, దిలీపుని యాశీర్వదించి, యిట్లనెను. "నాయనా దిలీపా! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు, యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే, ఎక్కువ పుణ్యము నిచ్చును.
మాఘమాసమున, ప్రాతఃకాలమునచేసిన స్నానమే, సర్వపాపములను పోగొట్టీ , అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమేయింత అధికమైనపుణ్యము నిచ్చినచో, పూజ పురాణ శ్రవణాదులవలన, నెంతటి ఫలముండునో, యూహించుకొనుము. మాఘస్నానము వలన, సర్వ దుఃఖములను పోగట్టుకొని, శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను, వివరింతును. దానిని బట్టి, మాఘమాస వైశిష్ట్యమును, తెలిసికొన యత్నింపుము.
పూర్వమొకప్పుడు, భయంకరమైన క్షామము,(వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట, మొదలైన లక్షణముగల కరువు) వింధ్య-హిమాలయపర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన, సామాన్యజనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి, అట్టివారిలో, భృగుమహర్షి యొకడు. అతడును, ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను, కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి, తనకునచ్చిన ప్రదేశమునందు, ఆశ్రమమును నిర్మించుకొని, తపమాచరించు కొనుచుండెను. పవిత్రము, మనోహరము అయిన, ఆ దివ్యప్రదేశమునకు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, మున్నగు దేవజాతులవారును, వచ్చుచుండిరి. అచట విహరించి, ఉత్సాహమును పొందుచుండిరి.
ఒకనాడు గంధర్వుడొకడు, భార్యాసమేతుడై, ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు, భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము, మిక్కిలి సుందరమై, గంభీరమై, మనోహరమై, విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము, పులిమొగమై యుండెను. ఇందువలన, అతడుయెంత చక్కగానున్నను, పులిమొగమువలన, విచిత్రముగా, భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత," మునీశ్వరా! నాకు, భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా! ఈమె సౌందర్యము గుణసంపద, నిరుపమానములు, నేను గంధర్వుడను. మానవులకంటే, దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన, ఈ పులిమొగము, నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో, తెలియరాకున్నది. ఈ వికారమువలన, నాకు గల సుఖములు భోగములు, నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి, నాకీ వికారరూపము పోవునుపాయమును, చెప్పుడని ప్రార్థించెనుl.
భృగుమహర్షికి, గంధర్వుని పరిస్థితికి, జాలికలిగినది. వానికి సాయపడ
 వలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువదు . గతజన్మలో చేసిన పాపము వలన, నీకీస్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము, ఇవి మూడును, జీవిని బాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని, శుభలాభము పొందవలెనన్న, పుణ్యనదుల యందు స్నానము, పవిత్రక్షేత్రములందు దేవపూజ, చేసినకొనవలయును.ఇట్టి వానిని, పవిత్రమైన కాలమున చేసినచో, సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను, మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము, జీవికి గల పాపమును పోగొట్టి, శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో, వచ్చుఫలితము, మాఘమాసములో నదిలోగాని, సముద్రములోగాని, కాలువలోగాని, సెలయేరులోగాని, యే స్వల్పజల ప్రవాహమైనను, అందు స్నానము చేసినచో, వచ్చును. అనగా మాఘస్నానమును, యేప్రవాహమున చేసినను, సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను, అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున, యిది మాఘమాస ప్రారంభముకావున, నీ భార్యతో బాటు, ప్రతిదినము, ప్రాతఃకాలమున, మాఘస్నానమును, యిష్టదేవతా పూజను, అచటనున్న నదిలో చేయుము" అని భృగుమహర్షి, ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు, ముని చెప్పినట్లుగా, అచటి నదిలో మాఘస్నానమును, తీరమున యిష్టదేవతాపూజను విడువక, మాఘమాసమంతయు, చేసెను. ఆ పుణ్యవశమున, వాని పులిమొగము పోయి, వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి, *మాఘమాసమహిమను* కీర్తించును. కృతజ్ఞడై, మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునంది, తన భార్యతో బాటు, తనలోకమున కరిగెను. దిలీపమహారాజా *మాఘస్నాన మహిమను* గమనించితివా? మరియొక  కథను చెప్పుదును. వినుమని, వశిష్ఠుడు, మరలనిట్లు పలికెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏




_*మాఘ పురాణం - 2 వ అధ్యాయము*_

_*శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమ చెప్పుట*

             వశిష్ఠులవారు మార్కండేయ వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, యింకనూ వినవలెనని కుతూహలపడి, దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను. "మహాముని! ఈ మాఘమాస మహత్యమును, యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన, సెలవిం" డని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి, శివుడును, నారదునకు, బ్రహ్మయు, మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన, శివుడు పార్వతికి చెప్పిన విధమును, వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచూ, నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున, యేకాంతముగ కూర్చునివున్న సమయమున, లోకజననియగు పార్వతీదేవివచ్చి భర్తపాదములకు, నమస్కరించి, ''స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని, కానీ, ప్రయాగక్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును, వినవలెననడి కోరికవున్నది. కాన, ఈ యేకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాననని'' వేడుకొనగా, పార్వతీపతి యగు శంకరుడు, మందహాసముతో, నిట్లు వివరించెను, "దేవి! నీ యిష్టమును తప్పక తీర్చెదను శ్రద్దగా వినుము".

             సూర్యుడు మకరరాశియందువుండగా, మాఘమాసమందు, ప్రాతఃకాలమున, ఏ  మనుజుడు, నదిలో స్నానము చేయునో, ఆతడు సకలపాతకములనుండి విముక్తుడగుటయే కాక, జన్మాంతమందు, మోక్షమును పొందును. అటులనే, మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా, ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో, అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియేకాదు, జీవనది వున్నను, లేకున్నను, కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోటకాని, తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతకాలస్నానము, గొప్పఫలము నిచ్చుటయేగాక, సమస్తపాపములును, విడిపోవును. రెండవరోజు స్నానముజేసిన, విష్ణులోకమునకు, పోవును. మూడవనాటి స్నానమువలన, విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు, ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో, స్నానమాచరించిన యెడల, ఆ మనుజునకు, మరుజన్మ అనునది వుండదు. దేవీ! మాఘమాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను. మాఘమాసమునందు, భాస్కరుడు మకరరాశి యందుండగ, యేది అందుబాటులో వున్న, అనగా నదికాని, చెరువు కాని, నుయ్యి కాని, కాలువకాని, లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని, ప్రాతఃకాలమున స్నానమాచరించి, సూర్యభగవానునకు నమస్కరించి, తనకు తోచిన దానధర్మములుచేసి, శివాలయమునగాని, విష్ణ్వాలయమునగాని, దీపము వెలిగించి, భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము, యింతింతగాదు.

          ఏ మానవుడైననూ, తన శరీరములో శక్తిలేక, కడకు బావియందైననూ, స్నానమాచరించి, శ్రీవారి దర్శనమును చేసినచో, అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ, ఆ కష్టములు, మేఘములవలె విడిపోయి, విముక్తుడగును. ఎవరైననూ, తెలిసిగాని, తెలియకగాని, మాఘమాసములో, సూర్యుడు, మకరరాశియందుండగా, నదీస్నానమాచరించిన యెడల, అతనికి అశ్వమేధయాగము చేసినంతఫలము, దక్కును. అదియునుగాక, మాఘమాస మంతయు, ప్రాతఃకాలమున, నదిలోస్నానముచేసి, శ్రీమన్నారాయణుని పూజించి, సాయంకాల సమయంబున, మాఘపురాణము చదివి, విష్ణు మoదిరమునగాని, శివాలయమున గాని, దీపము వెలిగించి, ప్రసాదము సేవించిన యెడల, అతనికి తప్పక, విష్ణులోకప్రాప్తి కలుగుటయేకాక, పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక, స్త్రీలు కూడా, ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తరువాత, మరల ఘోరపాపములుచేసి, మరణారంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె, తాను బ్రతికున్నంత కాలము, మాఘమాసమందు నదీస్నానము చేసి, దానధర్మాది పుణ్యముల  నాచరించి, వైకుంఠ ప్రాప్తి నొందుట, శ్రేయస్కరముగదా! ఇదే మానవుడు, మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ! యే మానవుడు, మాఘమాసమును, తృణీ కరించునో, అట్టివాడు, అనుభవించు నరకబాధల గురించి వివరించెదను. సావదానముగా ఆలకింపుము".

  నేను తెలియజేసిన విధయముగా, ఏ మనుజుడు, మాఘమాసమందు, ప్రాతఃకాలమున, నదీస్నానముగాని, జపముగాని, విష్ణుపూజగాని, యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో, అట్టివాడు, మరణానంతరమున, సమస్త నరకబాధలను అనుభవించుచు, కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును, ఱంపములచేత, ఖడ్గములచేత నరకబడును. సలసలకాగు తైలములో, పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి, కాలకృత్యములను తీర్చుకొని, నదికిపోయి స్నానము చేసి, సూర్యనమస్కారము విష్ణుపూజా చేసి, తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామల సేవలు చేయునో, అట్టి ఉత్తమ స్త్రీ, అయిదవతనముతో వర్ధిల్లి, యిహమందు, పరమందున, సర్వసౌఖ్యములు, అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు, యేస్త్రీ అటులచేయదో, అట్టి స్త్రీముఖము చూచినంతనే, సకలదోషములూ, కలుగుటయేగాక, ఆమె పంది, కుక్క, జన్మలనెత్తి, హీనస్థితినొందురు. మాఘమాసస్నానమునకు, వయఃపరిమితిలేదు, బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైననూ, జవ్వనియైననూ, ఏ  కులమువారైననూ కూడా, మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు, కడునిష్ఠతో వుండిన, కోటియజ్ఞములు చేసినంత పుణ్యముకలుగును.

యిది అందరికిని శ్రేయోదాయకమైనదిv.
పార్వతీ! దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగలించినవారు, గురు భార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసచేయువారు మాఘమాసములో నదీస్నానము చేసి, విష్ణువును పూజించినయెడల, వారి సమస్తపాపములు నశించుటయేగాక, జన్మాంతరమున, వైకుంఠప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైనవాడును, కించిత్ మాత్రమైననూ, దానధర్మములు చేయనివాడునూ, యితరులను వంచించి, వారివద్ద ధనమును హరించినవాడును, అసత్యమాడి ప్రొద్ధుగడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదావ్యభిచార గృహములలో తిరిగి, తాళిగట్టిన ఇల్లాలిని, బిడ్డలను, వేధించువాడును రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను యెగతాళిచేయువాడును, గర్వముకలవాడై, తానే గొప్పవాడనని 
అహంభావముతో, దైవకార్యములనూ, ధర్మకార్యములనూ, చెడగొట్టుచూ, దంపతులకు విభేదములను కల్పించి, సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడుపనులకు ప్రేరేపించువాడను, యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము, యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే, మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే, పవిత్రులగుదురు. దేవీ! ఇంకనూ, దీని మహత్యమును వివరించెదను. వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూరకర్మములు ఆచరించువారు, సిగ్గువిడిచి తిరుగువాడు, బ్రాహ్మణదూషకుడు మొదలగువారు, మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల, వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును, ప్రాతఃకాలముననే, చేయవలెను. అలాగున చేసినచో, సత్ఫలితము కలుగును. యే మానవుడు భక్తిశ్రద్ధలతో, మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ, స్నానములు చేసెదనని సంకల్పించునో, అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి, యెటువంటి దోషములూ లేక పరిశుద్ధుడగును, అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ! పండ్రెండు మాసములలోనూ, మాఘమాసము, మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో, శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో, వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో, బ్రాహ్మణుడధికుడు, అన్ని పర్వతములలో, మేరుపర్వతము గొప్పది. అటులనే, అన్ని మాసములో, మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచేత, ఆ మాసమంతా ఆచరించెడి యే స్వల్పకార్యమైననూ, గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానముచేయని మనుష్యుడు, తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగానున్న వారు, చలిలోచన్నీళ్లలో స్నానము చేయలేరు. కాన, అట్టివారికి, యెండుకట్టెలు తెచ్చి, అగ్ని రాజవేసి, వారిని చలికాగనిచ్చి, తరువాత స్నానము చేయించినయెడల, ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగినవారు, స్నానము చేసి, శ్రీవారిని దర్శించిన పిదప, అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి, నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీదబ్రాహ్మణునికి, వస్త్రదానము చేసిన యెడల, శుభఫలితము కలుగునుl.

ఈ విధముగా, ఆచరించెడి వారినిజూచి, యే మనుజుడైనను, అపహాస్యము చేసినను, లేక అడ్డు తగిలినను, మహా పాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే, వృద్ధులగు తండ్రిని, తల్లిని, భార్యను, లేక కుటుంబసభ్యులందరినీ మాఘమాస  స్నానమాచరించునటుల, యే మానవుడు చేయునోO అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే, బ్రాహ్మణునికి కాని, వైశ్యునికికాని, క్షత్రియునికి కాని, శూద్రునికి కాని, మాఘమాసస్నానమును చేయుమని చెప్పినయెడల, వారు పుణ్యలోకమునకు పోవుటకు, యే అడ్డంకులునూ ఉండవు. మాఘమాసస్నానములు చేసినవారిని గాని, చేయలేని వారినికాని, ప్రోత్సహించువారలనుకాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి, ఘోర నరకబాధలు కలుగటయేగాక, ఆయుఃక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు, మాఘమాసములో, కాళ్ళుచేతులు, ముఖము కడుగుకొని, తలపై నీళ్ళుజల్లుకొని, సూర్యనమస్కారములు చేసి, మాఘపురాణమును చదువుటగాని, వినుటగాని, చేసిన, యేడవ జన్మాంతమున, విష్ణు సాన్నిధ్యమును, పోందుదురు. పాపము, దరిద్రము నశింపవలయునన్న, మాఘమాస స్నానముకన్న, మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా, వంద అశ్వ మేధయాగములుచేసి, బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణలిచ్చిన, యెంతటి పుణ్య ఫలము కలుగునో, మాఘస్నానము చేసిన, అంతటి పుణ్య ఫలము కలుగును . బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను, మాఘమాసమంత యును, కడు నిష్ఠతోనున్న యెడల, రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ! మాఘమాస స్నానము వలన, యెట్టి ఫలితము కలుగునో, వివరించితిని గాన, నే చెప్పిన రీతిన, ఆచరించుట, అందరికినీ శుభప్రదము.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


మాఘ పురాణం - 3 వ అధ్యాయము*_

 _*గురుపుత్రికాకథ*_

మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసస్నాన ప్రభావముచే, పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై, తన భర్తతో, హరిసాన్నిధ్యమునందినది. అని శివుడు, పార్వతీ దేవితో, పలికెను. అప్పుడు పార్వతీదేవి, "స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు?ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాపవిముక్తి నందిన విధానమేమి?  వివరముగ చెప్పగోరుచున్నాననగా, శివుడిట్లుపలికెను. దేవి! వినుము. పూర్వము, సౌరాష్ట్రదేశమున, బృందారకమనే గ్రామంలో, సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్రపండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ, విద్యాభ్యాసం చేస్తూవుండేవాళ్లు. ఆ సుదేవునికి, సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో, ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను, ఎవరికిచ్చి వివాహం చేయగలనని, అతడు విచారిస్తూవుండేవాడు.

           ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు, సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం, గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రికకూడా, సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును, చాలాదూరముపోయి, ఆ అరణ్యములో, ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున, యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేకవర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైనవానిచే, ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలు గుంపులు కట్టి, మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చినమాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము, ఒక ఏకాంతమందిరములా వుందిl.

గురుపుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి, అచట వృక్షములకున్న పండ్లను తిని, ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో, నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము, నీకును నాకును నచ్చినది. మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక, సుఖప్రదమగును. ఆలసించక,నావద్దకు రమ్ము, నా శరీరము, దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము. నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మని"పిలిచెను. సుమిత్రుడు "మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు. మనము సోదరీసోదరులము, నీవు మన్మధ పరవశురాలవై, ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము, చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున యింటికి పోదము  రమ్ము, గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో, నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము" అని పలికెను.

 గురుపుత్రిక, ఆ మాటలను విని," ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యాదేవత, అమృతము, స్వయముగ చెంతకు చేరినపుడు, వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక, సుఖమునందక, నేనింటికిరాను. నేనిచటనే, నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి, నేను రానిచో, మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి, దీని ఫలితము అనుభవింపుము" అని నిష్టురముగ, మన్మధావేశముతో, మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు, గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో, మన్మధశయ్యను తీర్చుకొని, మనోహరమైన ఆ వాతావరణములో, యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత, సమిధలు మున్నగువానిని దీసికొని, గ్రామమునకు బయలుదేరిరి. గురువు, శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి," నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని, విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు, అట్లేయనిలోనికెగెనుv.

  తండ్రియామెను, కాశ్మీరదేశవాసియగు బ్రాహ్మణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు, ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి, నేలపై బడి, దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక, సుదేవుడును, మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖములనందవలసిన వయసులోనే, బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన, ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా, అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు, వాని భార్య, దుఃఖించుచుండగా, దృడవ్రతుడను యోగి, ఆ ప్రాంతమున దిరుగుచు, సుదేవుని, రోదనధ్వనిని విని, వాని వద్దకు వచ్చి, ''జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు, తన దుఃఖకారణమును చెప్పి, మరల దుఃఖించెను. యోగి సుదేవుడను, భార్యపుత్రికలను చూచి, క్షణకాలము ధ్యానయోగమునంది, యిట్లు పలికెను. "ఓయీ! వినుము నీ కుమార్తే9 పూర్వజన్మలో, క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణియై, చెడు ప్రవర్తన కలిగియుండెను.

సౌందర్యవతి, యౌవన వతి యగు ఆమె, తన జారుల మాటలను విని, తన భర్తను వధించెను. భర్తను వధించి, భయపడి, శోకించి, ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతిహత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ దోషమువలన, ఈమెకీ జన్మమున, యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె, పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని, నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో, మాఘమాసమున, సరస్వతీ నదీతీరమున, గౌరీవ్రతము నాచరించువారితో కలసి, వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా, నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున, నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును, స్వేరిణియై, నీ శిష్యులతో, అధర్మముగ, రమించెను. ఈ దోషమువలన, నీమె తమ కర్మఫలములను, యిట్లననుభవించుచున్నది. చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా!l"

సుదేవుడు, యోగిమాటలను విని, చెవులు మూసుకొని, తన కుమార్తె, పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుటను,ఈ జన్మలో కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటను, విని, మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, ''తండ్రీ! నా కుమార్తే చేసిన పాపము, యేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును? దయయుంచి చెప్పుడని, పరిపరివిధముల ప్రార్థించెను. అప్పుడా యోగి, ''ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములు, పోవుటకు, ఆమె మాంగల్యము    నిలుచునట్లును, చేయుటకొక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున, ప్రాతఃస్నానముచేసి, ఆ నదీతీరమునగాని, సరస్సు తీరమున,  యిసుకతో, గౌరీదేవిని జేసి, షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు, దక్షిణతో, నా గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగ, నీమముచే, ప్రతిదినముo చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములు, నశించును. మాఘశుద్ద తదియనాడు, రెండు క్రొత్తచేటలను తెచ్చి, వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపుకుంకుమ, మున్నగు సువాసిని అలంకారములనుంచి, దక్షిణ తాంబూలములతో, వాయనము నుంచి, సువాసినీ పూజచేసి, ముత్తైదువలకిచ్చి, ఏడుమార్లు, ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి, షడ్రసోపేత భోజనము పెట్టి, గౌరవింపవలయును. మాఘమాసమున, ప్రాతఃకాలస్నానముల చేతను, పైన చెప్పిన వ్రతాచరణము చేతను, ఈమెకు పాప  క్షయము కలుగును. భర్త పునర్జీవితుడై, ఈమె 
మాంగల్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు, విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి, గౌరివ్రతమాచరిoచిన సువాసిని, తన మాంగళ్యమును నిలుపుకొని, చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు, మాఘస్నానము చేసినచో, వారెట్టి వారైనను, 
హరియనుహ్రహమునొంది, చిరకాలము సుఖించి, పుణ్యలోకముల నందుదురు. అని, యోగి వివరించి, తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి, తన కుమార్తెచే, మాఘస్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును, భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత, సుదేవుని కుమార్తె పాపములుపోయి, ఆమె భర్త, పునర్జీవితుడయ్యెను. ఆమెయు, చిరకాలము, తన భర్తతో సుఖించి, తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి, దేహాంతమున, వైకుంఠమును చేరెను. కావున, మాఘమున, ప్రాతఃకాల స్నానము, నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి, తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను, యిహమున, సర్వసుఖములనంది, పరమున, వైకుంఠవాసులగుదురు సుమా, అని, శివుడు, పార్వతీదేవికి, మాఘస్నాన మహిమను వివరించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

      మాఘ పురాణం - 4వ అధ్యాయము*_ 

*సుమిత్రునికథ*

పార్వతీదేవియు శివునిమాటలను విని, స్వామీ మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు, సుదేవుని శిష్యుడుO అతడేమయ్యెనో, వాని వృత్తాంతము, నెరుగగోరుచున్నాను. దయయుంచి, దానిని వివరింపుడని కోరగా, శివుడిట్లు పలికెను. "పార్వతీ! సరియైన ప్రశ్ననడిగితివి. వినుము. సుదేవుని శిష్యుడును, తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను, చనిపోదునని, గురుపుత్రిక బెదిరించుటచే, భయపడి, ఆమెతో వ్యభిచరింతినని, అతడు బాధపడుచుండెను. తుదకు, తనలోని బాధను భరింపలేక, గురువు వద్దకు వచ్చి నమస్కరించి, యిట్లుపలికెను. "గురువర్యా! పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడొకనాడు సమిధలు మున్నగువాటికై అడవికి, మీ ఆజ్ఞచేపోతిని. మీ కుమార్తెయు బంతితోనాడుకొనుచు, నాతో మీరు చూచుచుండగానే, అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహరప్రదేశమున, నన్ను తనకోరిక తీర్చవలసినదిగ, బలవంతపెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె, ఓయీ! నీవు నామాటవిని, నన్నుకూడనిచో, నేనిచట, నా ప్రాణములను విడిచెదను అనగా, బలవంతముగ, నాత్మహత్య చేసికొందును. నేను లేకుండ, నీవింటికి పోయినచో, నాతండ్రి నా కుమార్తె యెక్కడయని అడిగిన, నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి, నాయందలి ప్రేమచే, నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా! యిప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగ కౌగలించుకొనుము. రమ్ము. నా కోరికను దీర్చుమనిy యనేక విధములుగ, నిర్భందించినది. నేనును, మీ శాపమునకు భయపడి, ఆ అరణ్యమున, నీ పుత్రికతో రమించి, ఆమె కోరికని తీర్చితిని. తరువాత నీ విషయమును, మీకు చెప్పుటకు భయపడితిని. మీకుమార్తె చేసిన ద్రోహమువలన, నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని, ప్రార్థించెను.

సుమిత్రుని మాటలను విని, సుదేవుడు కొంతసేపు విచారించి, యిట్లు పలికెను. "ఓయీ! నీవు యితరుల ఒత్తిడికిలోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో, మిక్కిలి యుత్తమ నదియైన గంగాతీరమునకు పోయి, పన్నెండు సంవత్సరముల పాటు, తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని" పలికెను. శిష్యుడైన సుమిత్రుడును, గురువుచెప్పిన యుపదేశమును పాటించి, గంగాతీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో, ఒకచోట, ఒక దివ్యమైన ఆశ్రమమును జూచెను. ప్రయాణము చేయవలసిన యతడు, అచట విశ్రమించదలచెను. అచటివారందరును, శిష్యులు, మిత్రులు, కుటుంబసభ్యులు మున్నగువారితో, మాఘస్నానముచేసి, శ్రీహరిని, ఆ సరస్సు తీరమున పూజించి, మాఘపురాణమును, వినుచుండిరి.
సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయువ్రతమెట్టిది, దయయుంచి వివరింపుడని, ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో, ఏ, లోకముకల్గును. మీరు పూజించునది, యేదైవమును? దయయుంచి చెప్పుడని యడిగెను. వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని, తమలోనోకడైన సత్యవ్రతుడను వానిని, విషయము వివరింపుమని, నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో, ఇట్లు పలికెను, "ఓయీ! శ్రద్దగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగ, మాఘమాసమున, ప్రాతఃకాలమున, నది, సరస్సు మున్నగువానియందు స్నానముచేసినవాడు, శ్రీహరికి యిష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతఃకాలస్నానము చేసి, తీరమున, శ్రీహరిని అర్చించి, శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు, మాఘమాసమంతయు గడుపుట, పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు, సత్యశౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్యచేసిన వానితో సమానులు, అబద్దపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్యలోలుడు, మాఘమాసస్నానము మానినవాడు, బ్రహ్మహత్యచేసిన వానితో, సమానులే,యగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను, అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగ కొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము నపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగలించువాడు, మద్యపానలోలుడు, ఆడినమాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు,పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్యభాషణుడు, భుజించుచు, అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను, పాడుచేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించు వాడు, వీరందరును, పాపాత్ములే సుమా. మేము చేయుచున్న యీమాఘమాస వ్రతమును పాటించినచో, యీ పాపుల బుద్ధులు మారి, పరిశుద్ధులై, పుణ్యములనందుదురు. మాఘస్నానము చేసి, తీరమున, తులసీదళములతో, మాధవునర్చించిన వాని పుణ్యo  అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము, శుభఫలప్రదము. ఈ వ్రత మాచరించిన వానికి, పునర్జన్మ యుండదు" అని సత్యవ్రతుడు, మాఘస్నానవ్రత ఫలమును, పెక్కువిధములుగ, వివరించెను. సుమిత్రుడును, వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును, వివరించెను. అప్పుడు వారు, "మాఘస్నానమును, మూడు దినములు చేసిన, సర్వపాపములు నశించును. కావున యీ మాసమున, యింకను మూడుదినములు, మిగిలియున్నది.

ఈ మూడుదినములును మాఘస్నానమాచరించి, ప్రాయశ్చిత్తముగ, గంగాతీరమున, తపము చేయుమని," సుమిత్రునకు హితము పలికిరిl.

సుమిత్రుడును వారి మాటప్రకారము, మాఘమాసము చివరలో, మిగిలిన మూడు దినములును, మాఘస్నానమును చేసి, గంగాతీరమునకు పోయి, ప్రాయశ్చిత్త తపమునారంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై, వర్ణింప రాని తీరులోనుండెను. ఈ విధముగా, పన్నెండు సంవత్సరములు, గడచినవి. అయినను మానక, అతడిట్లు తపమాచరించుచు, చక్రపాణియగు, శ్రీ హరి కృపావిశేషమునంది, అనుగృహీతుడై, మాఘస్నాన ప్రభావముచే, గంగాతీర తపశ్చర్యచే, కేవల ప్రాయశ్చితమునేగాక, మోక్షమును కూడా పొందెను. పార్వతీ! నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తంతమును, పూర్తిగ చెప్పితిని. సుమిత్రుని పాపవినాశమును, పుణ్యప్రాప్తిని, వివరించు యీ కథను, మాఘస్నానము చేసినవాడు. శ్రీహరి పూజానంతరము, ఒకసారి చదివినను, వైకుంఠమును, చేరును. వాని పితృదేవతలును, తమ పాపములను పోగొట్టుకొని, వైకుంఠమునందుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ, వ్యర్థములు సుమా!" అని శివుడు పార్వతికి వివరించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏







మాఘ పురాణం - 5
5వ అధ్యాయము - కుక్కకు విముక్తి కా విలుగుట

దిలీప మహారాజా! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమానకాలమందు యెన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికిని మాఘమాసము మొదలైన తరువాత, వారి కష్టములు క్రమేపి సమసిపోవును. మాఘశుద్ద దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీ మన్నారాయణుని పూజించినయెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి -

"నాధా! శ్రీ లక్ష్మినారాయణుల వ్రతము చేసిన యెడల మనోవాంఛా ఫలసిద్ది కలుగునని చెప్పియుంటిరి గదా! ఆ వ్రత విధానమెట్టిదో, యెటుల ఆచరించవలెనో తెలియ పరచుడని" కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నదిఒడ్డునగాని, ఇంటివద్ద కాని, మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య యెనిమిది రేకుల పద్మము వేసి, అన్ని రకాల పుష్పములు, ఫలములు తీసుకువచ్చి లక్ష్మినారాయణులను మంటపపు మధ్యనౌంచి, ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగిచెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్లను అందులోవుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్తవస్త్రము నొకదానిని కప్పి, లక్ష్మినారాయణుల ప్రతిమను ప్రతిష్టించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమునుంచి, ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను.

తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాసస్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు వుంచికాని, క్రొత్తగుడ్డలో మూటగట్టికాని దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని, లేక వినునప్పుడు కాని చేతిలో అక్షితలు ఉంచుకొని, చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపైవేసుకొనవలయును గాన ఓ శాంభవీ! మాఘస్నానముచేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మినారాయణులను నిష్ఠతో పూజించిన యెడల యెటువంటి మాహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. గౌతమమహర్షి, ఒకనాడు తన శిష్యులతోగూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గమందున్న ముని పుణ్గవులతో యిష్టాగోష్ఠులు జరుపు కొన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి, తీరమున నున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి

శ్లో. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే |
     అగ్రతశ్శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః ||

అని రావిచెట్టుకు నమస్కరించి, ఆ చెట్టు మొదట ఆసీనుడయి శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికి మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశామినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి ముగ్గులు, బొట్లుపెట్టి, మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు 

ఆ రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటనుండి లేచి ఉత్తరం వైపు మళ్ళి మరల తూర్పునకు తిరిగి, రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావిచెట్టు చుట్టు తిరిగివచ్చినది. అప్పటికి మూడుసార్లు ఆ మండపము చుట్టు ప్రదక్షిణము చేసినందునా, అది మాఘమాసము అయివున్నందునా అది వెంటనే తన కుక్క రూపమును వదలి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులయెదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుటచూచిన మునులూ, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. "ఓయీ! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?" అని గౌతముడు ప్రశ్నించెను.

"మునిచంద్రమా! నేను కళింగరాజును, మాది చంద్రవంశము నాపేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ వున్నాను, దానధర్మములనిన నాకు అతిప్రేమ, నేను అనేక దానాలు చేసియుంటిని, గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను, ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను.

అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములునునెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి, దైవ విగ్రహాలను ప్రతిష్టించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను యెన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో వున్న ధర్మాలన్నియును చేసియున్నాను. కాని, నేనిలా కుక్కనయ్యాను, దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విశరపరచెదను వినుడు.

ఒకానొక దినమున ఒకముని పుంగవుడు గొప్ప యఙ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా! దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను గాన, ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే యెదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని ఆ మునియు  నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, 'రాజా! నీకు గుప్త విషయములు తెలియజేయుదును, ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధ్లతో మాఘమాస మహత్మ్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాగ, అశ్వమేధయాగము చేసిన యెడల యెంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని లేక దానపుణ్యములు అనగా వందయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసిననూ మరియు మాఘపౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసిననూ మానవుడు యెటువంటి పాపములనైనను విడువగలడు.

ఒక వేళ యితర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీస్నానమాచరించి, దానధర్మాలాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు, అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినటుల మాటలాడి యిట్లంటిని. అయ్యా! మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును, అన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటికాదు గాన నేనుయే మాఘమాసములు చేయుటకాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయును. చలిదినములలో చన్నీళ్ళు స్నానము చేయుట యెంత కష్టము? ఇక నాకు యీ నీతిబోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికికోపము వచ్చినది, ముఖం చిట్లించుకొని సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసికొనకుండానే వెడలిపోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులుపట్టి బ్రతిమలాడగా, యెట్టకేలకు అంగీకరించి ధనమును తీసికొనిపోయెను, ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని, తరువాత నాకు వరుసగా యేడుజన్మలూ కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా యేడు జన్మలూ బాధపడితిని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టు మూడు పర్యాయములు ప్రదక్షిణము జేసితిని కాన నా పూర్వజన్మస్మృతి నాకు కలిగినది. దైవ యోగమును యెవ్వరునూ తప్పించలేరు గదా! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వ జన్మస్మృతి యెటుల సంక్రమించినదో వివరింపుడనివేడెదను అని రాజు పలికెను.

ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తువాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నియు యదార్థములే నీవు కుక్కవై యెటుల పవిత్రుడనైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడవై ఆలకింపుము.

నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములోనున్న నీవు దారినిపోతూ యిచ్చట నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు యెలాగున్నావో తెలుసా! నీ శరీరమున బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యముగా వున్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజచేయుచున్న సమయములో అచటకు జంతువు కాని, పక్షికాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను 
కొట్టబోవుటచే పారిపోయి, నైవేద్యమును తినవలెనను. ఆశతో తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము  కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట.

ఇక మాఘమాస మంతయు నదిలోస్నానం చేసి భగవంతుని ధ్యానించి, పురాణపఠనము చేసినచో యెంతటి ఫలమువచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావిచెట్టునకున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బయటకు వచ్చి, గౌతమఋషి పాదముల పైపడి బెకబెకమని అరచి, అటునిటు గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదలి  మునివనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి, గౌతమఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని 'అమ్మాయీ! నీ వెవ్వరిదానవు? నీ నామధాయమేమి? నీ వృత్తాంతము  యేమి?' అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ జేయుటకై యిట్లు చెప్పదొడంగెను.





మాఘ పురాణం - 6 వ అధ్యాయము*_

_*కప్పరూపమును విడిచిన స్త్రీ పూర్వకథ*_

మునిశ్రేష్ఠా! నా వృత్తాంతమును తెలియజేయుదును గాన 
ఆలకిoపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము, నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరితీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించినదిl. 

ఒకనాడు నా భర్త "సఖీ! మాఘమాసము ప్రవేశించినది, యీనెల చాల పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరమూ మాఘ స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును యీ మాఘమాసమంతయు యీ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతఃకాలమున నిద్రలేచి, కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికిపోయి నదిలో స్నానము చేయుదము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత, నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి, పువ్వులతోను, మంచి గంధము, అగరు, ధూప దీపములతోను పూజించి స్వామికి ఖండచెక్కర, పటికబెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతము, తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా వుండును" అని హితబోధ జేసెను.

నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి, అతనిని నీచముగా జూచితిని, నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి "ఓసీ మూర్ఖురాలా! నా యింటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషిణివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా, అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని, మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొర్రలో మండూకమువై పడిఉందువుగాక" అని నన్ను శపించెను.

"అమ్మాయీ! భయపడకుము, నీకీశాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును యేకాంతముగా చాలకాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతిమాటలు విననందున యెంత కష్టపడినావో తెలిసినదికదా! మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్రసంతతి, ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధనము కూడ నీకీ మాఘమాస వ్రతము మించిన మరి యొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతియైనది వ్రతము.
 నీ భర్త దూరదృష్టి కలజ్ఞాని, అతని గుణగణాలకు అందరూ సంతసించెడి వారు నిన్ను పెండ్లి యాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో నుండెడివాడు. కానీ, నీ వలన అతని ఆశలన్నీ నిరాశలయిపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టుతొర్రలో జీవించుమని శపించాడుl.
ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపమును పొందగలిగినావు అందునా యిది మాఘమాసము. కృష్ణానదీ తీరము. కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధములా అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలుకాని, పురుషులుకాని యీ సమయములో, ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కాని, తెలియక కాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి లయందునూ, పాడ్యమి రోజుననూ నదీ స్నానమాచరించినయెడల వారి పాపములు నశించును. మాఘ సుద్ధ పాడ్యమినాడునూ, అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినముల లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి, పురాణ కాలక్షేపము చేసినయెడల, శ్రీహరి సంతోషించి, మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతొ మాఘ పురాణము వినిన, మోక్ష ప్రాప్తి కలుగును", అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా, మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏






 పురాణం - 7 వ అధ్యాయము*_  

*_లోభికి కలిగిన మాఘమాస స్నానఫలము_*

వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును, దిలీపుడు యిట్లు తెలియజేసెను. "పార్వతీ! చాలాకాలం క్రిందట, దక్షిణ ప్రాంతమందు, అసంతవాడయను నామముగల పెద్దనగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు, తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది, కాని, అతడు ఇంకనూ, ధనాశకలవాడై, తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి, మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ, శ్రీహరిని ధ్యానించుటగాని, దానధర్మాలు చేయుటగాని, యెరుగడు. అంతేకాక, బీదప్రజలకు, వారి ఆస్తులపై, వడ్డీలకు ఋణాలిచ్చి, ఆ అనుకున్న గడువుకు, ఋణం తీర్చనందున, తప్పుడు సాక్ష్యాలతో, వ్యాజ్యములు వేసి, వారి ఆస్తులు సైతము స్వాధీన పరచుకొనేవాడు. ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను, ఆ రొజు సాయంత్రం, ఒక ముదుసలి బ్రాహ్మణుడు, బంగారుశెట్టి భార్యను చూచి, "తల్లీ! నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న, యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది, ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద, రాత్రి గడుపనిమ్ము. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను. ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెదను" అని బ్రతిమలాడెను.

తాయారమ్మకు జాలికలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి, అందొక తుంగచాపవేసి, కప్పుకొనుటకు వస్త్రమిచ్చి, పండుకొనుడని పలికెను. ఆమె దయార్ర్ద హృదయమునకుo ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి, విశ్రాంతి తీసుకొనుచుండగా, తాయారమ్మ ఒక ఫలమునిచ్చి, దానిని భుజింపుమని చెప్పి, "ఆర్యా! మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా! ఆ మాఘస్నానమేమి? సెలవిండు. వినుటకు కుతూహలముగా నున్నది" అని అడుగగా, నా వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని, "అమ్మా! మాఘమాసము గురించి చెప్పుట, నాశక్యము కాదు, ఈ మాఘమాసములో నది యందు గాని, తటాకమందు గాని, లేక నూతియందుగాని, సూర్యోదయము అయిన తర్వాత, చన్నీళ్ళు స్నానము చేసి, విష్ణుమందిరానికి వెళ్ళి, తులసి దళముతోను, పూలతోను, పూజ చేసి, స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను, తరువాత, మాఘపురాణము పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడువకుండా, నెలరోజులు చేసి, ఆఖరున బ్రాహ్మణ సమారాధన, దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల, మానవుని, రౌరవాది నరక విశేషములలో పడవేయు, అశేష మహాపాపములు, వెంటనే నశించిపోవును. ఒకవేళ, ఈ నెలరోజులూ చేయలేనివారూ, వృద్దులూ, రోగులు, ఒక్కరోజయినను అనగా ఏకాదశినాడు గాని, ద్వాదశినాడు గాని, లేక పౌర్ణమినాడు గాని, పై ప్రకారము చేసినచో, సకలపాపములు తొలగి, సిరిసంపదలు, పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను" అని చెప్పగా, ఆ బ్రాహ్మణుని మాటలకు, తాయారమ్మ, మిక్కిలి సంతసించి, తాను కూడ, ప్రాతఃకాలమున, బ్రాహ్మణునితో బాటు నదికిపోయి, స్నానము జేయుటకు నిశ్చయించుకొనెనుl.

అంతలో, పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా, ఆమె అతనికి, మాఘమాసము గురించి చెప్పి, తాను తెల్లవారుజామున, స్నానమునకు పోదునని, తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు, బంగారుశెట్టికి కోపమువచ్చి, వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటాకొరికి, "ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు. అధిక ప్రసంగముచేసినచో, నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో, పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికిని, ఒక్కపైసాకూడా వదలకుండా, వడ్డీలు వసూలుచేస్తూ, కూడబెట్టిన ధనమును, దానము చేయుదువా? చలిలో చన్నీళ్ళు స్నానముచేసి, పూజలుచేసి, దానములుచేస్తే, వళ్ళూ, యిల్లూ, గుల్లయి, నెత్తి పైన చెంగు వేసుకొని, 'భిక్షాందేహీ' అని అనవలసినదే జాగ్రత్త! వెళ్ళి పడుకో", అని కోపంగా కసిరాడు.

ఆ రాత్రి, తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా, యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా, అని, ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని, యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి, మగనికి చెప్పకుండ, నదికిపోయి, స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి , ఒక దుడ్డుకర్ర తీసుకొని, నదికిపోయి, నీళ్ళలోదిగి, భార్యను కొట్టబోవుచుండగా, ఆ యిద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి. అటుల మునుగుటచే, ఇద్దరికి, మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద, బంగారుశెట్టి, భార్యను కొట్టి, యింటికి తీసుకువచ్చినాడు.

కొన్ని సంవత్సరములు తరువాత, ఒకనాడు, ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు, ఇద్దరూ, చనిపోవుటచే, బంగారుశెట్టిని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి, కాలపాశము వేసి, తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి, ఆమెను రధముపై ఎక్కించుకొని, తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ, యమభటులతో, యిట్లు పలికెనుv.

"ఓ యమభటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట  ఏమిటి? ఇద్దరమూ సమానమేగదా" అని వారి నుద్దేశించి అడుగగా, ఓ అమ్మా! నీవు మాఘమాసములో, ఒకదినమున, నదీస్నానము చేయగా, నీకీ ఫలము దక్కినది. కానీ, నీ భర్త అనేకులను హింసించి, అన్యాయముగా ధనార్జన చేసి, అనేకులవద్ద అసత్త్యములాడి, నరకమన్న భయములేక, భగవంతునిపై భక్తిలేక, వ్యవహరించునందులకే, యమలోకమునకు, తీసుకొని పోవుచున్నాము" అని యమభటులు పలికిరి.

ఆమె మరల, వారినిట్లు ప్రశ్నించెను. "నేను ఒకే దినమున, స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు, నన్ను కొట్టుచూ, నాతో నా భర్తకూడా, నీటమునిగినాడు కదా!l శిక్షించుటలో యింత వ్యత్యాసమేల కలుగెను?" అని అనగా,  ఆ యమభటులకు సంశయము కలిగి, యేమియు తోచక, చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి, జరిగిన సంగతిని, ఆమె వేసిన ప్రశ్ననూ, తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికచూడగా, ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు, చిత్రగుప్తుడు విచారించి, బంగారుశెట్టిని కూడా, వైకుంఠమునకు తీసుకొని పొమ్మని, విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ, తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా, బంగారుశెట్టిని, పుష్పకవిమానము మీద తెచ్చి, వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ , మిక్కిలి సంతసమందిరి. రాజా! వింటివా! భార్యవలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో, భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను, భార్యా యధాలాపముగా, ఒక్కరోజు మాఘమాసస్నానము చేసినందున, యిద్దరికిని వైకుంఠప్రాప్తి కలిగినదిగా! గనుక మాఘస్నానము, నెలరోజులు చేసినచో, మరింత మోక్షదాయకమగుననుటలో, సందేహములేదు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


మాఘ పురాణం - 8 వ అధ్యాయము*

*దత్తత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట.

దత్తత్రేయుడు బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు. అతడు కూడ, లోక కళ్యాణముకొరకు, ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు, దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తత్రేయుని కాలములో, కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు 'మాహిష్మతీ యను నగరమును, రాజధానిగా జేసుకొని, పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తత్రేయులు, ఒకనాడు కార్తవీర్యార్జునుడు, దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి  నమస్కరించి, "గురువర్యా! మీ అనుగ్రహమువలన, అనేక విషయాలు తెలుసుకొని వుంటిని, కాని మాఘమాసము యొక్క మహత్మ్యమును వినియుండలేదు. కావున, మాఘమాసము యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి, నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను, అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు, కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి, ఈ విధముగా వివరించెను.

"భూపాలా! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు, 
ప్రపంచమందెచ్చటనూలేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే, వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి, ఒక్కొక్క సంవత్సరము, ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మములాచరించిన యెడల, దానివలన కలుగు ఫలము వర్ణించుటకు, నాకు కూడ సాధ్యము కాదు. అందునా, మాఘమాసమందు, నదిలో స్నానము చేసిన, గొప్పఫలితము కలుగుటయేకాక, జన్మరాహిత్యము కూడ కలుగును. గనుక, యే మానవుడైననూ, మాఘమాసములో, సూర్యుడు మకర రాశియందుండగా, మాఘస్నానముచేసి, ఒక సద్బ్రాహ్మణునకు, దానధర్మములు చేసినచో, పంచమహపాతకములు చేసినవాడైనను, ముక్తి పొందగలడు", అని, దత్తాత్రేయుడు, కార్తవీర్యార్జునికి, యింకనూ యీవిధముగా చెప్పుచున్నాడు. "పూర్వకాలమున గంగానదీతీరపు ఉత్తరభాగమున, భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులువలెనున్నారు. ఆ నగరములో, హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు, బంగారునగలు, నాణేములు రాసులకొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను, తండ్రి చనిపోగానే, అతని కుమారులిద్దరూ, తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని, యిష్టమువచ్చినటుల, పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి, కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో, ఉద్యానవనములో విహరించుచుండగా, కర్మవశాత్తు, త్రాచుపాము కరచుటచే, నోటివెంట నురుగలు గ్రక్కుచూ, చనిపోయినాడు, ఆ విధముగా, హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి, వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి, పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడుl.

"అయ్యా! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును, నాకు స్వర్గమును, యేల ప్రాప్తించును" అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు,  "ఓయీ వైశ్యపుత్రా! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు, ప్రతిదినము యామెతో సంగమించి, గంగానదిని దాటి, అవతల గట్టున, నీ మిత్రుని యింటికి  వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే, మాఘమాసములో కూడా, నదిని దాటుతుండగా, కెరటాలజల్లులు, నీశిరస్సుపై పడినవి. అందు వలన, నీవు పవిత్రుడవైనావు. మరొక విషయమేమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు, ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో, గోహత్యాది మహాపాపములు కూడ నశించును. కాన విప్రుని చూచుటవలన, నీకు మంచిఫలితమే కలిగినది. అదియునుకాక, ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును  కూడా, నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు, నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున, నిన్ను స్వర్గానికి పంపుచున్నాను" అని చిత్రగుప్తుడు వివరించెను. "ఆహా! ఏమి నా భాగ్యము. గంగాజలము నా మీద పడినంత మాత్రమునే, నాకింతటి మోక్షము కలిగినదా" అని వైశ్యకుమారుడు సంతసించి, దేవదూతలతో, స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
మాఘ పురాణం - 9 వ అధ్యాయము*_

_*గంగాజల మహిమ*_

*ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము.* మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి, వారధిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి, మహా బలమును సంపాదించి సముద్రమునుదాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంచలను తీర్చుకొనిరి. కనుక, పూజలో  శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా, గంగాజలము విష్ణుపాదములనుండి పుట్టినదియు, శివుని శిరస్సునుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని, "గంగ గంగ గంగ" అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగాజలముతో సమానమయినవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక, మాఘమాసములో 
గంగాస్నానము, అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ, గంగా జల మహత్మ్యము గురించి, కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు  వివరించెను.
కొంత కాలము క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండీరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు, ఒక గురుకుల విద్యార్థి వచ్చెను, బ్రాహ్మణ కన్యలాయువకుని అందము చూచి, మోహించి, అతనిని సమీపించి, చుట్టుముట్టి, మమ్ములను, వివాహం చేసుకోమని బలవంతము చేయగా, ఆ బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున, వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో, నీవు పిశాచానివి కమ్మని శపించగా, ఆ విధ్యార్థియూ, మీరుకూడ పిశచులగుదురుగాక అని, ప్రతి శాపమిచ్చుటచే, వారంతా పిశాచ రూపములతో, ఆ కొలను వద్దనే వుండి, అందరిని భాదించి, ఆహారము దొరికితే వాటాలకై, పెనుగులాడుకొనుచుండిరి.

కొంతకాలమునకు ఒక సిద్దుడాకోనేటి దగ్గరకురాగా, నా పిశాచముల తల్లి దండ్రులు, తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరిచేత, మాఘమాసములో, గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో, వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా, వారట్లు చేయుటచే, అయిదుగురికి యధా రూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు, మాఘమాసమహత్మ్యమే కారణము. మాఘమాస మందలి నదీ స్నానము, మనుజులకే కాక, దేవతలకు, గంధర్వులకు కూడ, పవిత్రమైనదిl.

ఒక మాఘమాసములో, ఒకగంధర్వుడు, తన భార్యతో భూలోకానికి వచ్చి, గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే, ఆమెకు దైవత్వము నశిoచి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచి పెట్టి, ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ, 
విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి, వయ్యారముగా, క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి, విశ్వామిత్రుడు తన్మయుడై, ఆమెను ప్రేమించుటచే, యిద్దరూ  కామక్రీడలలో తెలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు, తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు, గంధర్వస్త్రీ క్రీడిoచుచుండిరి. ఆ 
దృశ్యమును చూచి మండిపడుచు, తపస్వివై యుండి కూడా, యిలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని, 
విశ్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను, శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక, వానర ముఖం కలిగియుండగా, నారదుడు ఆ విషయము తెలుసుకొని, విశ్వామిత్రుని కడకు వచ్చి, " విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై, నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము. గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి, ఈ పాషాణముపై చల్లుము", అని వివరించగా, విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా, ఆ రాయి, పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మాఘ పురాణం - 10 వ అధ్యాయము*

*ఋక్షకయను బ్రాహ్మణ కన్యవృత్తాంతము*

పూర్వము భృగుమహాముని వంశమునందు, ఋక్షకయను కన్య జన్మించి, దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు, పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి, విరక్తితో యిల్లువిడిచి, గంగానది తీరమునకుపోయి, ఆశ్రమము నిర్మించుకొని, శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా, చాలా సంవత్సరములు ఆచరించుటవలన, అనేక మాఘమాస స్నానముల ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ, ప్రాణములు విడిచెను. ఆమె చాల సంవత్సరములు వైకుంఠమందేవుండి, తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే, బ్రహ్మదేవుడామెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా జేసి, "తిలోత్తమ" అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు, బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, "ఓయీ! మీకేమి  కావలయునో కోరుకొనుము" అని అనగా, "స్వామీ మాకు యితరుల వలన, మరణము కలుగకుండునట్లు వరమిమ్ము" అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే యిచ్చితిని అని చెప్పి, అంతర్ధానమయ్యెను.

బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ యిద్దరు రాక్షసులును, మహాగర్వము కలవారై, దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాదిక్రతువులలో, మల మాంస రక్తాదులు పడవేసి, ప్రజలను నానా భీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి, దేవతలందరినీ తరిమివేసిరి, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ, సత్యలోకమునకు వెళ్ళి, బ్రహ్మను వేడుకొని, "మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు, మీరిచ్చిన వరములతో, గర్వము కలవారై, తపశ్శాలురను బాధించుచు, దేవలోకమునకు వచ్చి, మమ్మందరను తరిమి, చెరసాలలో బెట్టి, నానాభీబత్సము 
జేయుచున్నారు. కాన వారి మరణమునకు యేదైనా ఉపాయమాలోచించు" మని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి, తిలోత్తమను పిలిచి,  "అమ్మాయి ఈ సుందోపసుందులను రాక్షసులకు, యితరులెవరి వల్లను, మరణము గలుగదని, వరము నిచ్చియున్నాను. వారు వర గర్వముతో, చాల అల్లకల్లోలము చేయుచున్నారు. కాన, నీవు పోయి, నీచాకచక్యముతో, వారికి మరణము కలుగునటుల ప్రయత్నించుము" అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి, సుందోపసుందులు వున్న యరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణపట్టుకొని, మధురమైన పాటలు పాడుకొనుచు, ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును, ఆమె మధురగానమునూ విని, ఆ దానవసోదరులు, అటు నిటు తిరుగునట్లామెననుసరిస్తూ, ప్రేక్షకులవలె వెంటాడుచుండీరి, "నన్ను వరింపుము, నన్ను వరింపుమని, తిలోత్తమను, యెవరికివారు, బ్రతిమలాడసాగిరి. అంతట నా తిలోత్తమ," ఓ రాక్షసాగ్రేసురులారా! మిమ్ములను పెండ్ళియాడుట నాకు యిష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ యిద్దరియెడల, సమాన ప్రేమతోనున్నాను. కాని యిద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది. కాని నాకోరిక యొకటి యున్నది. అది ఏమనగా, మీ యిద్దరిలో ఎవరు బలవంతులో, వారికే నేను  స్వంతము కాగలను" అని చెప్పెను.

ఆమె మాటలకు, సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి, నేను బలవంతుడననగా, నేను బలవంతునని, ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి, గ్రుద్దుకొనిరి. మల్లయుద్దము చేసిరి, ఇక పట్టుదల వచ్చి, గదలు పట్టిరి, మద్దరాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము, రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరచుచు, భయంకరంగా యుద్ధము చేసిరి. గదాయుద్ధము తరువాత, కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో, ఒకరిఖడ్గము మరొకరికి తగిలినందునo యిద్దరి తలలూ తెగి క్రిందపడినవి, ఇద్దరూ చనిపోయిరిl.

తిలోత్తమను, దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి, జరిగినది  తెలియపర్చగా, బ్రహ్మ సంతోషించి,"తిలోత్తమా! నీవు మంచికార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము, నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే గాన, నీవు దేవలోకమునకు వెళ్ళుము, దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదు"వని పంపెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మాఘ పురాణం - 11 వ అధ్యాయము*

*భీముని ఏకాదశివ్రతము*

సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నదిలేనిచోట, తటాకమందుగాని, తటాకము కూడా అందుబాటులో లేనియెడల, నూతివద్దగానీ స్నానము చేసినచో, పాపములన్నియు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు, యమునానదీ తీరమందున్న, అగ్రహారములో, నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ, గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి, కీర్తి పొందినవారై యున్నారు.

అతడు చిన్నతనములో గడుసరి, పెంకివాడు, అతడు తల్లితండ్రుల భయభక్తులవలన, కొంతవరకు మాత్రమే, విద్య నేర్చుకొనెను. దుష్టసహవాసమును చేసి, అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి, కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను, తనకున్న ధనమును, తాను తినడు, యితరులకు పెట్టడు, ఒకనాటి రాత్రి, పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. "అయ్యో! నేనెంతటి పాత్ముడనైతిని ధనము, శరీరబలము వున్నదను మనోగర్వముతో, జీవితాంతమూ, ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు, చేయలేక పోయినానుగదా" అని పశ్చాత్తాపము నొందుతూ, నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా! ఆ నాటి రాత్రి, కొందరు చోరులు, అనంతుని యింటిలో ప్రవేశించి, ధనమూ, బంగారమూ యెత్తుకొని పోయిరి.
అనంతుడు నిద్రనుండి లేచి చూడగా, అతని సంపదంతా అపహరింపబడినది. అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని, రోదన చేసినాడు. ఆ సమయమున, పెద్దలనీతులు, జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు, ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే, మాఘమాసము నడచుచున్నందున, యమునా నదికి వెళ్ళి సానమాడెను. అందువలన అతనికి, మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి, తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి, బిర్రబిగసిపోవుచూ, 'నారాయణా' అని ప్రాణములు విడచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన, అతడు చేసియున్న పాపములన్నియు నశించిపోయి, వైకుంఠ వాసుడయ్యెను, అని వశిష్టుడు తెలియజేసెను.

పాండవులలో ద్వితీయుడు భీముడు, అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు. బండెడన్నమయినను చాలదు. అటువంటి భీమునకు, యేకాదశీ వ్రతము చేయవలయునని, కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో, బెంగతోయుండెను. అదేమందువా! "ఏకాదశీనాడు, భోజనము చేయకూడదు కదా! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా!" అని విచారించి, తన పురోహితుని కడకు బోయి, ఓయీ పురోహితుడా! అన్ని దినములకంటే, ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరుగదా! దాని విశిష్టత యేమి", అని భీముడు అడిగెను.

అందుకు పాండవ పురోహితుడు, ధౌమ్యుడు, "అవును భీమసేనా! ఆరోజు అన్ని దినములకంటెను, ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక, అన్ని జాతులవారును, యేకాదశీ వ్రతము చేయవచ్చును" అని పలికెను. సరే నేను అటులనే చేయుదును. గాని, "విప్రోత్తమా! నేను భోజన ప్రియుడునన్న సంగతి, జగధ్విదితమే గదా! ఒక ఘడియ ఆలస్యమైననూ, నేను ఆకలికి తాళజాలను, కనుక, ఏకాదశినాడు, ఉపవాసముండుట ఎటులా, అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే, ఆకలి యెక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున, యేకాదశి వ్రతఫలము, దక్కులాగున, నాకు సలహానీయుము", అని భీముడు పలికెను.

భీమసేనుని, పలుకులకు, ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, "రాజా! ఏకాదశి వ్రతమునకు, దీక్ష అవసరము. దీక్షతోనేకార్యము చేసినను, కష్టము కనిపించదు, కాన, నీవు దీక్ష బూనినచో, ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా, మాఘశుద్ద ఏకాదశి, మహాశ్రేష్ఠమైనది, దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయములో, మాఘ ఏకాదశిరోజు, పుష్యమి నక్షత్రముతో కూడినదైయుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది, మరి ఏమియులేదు. సంవత్సరమునందు వచ్చు యిరువదినాలుగు ఏకాదశులలో, మాఘశుద్ద ఏకాదశి మహాపర్వదినముగాన, ఆ దినము, ఏకాదశీ వ్రతము చేసిన, గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును, సంశయములేదు. కాన, ఓ భీమ సేనా! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, దీక్షతోనున్న యెడల, ఆకలి యేమాత్రమునూ కలుగదు, నియమము తప్పకూడదు" అని వివరించెను.

ధౌమ్యుని వలన, తన సంశయము తీరినట్లగుటలో, భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు, అతినిష్టతో వ్రతము చేసి, ఉపవాసముండెను. అందులకే, మాఘశుద్ధ ఏకాదశిని, "భీమ ఏకాదశి" అని పిలుతురు. అంతియేగాక, ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు, అత్యంత ప్రీతికరమగు, శివరాత్రి కూడా, మాఘమాసమందే వచ్చును. కాన, మహాశివరాత్రి మహత్మ్యమును గురించి కూడా, వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము" అని వశిష్టులవారు, దిలీపమహారాజుతో, నిటులపలికిరి. ఏకాదశి, మహావిష్ణువునకు యెటుల ప్రీతికరమైనదినమో, అదేవిధముగా, మాఘ చతుర్దశి అనగా, శివచతుర్దశి. దీనినే 'శివరాత్రీ యని అందురు. అది యీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమందలి, అమావాస్యకు ముందురోజున వచ్చెడి దీనినే, 'మహాశివరాత్రి" అని, అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో, కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును.

ప్రతి మాసమందువచ్చు మాస శివరాత్రి కన్నా, మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి, పరమేశ్వరునికి, అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలోగాని, తటాకమందుగాని, లేక నూతివద్దగాని, స్నానము చేసి, శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా, బిల్వపత్రములతో, పూజించవలయును. అటుల పూజించి, అమావాస్య స్నానము కూడా చేసినయెడల, యెంతటి పాపములు కలిగియున్ననూ, అవన్నియు వెంటనే హరించిపోయి, కైలాసప్రాప్తి కలుగును. శివపూజా విధానములో, శివరాత్రి కంటె మించినది, మరియొకటి లేది. కనుక, మాఘమాసపు కృష్ణపక్షములో, వచ్చు చతుర్దశి, ఉమాపతికి, అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున, ప్రతివారు, అనగా జాతిభేదముతో నిమిత్తము లేక, అందరూ, శివరాత్రి వ్రతమాచరించి, జాగరణ చేయవలయును.

మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో, కులీనుడను బోయవాడు, తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప, మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు. వేటకు బోవుట, జంతువులను చంపి, వానిని కాల్చి, తాను తిని, తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప, మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు. క్రూరమృగములు సైతం, ఆ బోయవానిని చూచి భయపడి, పారిపోయేడివి, అందుచేత అతడు, వనమంతా, నిర్భయముగా తిరిగేవాడు. ప్రతిదినము వలెనే, ఒకనాడు వేటకు వెళ్ళగా, ఆనాడు, జంతువులేమియు కంటబడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు, మనస్సంగీకరించనందున, ప్రొద్దుకృంగిపోయిన, అక్కడున్న మారేడుచెట్టుపైకెక్కి, జంతువులకొరకు, యెదురు చూచుచుండెను. తెల్లవారుతున్నకొలదీ, చలి ఎక్కువై, మంచుకురుస్తున్నందున, కొమ్మలను దగ్గరకులాగి, వాటితో, తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు, మహాశివరాత్రి. అందులో బోయవాడు, పగలంతా తిండితినక, రాత్రంతా జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ, మారేడు పత్రములు, శివలింగముపై పడినవి. ఇంకేమున్నది? శివరాత్రి మహిమ, బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో, కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండిలేక ఉపవాసముండుట, యివన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.

జరామరణములకు హెచ్చుతగ్గులుగాని, శిశువృద్ధ భేదములుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములనుబట్టి, మనుజుడు, తన జీవితమును గడపవలసినదే, మరికొన్ని సంవత్సరములకు, ఆ బోయవానికి, వృద్ధాప్యము కలిగి, మరణమాసన్నమై, ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి, వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా, కైలాసము నుండి, శివదూతలు వచ్చి, యమధూతల చేతిలోనున్న బోయవానిని, జీవాత్మను తీసుకొని, శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక, యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి, శివుని వద్దకు వెళ్ళెను. శివుడు-పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో, కొలువుతీరియున్న సమయములో, యముడు వచ్చి, ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి, ఉచితాసనమిచ్చి కుశలప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు, "మహేశా! చాలా దినములకు, మీ దర్శనభాగ్యము కలిగినందులకు, మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శనకారణమేమనగా, ఇంతకు ముందు, మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు, మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక, అనేక జీవహింసలు చేసి వున్నాడు. ఒకదినమున అనగా, మహాశివరాత్రినాడు, తాను యాదృచ్చికముగా, జంతువులు దొరకనందున, తిండితినలేదు. జంతువులను వేటాడుటకు, ఆ రాత్రి యంతయు మెలకువగానున్నాడేగాని, చిత్తశుద్ధితో ,తాను శివలింగమును పూజించలేదు. కనుక, అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా? అంతమాత్రమున, అతనికి కైవల్యము దొరకునా?" అని యముడు విన్నవించుకున్నాడు. "యమధర్మరాజా! నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున, బిల్వపత్రములు నాపై వేసి, తిండిలేక జాగరణతోనున్న యీ బోయవాడుకూడా, పాప ముక్తుడు కాగలడు.  బోయవానికి కూడా, ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక, ఈ బోయవాడు పాపాత్ముడైనను, ఆనాటి శివరాత్రి మహిమవలన, నా సాయుజ్యము ప్రాప్తమైనది" అని పరమేశ్వరుడు వివరించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మాఘ పురాణం అధ్యాయం - 12

శూద్రదంపతుల కథ*

వశిష్ఠమహర్షి దిలీపునితో, "మహారాజా మరియొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడి వాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై, మిక్కిలి యిష్టము కలవాడు, వ్యవసాయము చేయును. పశువులవ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను, యింకను సంపాదించ లేకపోవు చున్నానని, విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు, వాని యింటికి వచ్చెను. "అమ్మా నేను బాటసారిని, అలసినవాడను, చలి, చీకటి, మిక్కుటములుగ నున్నవి. ఈ రాత్రికి నీ యింట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే  వెళ్లిపోదునని" యింట నున్న కుముదను అడిగెను. ఆమెయు, వానిస్థితికి జాలిపడి యంగీకరించెను. ఆమె యదృష్టమో, ఆ బ్రాహ్మణుని యదృష్టమో, యజమానియగు సుమనందుడు! వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద! ఆ బ్రాహ్మణునకు, గొడ్లసావిడిలో, ఒక చోట బాగుచేసి, కంబళిమున్నగు వానినిచ్చి, పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు, ఉదయముననే లేచి, హరి నామస్మరణ చేయుచు, శ్రీహరి కీర్తనలపాడుచుండెను.

కుముద "ఓయీ నీవెచటినుండి వచ్చుచున్నావు? యెచటికి పోవుచున్నావని, యడిగెను. అప్పుడా విప్రుడు, "తుంగభద్రాతీరము నుండి శ్రీ రంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున, నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందులకై యిట్లు వచ్చితిని" సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా, మాఘమాస స్నాన మహిమను చెప్పెను, కుముదయు మాఘస్నానము చేయుటకైన, నదికి పోవలయునని యనుకొనెను. తానును వానితో నదికి పోయి, స్నానము చేసిరావలెననుకొనెను. తన యభిప్రాయమును చెప్పగ, బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీస్నానమునకు పోవుచుంటినని, భర్తకు చెప్పెను. సుమందుడు "నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు, అనారోగ్యమునకు, ధనవ్యయమగును. వలదు". అని యడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండ, బ్రాహ్మణునితో, నదీ స్నానమునకు పోయెను. సుమందుడు, భార్యను వెంబడించి, నదికి పోయి, నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి, నదిలో పడి, శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా, నా దంపతులకు, మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడ కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచు కొట్టుచు యింటికి తీసికొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును, స్నానము చేసి, దేవతార్చన చేసికొని, తన దారిన పోయెను. కొంతకాలమునకు, సుమందుడు, వాని భార్యయు మరణించిరి. యమభటులు, వారిని6 యమలోకమునకు గొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు, విమానముపై వచ్చి, కుముదను విమానమెక్కించి, ఆమె భర్తను, యమభటులకు విడిచిరి.

అప్పుడామె," విష్ణుదూతలారా! నామాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా, యమ లోకమునకు తీసికొనిపోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును, వానికి భయపడి, ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన, నేనును నా భర్తతో బాటు, యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను, విష్ణులోకమునకు, ఏల గొనిపోవుచున్నారని" యడిగెను. అప్పుడు విష్ణుదూతలు,  "అమ్మా నీవు దుష్టుని భార్యవై, వాని సహధర్మచారిణిగ, నరకమునకు పోవలసియున్నను, నీ భర్త దుష్కార్యములతో, నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడుపనులు, నీ కిష్టము కాకున్నను, భయమువలన గాని, పతిభక్తి వలన గాని, నీ భర్తకు యెదురు చెప్పలేదు. కాని మనసులో, వాని పనులకు, నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివికావు. ఇంతే గాక, మాఘమాస స్నానమును కూడ, మనః పూర్వకముగ భక్తితో చేసితివి. కావున నీవు, పుణ్యము నందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త, తన దుష్కర్మలకు తగినట్లుగా, యమలోకమునకు పోవునని పలికిరి.అప్పుడామే, నన్ను లాగుచు, "నా భర్తయు నీటిలో మునిగెను కదా!  మా పెనుగులాటలో, మూడుసార్లు, ఆయనయు నీటమునిగి లేచెను కదా! బలవంతముగ చేసినను, యిష్టము లేక చేసినను, మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా! ఆవిధముగా జూచినచో, నాపై కోపమున, నన్ను పట్టుకొని, నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు, మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు, నాతోబాటు, విష్ణులోకమునకు, రావలెను కదా యని, విష్ణుదూతలు, ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో, యమలోకమునకు పోయి, ప్రాణుల పుణ్యపాపముల పద్దును, వ్రాయు, చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి.

అప్పుడు చిత్రగుప్తుడును, సుమందుని, పుణ్యపాపముల పట్టికను జూచెను. సుమందుడుని, పట్టికలో నన్నియును పాపములే కాని, మాఘమాసమున, నదిలో స్నానము చేయుచున్న భార్యను, కోపముతో కొట్టబోయిన, నదీజలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని, తీరమునకు తీసికొని రావలయునను ప్రయత్నమున, నీటిలో పలుమార్లు మునిగి తేలుటవలన, నితడు యిష్టములేకున్నను. బలవంతముగ మాఘమాసమున, నదిలో పలుమార్లు మునుగుటచే, వీని పాపములు పోయి ,,విష్ణు లోక ప్రాప్తిని పొందవలసియున్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి.

కుముదను, ఆమె భర్తను, విష్ణులోకమును గొనిపోయిరి." రాజా! బలవంతముగ, నొక్కమారు చేసిన, మాఘమాస స్నానమునకు ఫలముగ, పూర్వము చేసిన పాపములుపోయి, విష్ణులోకమును పొందుదురు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
మాఘ పురాణం -13 వ  భాగం:

శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట :

వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, ఇంకనూ వినవలెనని కుతూహలుడై, దిలీపునకు మరల యిట్లు ప్రశ్నించెను.
“మహామునీ! ఈ మాఘమాస మహాత్మ్యమును, ఇంకనూ వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది. గాన సెలవిండ”ని ప్రార్థించగా వశిష్ఠుడు యిట్లు చెప్పసాగెను.

మున్ను పార్వతీ దేవికి  శివుడును, నారదునకు బ్రహ్మ, మాఘమాస మహాత్మ్యం గురించి చెప్పియున్నారు. గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును, వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాధి సేవితంబును, నానారత్న విభూషితంబునగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున, ఏకాంతంగా కూర్చుని వున్న సమయమున, జగజ్జనని యగు పార్వతీదేవి వచ్చి, భర్త పాదములకు నమస్కరించి, “స్వామీ! మీవలన అనేక పుణ్య సంగతులు తెలుసుకొంటిని. కానీ ప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును, మాఘమాస మహాత్మ్యమును వినవలెననెడి కోరిక వున్నది. గాన ఈ ఏకాంత సమయమందాక్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్న దాన!”నని వేడుకొనగా, పార్వతీ పతియగు శంకరుడు, మందహాసంతో, ఇట్లు వివరించెను.

"దేవీ! నీ యభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము. సూర్యుడు మకరరాశియందు వుండగా, మాఘమాసమందు, ప్రాతఃకాలమున, ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో, అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే గాక, జన్మాంతమందు, మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో, సూర్యుడు మకరరాశియందు వుండగా, ప్రయాగ క్షేత్రమందు, ఏ నరుడు స్నానమాచరించునో, అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియే గాదు, జీవనది వున్నను, లేకున్నను, కడకు పాదం మునుగునంత నీరు వున్నచోట గాని, తటాకమందు గాని, మాఘమాసంలో ప్రాతఃకాల స్నానము, గొప్ప ఫలము నిచ్చుటయే గాక, సమస్తపాపములు విచ్చిపోవును. రెండవరోజు స్నానం చేసిన, విష్ణులోకమునకు, పోవును. మూడవ నాటి స్నానం వలన, విష్ణుదర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల, ఆ మనుజునకు, మరుజన్మమనునది వుండదు.

దేవీ! మాఘ మాస స్నాన ఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసంనందు భాస్కరుడు మకరరాశియందు ఉండగా, ఏది అందుబాటులో వున్న, అనగా – నదిగానీ, చెరువుగానీ, నుయ్యి గానీ, కాలువ గానీ, లేక పాదము మునుగునంత నీరున్నచోట గానీ, ప్రాతఃకాలమున స్నానమాచరించి, సూర్య భగవానునకు నమస్కరించి, తనకు తోచిన దాన ధర్మములు చేసి, శివలాయమున గాని విష్ణ్వాలయమున గాని, దీపము వెలిగించి, భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు, వచ్చు పుణ్యఫలం అంతింతగాదు.

ఏ మానవునకైననూ, తన శరీరంలో శక్తిలేక, నడువలేనటువంటి వాడు, గోవుపాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటియందైనను, కడకు బావియందైననూ, స్నానమాచరించి, శ్రీహరి దర్శనము చేసినచో, అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ, వాని కష్టములు, మేఘమువలె విడిపోయి, ముక్తుడగును. ఎవరైనను తెలిసిగాని, తెలియకగాని, మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నాన మాచరించిన యెడల, అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదియును గాక, మాఘమాసమంతట ప్రాతఃకాలమున, నదిలో స్నానం చేసి, శ్రీమన్నారాయణుని పూజించి, సాయంకాలమున గానీ, దీపం వెలిగించి, ప్రసాదం సేవించిన యెడల, అతనికి తప్పక, విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక, పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషుడేగాక, స్త్రీలు కూడా, ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత, మరలఘోరపాపములు చేసి మరణానంతరం, రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె, తానూ బ్రతికి ఉన్నంతకాలం, మాఘమాసమందు, నదీస్నానం చేసిo దాన పుణ్యములు ఆచరించి, వైకుంఠ ప్రాప్తినొందుట శ్రేయస్కరం గదా! ఇదే మానవుడు మోక్షము పొందుటకు, దగ్గర మార్గం గాన, ఓ పార్వతీ! ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో, అట్టి వాడు, ఎటువంటి బాధలు అనుభవించునో, వివరించెదను. సావధానురాలవై ఆలకింపుము.

నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున జపముగానీ, విష్ణుపూజ గానీ, యథాశక్తి దాన పుణ్యములు చేయడో, అట్టి వాడు మరణానంతరం, సమస్త నరక బాధలు, అనుభవించును. కుంభీ నరకంలో, పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును. రంపముల చేత, ఖడ్గముల చేత నరుకబడును. సలసల కాగు తైలములో పడవేయబడును. భయంకర యమకింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువ ఝాముననే లేచి, కాలకృత్యంబులు తీర్చుకొని, నదికి పోయి, స్నానం చేసి, సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి, తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామలకు సేవలు చేయునో, అట్టి ఉత్తమ స్త్రీకి, అయిదవతనం వర్ధిల్లి, ఇహమునందు, పరమునందు, సర్వ సౌఖ్యములూ, అనుభవించును. ఇది ముమ్మాటికీ నిజం. మాఘమాసమందు, ఏ స్త్రీ అటుల చేయదో, అట్టి స్త్రీ ముఖం చూచిన, సకల దోషములు కలుగుటయేగాక, ఆమె పంది, కుక్క జన్మమెత్తి హీనస్థితి నొందును.

మాఘమాస స్నానమునకు, వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైనను, జవ్వనియైనను, మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు, కడునిష్ఠతో వుండిన, కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయక మైనది. “ పార్వతీ! దుష్టులలో స్నానం చేసినవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములు, చేసినవారు, సువర్ణము దొంగిలించిన వారు, గురు భార్యతో సంభోగించు వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసములో, నదీ స్నానం చేసి, విష్ణువును పూజించిన యెడల, అట్టివారి సమస్త పాపములు నశించుటయేగాక, జన్మాంతరమునo వైకుంఠప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును, కించిత్ మాత్రమైనను, దాన ధర్మములు చేయని వారును, ఇతరులను వంచించి, వారి వద్ద ధనము అపహరించిన వాడును, అసత్యమాడి పొద్దు గడుపు వాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించు వాడును, సదా వ్యభిచార గృహములో తిరిగి, తాళి కట్టిన ఇల్లాలిని, కన్నబిడ్డలను, వేధించు వాడును, రాజ ద్రోహి, గురుద్రోహియు, దేశభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వం కలవాడు, తాను గొప్ప వాడనను అహంభావంతో దైవకార్యాలను, ధర్మకార్యాలను, చెడగొట్టుచూ, దంపతులకు విభేదములు కల్పించి, సంసారమును విడదీయు వాడును, ఇండ్లను తగులబెట్టువాడునూ, చెడు పనులకు ప్రేరేపించు వాడునూ, ఈవిధమైన పాప కర్మలు చేయువారలు, ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరుపకనే, మాఘమాసమందు, మాఘమాస స్నానం చేసిన యెడల, వారందరూ పవిత్రులగుదురు.

“దేవీ! ఇంకనూ దాని మహాత్యంబును వివరించెదను. వినుము. తెలిసియుండియూ, పాపములు చేయు వాడునూ, క్రూర కర్మలు ఆచరించు వాడునూ, సిగ్గు విడిచి తిరుగు వాడనూ, బ్రాహ్మణ దూషకుడూ, మొదలగు వారు, మాఘ మాసములో, ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన యెడల, వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. ఆలాగున చేసినచో, సత్ఫలితం కలుగును. ఏమానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటినుండి ఆఖరు పర్యంతమూ స్నానమును చేసెదనని సంకల్పించునో, అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి, ఎటువంటి దోషములూ లేక, పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేర అర్హుడు అగును.
శాంభవీ! పండ్రెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో, మాఘమాసం శ్రేష్ఠమైనదగుటచే, ఆమాసమునందు, ఆచరించే ఏ స్వల్పకార్యమైననూ, గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగా వున్నదని స్నానం చేయని మనుష్యుడు, తనకు లభించబోవు పుణ్యఫలం, కాలితో తన్నుకున్నట్లేయగును. వృద్ధులు, జబ్బుగా వున్నవారు,, చలిలో చన్నీళ్ళలో స్నానం చేయలేరు. కాన అట్టివారికి, ఎండుకట్టెలు తెచ్చి, అగ్ని రాజేసి, వారిని చలికాగనిచ్చిన తరువాత, స్నానం చేయించినయెడల, ఆస్నాన ఫలం పొందగలరు. అదియునూ గాక, చలికాగిన వారు, స్నానం చేసి, శ్రీహరిని దర్శించిన పిదప, అగ్ని దేవునికి, సూర్య భగవానునికి నమస్కరించి, నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచియై, ఒక బీద బ్రాహ్మణుడికి, వస్త్రదానము చేసినయెడల, మంచి ఫలితము కలుగును.

ఈవిధంగా ఆచరించిన వారిని చూచి, ఏ మనుజుడైననూ! అపహాస్యంగా చూచిననూ, లేక అడ్డు తగిలిననూ, మహాపాపములు సంప్రాప్తించును. మాఘ మాసం ప్రారంభం కాగానే, వృద్ధులగు తండ్రినీ, తల్లినీ, తన భార్యనూ, లేక కుటుంబ సభ్యులందరినీ, మాఘస్నానము ఆచరించునటుల ఏమానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆవిధంగానే బ్రాహ్మణునిగానీ, వైశ్యుని గానీ, క్షత్రియుని గానీ శూద్రుని గానీ, మాఘ మాసస్నానం చేయమని చెప్పినయెడల, వాడు పుణ్యలోకం పోవుటకు, ఏ అడ్డంకులూ ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి గానీ, వారిని ప్రోత్సహించు వాళ్ళను చూసి గానీ ఆక్షేపించి పరిహాసములాడు వానికి, ఘోర నరక బాధలు కలుగుటయే కాక, ఆయుఃక్షీణం, వంశక్షీణం, కలిగి, దరిద్రుడగును.

నడుచుటకు ఓపిక లేని వారలు, మాఘమాసంలో కాళ్ళూ, చేతులు, ముఖము కడుగుకొని, తలపై నీళ్ళు జల్లుకొని, సూర్య నమస్కారములు చేసి, మాఘపురాణమును చదివి గానీ, వినుట గానీ చేసిన యెడల, జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును. పాపములు, దరిద్రము, నశింప వలయునన్న, మాఘస్నానం కన్నా, మరొక పుణ్యకార్యమేదియును లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా, వంద అశ్వమేధ యాగములు చేసి, బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన, ఎంతటి పుణ్యఫలము కలుగునో, మాఘ మాస స్నానము, అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృ హత్య, మహాపాపములు చేసిన మనుజుడైననూ, మాఘమాసమంతయూ, కడునిష్ఠతోనున్నఎడల, రౌరవాది నరకములనుండి, విముక్తుడగును.
కనుక ఓ పార్వతీ! మాఘమాస స్నానము వలన, ఎట్టి ఫలితము కలుగునో, వివరించితిని. కావున నే చెప్పిన రీతిని ఆచరించుము.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



_*మాఘ పురాణం - 14 వ అధ్యాయము*_

🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉

_*విప్రుని పుత్రప్రాప్తి*_

గృతృనమద మహర్షిని జూచి జహ్నముని యిట్లనెను.
మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే, మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని యడుగగ, జహ్నమహర్షి యిట్లనెను. "జహ్నమునీ! వినుము. మాఘమాస వ్రతము నాచరించుటచే, ప్రాణికి యిహలోక సుఖములు, పరలోక సుఖములు, కలుగును. వారి కష్టములు తీరును, అందుచే సంతుష్టుడైన మానవుడింకను, హరి ప్రీతికరములగు వ్రతముల నాచరించి, జ్ఞానియై, సత్కర్మల నాచరించి, ముక్తినందును. అట్టి కథనొక దానిని చెప్పెదను వినుము" అని యిట్లు పలికెను.

పూర్వము గంగా తీరమున, బ్రాహ్మణుడొకడుండెను. అతడు వేదవేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతిదయజ్ఞానము, యింద్రియ జయము కలిగినవాడు. అతని భార్యయునుత్తమురాలు. వారికి సంతానము లేదను లోటు తప్ప, మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడొకనాడు, భార్యతో, "గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడొకడున్నను మన వంశమునకు, మనకును, సద్గతులు కలుగునాయని విచారపడెను". అప్పుడామె, "నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో? అందువలన మనకు సంతానము కలుగలేదనుకొందును"అని సమాధానము ఇచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడు," ప్రియా కష్టతరమైన తపము నాచరించి అయినను, శ్రీమన్నారాయణుని సంతుష్టిపరచెదను. పుత్ర వరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి, నిశ్చలమైన తపముచేసి, మృకండు మహామునివలె, ఉత్తమ పుత్రవరమును కోరెదననియు పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరిl.

బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు, శ్రీహరిని, మనసులో నిలుపుకొని, తీవ్రమైన తపము ఆచరించెను. కొంత కాలమునకు, శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును, శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణిభూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యులకాంతితో
 నుండెను. శాంత భూషితమై ప్రసన్నతకల శ్రీహరి ముఖము, మకరమండలముల కాంతితో, మరింత శోభాయమానముగ నుండెను. నారదమహర్షి స్తుతించుచుండగా, అప్సరకాంతలు పాటలు పాడుచుండగా, లక్ష్మీసమేతుడై, గరుత్మంతుని పైనెక్కి, ఆ బ్రాహ్మణునకు, వరమీయవచ్చెను.

తనను గమనింపక, తీవ్రమైన తపమున నిమగ్నుడై యున్న బ్రాహ్మణుని చూసి, చిరునవ్వు నవ్వుచు, "విప్రా! నేను నీకు వరమునీయవచ్చితిని, నీ తపమునుమెచ్చితిని" అని పలికెను. శ్రీహరి యిట్లు పలికినను, ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై, బాహ్యజ్ఞానము లేని స్థితిలోనుండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి, నిశ్చల చిత్తముతో నతడు చేయుతపము, భగవంతుడగు శ్రీహరికి, మరింత ప్రీతి కలిగించెను. అతనికెట్టి వరమునైన, యీయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు, బాహ్యప్రపంచమునకు, మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా, నా బ్రాహ్మణుడు, కారణమేమని, కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే యెదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనందపరవశుడైన అతడు, శ్రీమన్నారాయణ మూర్తినిట్లు స్తుతించెను.

_*విప్రకృత విష్ణుస్తుతి*_

నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |
నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||
గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |
కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||
లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |
అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే ||
యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |
జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||
సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |
కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||
నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |
విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||
సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |
హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||
పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |
ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||
జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |
వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||
జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |
ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||
నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |
గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||
కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |
కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||
సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |
భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||
నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |
నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||
(శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు, భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము, అందరు చదువుట శ్రేయస్కరము)

జహ్నుమునీ! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి, ఆనంద పరవశుడై, నమస్కరించుచు నిలిచియుండెను, భగవంతుడు వరమును కోరుకొమ్మనెను శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు ''స్వామీ! నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము, ఇహలోకమున, పరలోకమున, సద్గతికి కారణమైన, పుత్రసంతానమునిచ్చి, నాకు ముక్తినొసగుమ"ని కోరెను.

శ్రీహరి, నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు చెప్పిన 
యీ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి, నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదునని పలికి, యంతర్థానము నుందెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కి లాభము నందినవానివలె సంతసింసించు, తన యింటికి చేరెను. కొంతకాలమునకు, వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.

కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి, వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య, బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని, వానిని,  నిమురుచు, కన్నీరు కార్చుచు, నిట్టూర్పులు విడుచుచుండెను. విచారవదనముతో, ఆహారమును తీసికొనక, విచారించుచుండెను. "నాధా నీవు త్రీవ్ర తపమొనర్చి, వరముగా, నీ పుత్రుని పొందితివి. చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు, పండ్రెండు సంవత్సరములు జీవించి, విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా! నేనీ పుత్రశోకము నెట్లు సహింపగలను?" అని భర్తతో పలికెనుl.

ఆ విప్రుడును, భార్య మాటలను విని, బాధపడుచు, నామెనోదార్చ నిశ్చయించెను. ఆమె నూరడించుచు, యిట్లనెను. "ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది. అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయెట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా? నీకు, నాకును, యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు, మనము మరిణించిన తరువాతనైన, మరణింపక తప్పదు కదా! మరి యీ ముందు వెనుకలు, వయస్సులకు కలదు కాని, మృత్యువునకు లేదు. కావున నీవును శోకింపకుము. జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో, నీకు విచారమేల? నీవు దుఃఖించినను, కానున్నది కాక మానదు. అనగా, నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతిప్రాణియు, తాను చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా? కావున శోకింపకుము" అని, యామెనూరడించెను, "మరియు నిరర్థకమైన దుఃఖమును విడుపుము. శ్రీహరిని పూజించి, పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ నుండుము" అని పలికి, మరల గంగాతీరమున చేరి, నియమనిష్టలతో శ్రీహరిని, సర్వోపచారములతో, పూజించుచుండెను. శ్రీహరి, అష్టాక్షరీ మంత్రమును, జపించెను. శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది, ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు, శ్రీమన్నారాయణునకు, సాష్టాంగ నమస్కారము చేసి, నిలిచియుండెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



*మాఘ పురాణం - 15 వ అధ్యాయము*

*జ్ఞానశర్మకథ - మాఘపూర్ణిమ*

గృత్నృమదుడు జహ్నువుతో, నిట్లనెను. తపమాచరించు బ్రాహ్మణునకు, శ్రీహరి ప్రత్యక్షమయ్యెను, బ్రాహ్మణుడు, శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి, "ఓయీ! నీవు మరల నారాకను గోరి తపమచరించితివి  యెందులకు? నీ మనస్సులో నేమియున్నది చెప్పుమ"ని యడిగెను. అప్పుడా విప్రుడు, '"స్వామీ! నాకు పుత్రవరము నిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను, కాని నారదమహర్షి వచ్చి, యీ బాలుడు, పండ్రెండు సంవత్సరముల తరువాత, మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది, నా దుఃఖమును పోగొట్టుకొనగోరి, తపమాచరించితినని, శ్రీహరికి విన్నవించెను.

అప్పుడు శ్రీహరి, 'ఓయీ! ఉత్తముడైన నీ పుత్రునకు, పండ్రెండవ సంవత్సరమున, గండము కలుగుటకు, కారణమును వినుము. నీ భార్య, పూర్వ జన్మమున చేసిన దోషమే, యిప్పుడీ  గండమునకు కారణము. పూర్వజన్మమున గూడ, మీరిద్దరును భార్యాభర్తలే. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును, నీ భార్యయే.ఆమె ఉత్తమశీలము, గుణములు కలిగియుండినది.ఆమె భర్తయగు జ్ఞానశర్మ, ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘపూర్ణిమ యందు వ్రతమాచరించి, పాయసదానము చేయలేదు. ఆ దోషము వలన, నీ భార్యపుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో, మాఘ వ్రతము నాచరించినందున, యీ జన్మయందును, విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను, గత జన్మలో, నీ భార్య, మాఘపూర్ణిమనాడు చేయవలసిన, పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయను, రెండు దోషముల వలన, పండ్రెండు సంవత్సరముల తరువాత, గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి, గంగోదక బిందువులతో, నీ పుత్రుని తడుపుము. ఇందువలన, గండదోషముపోయి, నీ పుత్రుడు చిరంజీవియగును.
ఓయీ! మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును యిచ్చును. మాఘస్నానము చేయనివారికి, వారి సంతానమునకు, ఆపదలు కల్గును, అధిక పుణ్యములని, గత జన్మలలో చేసిన వారికి, మాఘమాస వ్రతము నాచరింపవలయునని, సంకల్పము కలుగును. మాఘస్నానము, సర్వపాపదోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు, దీర్ఘాయువులు, బుద్దిమంతులు, ఆరోగ్యవంతులు అయి, ముక్తినందుదురు. మాఘమాసస్నాన వ్రతము, కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రతము, బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్టుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు, వీరు మాత్రమే, బాగుగ తెలిసినవారు. ఇతరులు దాని మహిమను, పూర్తిగా నెరుగరు, మాఘవ్రత మహిమ, కొంతయే తెలిసినవారు, పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ, అందరికిని తెలియదు. నా భక్తులు, మాఘవ్రత పారాయణులు మాత్రమే, మాఘవ్రత మహిమనెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే, మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును, నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున, గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి, శ్రీహరి అంతర్హితుడయ్యెనుl.

బ్రాహ్మణుడును, శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా, మాఘవ్రత గంగాజలముచే తడిపెను, బాలునకును, శ్రీహరి దయ వలన, గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము, తొలగెను. బ్రాహ్మణుడును, ఆ బాలునకు, మూడవ సంవత్సరమున, చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములయందు, చేయదగిన సంస్కారములను చేసి, విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున, మృత్యుదోషము, శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్యా, పుత్రుడు, అందరును, సుఖ సంతోషములతో, కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు, పుత్రుని గృహస్థుని చేసి, యోగ మహిమచే ,శరీరమును విడిచి, శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.
జహ్ను మునివర్యా! మాఘవ్రతమునకు సాటియైనది, మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి, పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడనిచ్చును. ఈ వ్రతమును, అన్ని వర్గముల వారును ఆచరించి, యిహలోక సౌఖ్యములను, నిశ్చలమగు హరి భక్తిని పొంది, సంసార సముద్రమును తరించి, పరలోకసౌఖ్యమును గూడ, పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని, గృత్నృమద మహర్షి, జహ్నుమునికి వివరించెను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*మాఘ పురాణం - 16 వ అధ్యాయము*

*విద్యాధరపుత్రిక కథ*

రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని, మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు, సంతానము కావలయునని, బ్రహ్మనుద్దేశించి, గంగాతీరమున, తపము చేయుచుండెను. నియమవంతుడై, భక్తి శ్రద్దలతో, చిరకాలము, తపమాచరించెను. అతడిట్లు, చిరకాలము తపము చేయ,గా బ్రహ్మ సంతుష్టుడై, వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ "నాయనా! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపమునకు మెచ్చి, పుత్రిక ననుగ్రహించుచున్నానని" యంతర్దానమునందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను, మిక్కిలి సుందరమై, సద్గుణాన్వితయై, కన్నవారికిని, తనను చూచినవారికిని, సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును, ఆనందమును కలిగించు, 
ఈమెను, యెవరికోయిచ్చి, అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను, అల్లుని కూడ, నా యింటనే యుంచుకొందునని,  నిశ్చయించుకొనెను. ఒకనాడొక రాక్షసుడామెను చూచెను, ఆ రాక్షసుడు, దేవీ భక్తుడు. ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను. కోరిన రూపము ధరింపగల  శక్తిని కూడ సంపాదించెను. ఆ రాక్షసుడు, విద్యాధర పుత్రికను చూచినంతనే, ఆమెపై మరులుకొనెను. ఆమె నెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను. ఆ రాక్షసుడు, మిక్కిలి శక్తిమంతుడు, శివుని తపముచే మెప్పించి, శివుని శూలమును, కోరి పొందెను. శివుడును, వానికి, శూలము  నిచ్చుచు, "ఓయీ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో, నీవు మరణింతువని" చెప్పి, యిచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు," నన్ను మించిన శత్రువెవ్వడు, నా ఆయుధము, శత్రువునెట్లు చేరును? "అని తలచి, వర గర్వితుడై, యెవరిని లెక్కచేయక, ప్రవర్తించుచుండెను.

అట్టి రాక్షసుడు, విద్యాధర పుత్రికను చూచి, "సుందరీ! నన్ను వరించుమని యడిగెను. ఆమెయు, నా తండ్రినడుగుమని చెప్పెను. రాక్షసుడును, విద్యాధరుని వద్దకు పోయి, వాని కుమార్తె నిచ్చి, వివాహము చేయమని కోరెను. విద్యాధరుడు, వానికి, తన కుమార్తె నిచ్చి, వివాహము చేయుటకు, తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక, మరల వచ్చెను, విద్యాధరుని పుత్రికను హరించి, సురక్షితముగ, సముద్రము క్రిందనున్న తన యింట ఉంచెను. శుభముహూర్తమున, ఆమెను వివాహమాడదలచెను, విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని, విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి, తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని యడుగగా, బ్రహ్మ యెనిమిది మాసముల తరువాత, మంచి ముహూర్తమున్నది. అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు, అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో, ఎనిమిది మాసముల తరువాత, శుభముహూర్తమున, నిన్ను వివాహమాడుదును, ఈ లోపున, నిన్నేమియు బాదింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి యిత్తుననగా, ఆమె,  యేమియు, మాటలాడలేదు, రాక్షసుడు మరల మరల నడుగగా, ''నాకిప్పుడేమి అక్కరలేదు, ప్రతి సోమవారము, సాయంకాలమున, శివుని దర్శించు వ్రతమున్నది. దర్శించి పూజించుటకు, శివలింగమెచటనున్నదో, చూపుమని అడిగెను. ఆ రాక్షసుడు, పాతాళములో వున్న, హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు, రాక్షసుని అనుమతితో, శివ సందర్శనమునకై, ప్రతి సోమవారము, పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె, పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను. అప్పుడఛటకు, త్రిలోకసంచారియగు, నారద మహర్షియు, హటకేశ్వరుని దర్శింప వచ్చి, యామెను జూచెను. ఆశ్చర్యపడి, 'అమ్మాయి! నీవిచటనున్నావేమని' అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు, తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెననియు చెప్పెను.

నారదుడామె చెప్పినదంతయును వినెను. "అమ్మాయీ! భయపడకుము. విష్ణుభక్తుడై, నీకు భర్తయగు వానిని, నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త విచారింపకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకెదురుగ, మానస సరోవరము కలదు. మాఘమాసమున, నీవీ సరస్సు స్నానమాచరింపుము. గంధపుష్పాదులతో, శ్రీమన్నారాయణుని పూజించి, ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు, కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమని చెప్పి నారదుదు తన దారిన పోయెను.

విద్యాధర పుత్రికయు, నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి, స్నానము చేసి, పూజ మున్నగు వానిని చేయుచుండెను. నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును, వ్రతముతో గడపెను. నారదుడును లోకసంచారము చేయుచు, సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న, శ్రీమహావిష్ణు భక్తుడగు, హరిద్రధుడను మహారాజును జూచెను. ఆరాజు, సర్వకాల సర్వా వస్థలయందును, శ్రీమహావిష్ణువును, స్మరించుచుండును. అందరియందును, శ్రీమన్నారాయణునే, దర్శించును. వారిని, హరీయని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు, వస్తువును, స్వీకరించును. దామోదరాయనుచు, భుజించును, కేశవాయనుచు, నిద్రించును.

నరసింహాయని, స్మరించును, హృషీకేశాయని మేల్కొనును, వామనాయనుచు, తిరుగును, ఏపని చేయుచున్నను, యెవరితో మాటలాడుచున్నను, యేదో ఒక విధముగ, శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు, నారదమహర్షి వెళ్లెను.

హరిద్రధుడును, నారదమహర్షిని జూచి యెదురువచ్చి, గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి, అనేక ఉపచారములతో, పూజించెను. నారదుడును, "రాజా! విద్యాధర కన్యనొక దానిని ,వరగర్వితుడైన రాక్షసుడొకడు, బలాత్కారముగ నపహరించి, సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక, త్రిలోకసుందరి, సద్గుణశీల, నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని, వాని శూలముతోనే, సంహరింపవలయును. అని, వానికి తగినరీతిలో వివరించి, నారదుడచట నుండి, లోక సంచారార్థము పోయెను. హరిద్రధుడును, సముద్రము వద్దకు పోయెను, నారదుడు చెప్పినట్లుగ, సముద్రము6 వానికి, తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రధుడును6 ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున, రాక్షసుడింట లేడు. అతడు  వివాహ ముహూర్తమునకై, బ్రహ్మ వద్దకు పోయెను. అతడు  పోవుచు, శూలము ఇంటిలో వుంచి వెళ్లెను. రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును, గ్రహించియుండెను. రాక్షసుడింటికి వచ్చునప్పటికి, తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి, యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి, హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను. రాక్షసుడు, హరిద్రధుడు, చాలా కాలము యుద్ధము చేసిరి, హరిద్రధుడు, శివుని శూలమును ప్రయోగించి, రాక్షసుని సంహరించెను. ఆ రాజు, రాక్షసుని సంహరించి, విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు, నారదుని మాటను, స్మృతికి తెచ్చుకొనెను, వానిని, భర్తగా వరించెను. హరిద్రధుడును, ఆమెను వివాహమాడెను. ఆ దంపతులును, విష్ణుభక్తులై, విష్ణుపూజను, మాఘమాస స్నానమును, మానక, చేయుచుండిరి. చిరకాలము, సుఖశాంతులతో, శుభలాభములతో, జీవితమును గడిపి, శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి," అని వశిష్టుడు, మాఘస్నాన మహిమను, దిలీపునకు వివరించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*మాఘ పురాణం - 17 వ అధ్యాయము*

*ఇంద్రునికి కలిగిన శాపము*

వశిష్ఠ మహర్షి, దిలీపునితో, మరల ఇట్లనెను. రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము, గృత్నృమదుడను మహర్షి, గంగాతీరమున నివసించుచు, మాఘమాస స్నానము, పూజాదికము చేయుచు, తన శిష్యులకు, మాఘమాస మహిమను, శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును, వివరించుచుండెను. జహ్నువనుమహాముని, మాఘమాసస్నాన మహిమను వివరింప కోరగా, గృత్నృమదమహర్షి యిట్లు పలికెను. సూర్యుడు మకరరాశిలో నున్నప్పుడు, మాఘమాసము ప్రారంభమగును. అట్టి  మాఘమాసమున చేసిన స్నానము, అత్యంత పుణ్యప్రదమే కాక, పాపనాశము కూడ అగుచున్నది. మాఘమాసమున, ప్రాతఃకాలమున, నదీస్నానము చేసినవారు ఇంద్రుడు మహా పాతక విముక్తుడైనట్లుగా, పాప విముక్తులగుదురు. ఆ విషయమును వినుడు.

పూర్వము తుంగభద్రా నదీతీరమున, అన్ని వేదములను చదివిన, మిత్రవిందుడను ముని యొకడు, ఆశ్రమమును నిర్మించుకొని యుండెను. మిత్రవిందుని భార్య, అతిలోకసుందరి, ఆమె యొకనాడు, తుంగభద్రా నదిలో స్నానము చేసి, పొడిబట్టలు కట్టుకొని, కేశములనారబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై, దేవతలతో గలసి యాకాశ మార్గమున పోవుచున్న యింద్రుడామెను చూచి మోహపరవశుడయ్యెను. అమెనెట్లైన పొందవలయునని, నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగివచ్చుచు, ఇంద్రుడు ఆ ఆశ్రమముపై భాగమున నుండి, మిత్రవిందముని భార్య అందమును, ఆమె చేష్టలను, గమనించుచుండెనుl.

మిత్రవిందముని, తెల్లవారుజామున, శిష్యులను మేలుకొలిపి, వేదపఠనము చేయింపవలయునని, తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును, ఆశ్రమములోనికి రహస్యముగ ప్రవేశించి, మిత్రవిందను పట్టుకొనెను, విడిపించుకొని పోవుచున్న ఆమెకు, తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును, కామ పరవశయై, యింద్రునిపొందు అంగీకరించెను, కోరిక తీరిన యింద్రుడు, ఆశ్రమము నుండి వెళ్ల యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని, వానిని పట్టుకొని, నీవెవడవని యడిగెను. నేనింద్రుడనని, సమాధానమిచ్చెను. మిత్రవిందుడును, జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై , స్వర్గమునకుపోలేక, భూలోకముననే యుండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను, రాయిపై పడియుండుమని, శపించెను. ఆ చోటును విడిచి, గంగాతీరమును చేరి, అచట తపమాచరించి, యోగశక్తిచే దేహమునువిడిచి, పరమాత్మలో లీనమయ్యెనుs.

ముని శాపమువలన, యింద్రుని ముఖము మాత్రమే, గాడిద, మిగిలిన శరీరము, మామూలుగనేయుండును. అచటనుండుటకు సిగ్గుపడి, పద్మగిరియను, పర్వతమును చేరి, అచటి గుహలోనుండి, యచటనున్న గడ్డిని తిని, కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడపెను. రాజులేని స్వర్గముపై, రాక్షసులు దండెత్తి వచ్చి, దేవతలతో, యుద్ధము చేయుచుండిరి. దేవతలు, రాక్షసులతో, యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు యింద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక, వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు యింద్రుని వెదకుచు, నదీతీరములయందు సముద్రతీరమునందు, తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే, మాఘమాసమున నదీస్నానము చేసి, తిరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి, మీరు చేయు వ్రతమేమి? దాని వలన వచ్చు ఫలమేమి? అని ప్రశ్నించిరి, మునులు వారికిట్లనిరి.

దేవతలారా వినుడు. మేము చేయువ్రతము మాఘమాసవ్రతము. సూర్యుడు మకర రాశి యందుండగా, ప్రాతఃకాలమున, /తటాకదులందు స్నానము చేయుట, శ్రీమహావిష్ణుపూజ, పురాణ పఠనము, యధాశక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘ
మాసమున చేసిన మాధవస్మరణ, సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము, పూజ, మున్నగునవి చేయు వారి యదృష్టమనంతము. మాఘశుద్ధ చతుర్దశియందు, గోదానము, వృషోత్పర్జనము, తిలదానము ఆవూప దానము, పాయసదానము, వస్త్రకంబళములదానము, విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహావిష్ణువు దయవలన, సర్వలోకములు, సులభములైయుండును అనుచు, మునులు, దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలును, దివ్యమునులు మాటలను విని, మాఘస్నానమును సముద్రమున చేసి, శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు, మృదువైన శరీరము, చతుర్భుజములు, కలిగియుండెను. శంఖచక్ర గదాపద్మములను, నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి, కిరీటముతో, మరింత మనోహరముగ నుండెను. కంకణములు, వారములు, వైజయంతీమాల,మున్నగు అలంకారములను ధరించి, గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును, దేవతలిట్లు స్తుతించిరిl.

*స్వామీ:* నీవు జగములకే గురువువు. వేదవేద్యుడవు. నీయనుగ్రహము లేనిదే, యెవరును, నిన్నెంతటి వారైనను, యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ, వ్యాస మహర్షిని, పాదముల మహిమను స్తుతించి, కృతార్థులైరి. అట్టి నీకు, మా నమస్కారములు స్వామీ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి, స్వర్గమును, మోక్షమును, అనుగ్రహింతువు.

సమస్తమును, నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు, సత్యవాక్కువు, స్వామీ! యిట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై, సృష్టి స్థితిలయముల, నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి, జలమయ మైనప్పుడు మఱ్ఱి ఆకుపై పరుండి, చిదానంద స్వరూపడువైయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను, నీవు తప్ప,మరెవరును యెరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదముల ననుసరించి, సృష్టించి,  వాని యాందాసక్తుడవై యున్నట్లుండి, నిరాసక్తుడవై, అద్వితీయరూపమున నున్న నీకు, నమస్కారము. సర్వవ్యాప్తుడవైన, నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు, అన్నింటిని సృష్టించిన వాడవు నీవే, ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉధ్ధవుడు, మొదలగు ఉత్తమపురుషులు మాత్రమే, నిన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును, నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును, నిన్ను స్తుతించుట తప్ప,యేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి, రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.

దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు, వారికి ప్రసన్నుడై, యిట్లనెను. దేవతలారా! యింద్రుడు ముని శాపముచే, దివ్యశక్తులను కోల్పోయి, గాడిద మొగము కలవాడై, పద్మగిరి గుహలలో, సిగ్గుపడి, దాగియున్నాడు. అతడు, ముని భార్యను మోహించి, ఆమెననుభవించి, దోషము చేసి, మునిశాపమునందెను. పద్మగిరి, దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున, అరుణోదయ పుణ్యకాలమున, గార్దభ ముఖుడైన ఇంద్రునిచే, నదీస్నానమును చేయింపుడు. అందువలన, ఇంద్రుడు, గాడిద ముఖమును విడిచి, మంచి ముఖము కలవాడై, పూర్వమువలె, దివ్య శక్తులను పొంది, మిమ్ము రక్షింపగలడు, కావున మీరు, వానిచే, మాఘమాస అరుణోదయపుణ్యకాలమున, నదీస్నానము చేయింపుడని చెప్పెను.

దేవతలు, శ్రీమహావిష్ణువు మాటలనువిని, విస్మితులైరి. స్వామి ముని శాపపీడితుడైన ఇంద్రుడు, కేవల మాఘస్నానముచే, 
స్వస్థుడగునా? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా! మాఘమాసస్నాన మహిమను, మీరెరుగకపోవుటచే, ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో, ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము, విశ్వామిత్ర మహర్షియు,
ఇoద్రుని వలె, పాపమును చేసి, కపిముఖుడై, మాఘస్నానము చేసి, పూర్వ స్థితి నందెనని చెప్పెను. ఆ మాటలకు, దేవతలు, మరింత యాశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును, చెప్పుమని, శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి, భూప్రదక్షిణము చేయుచు, గంగాతీరమునకు వచ్చెనుv. మాఘమాసకాలమగుటచే, గంధర్వులు తమ భార్యలతో కలిసి, గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులులలో, ఒక గంధర్వుడు, మాఘమాసమున, నదీస్నానము చేయుచు, భార్యను కూడ, నదీస్నానము చేయుటకు, రమ్మని పిలిచెను. భర్తతో, భూలోకమునకు వచ్చి గంగాతీరమును చేరిన ఆమె "ఈ చలిలో, నాకీచన్నీటి స్నానము బాదాకరము. నేను స్నానము చేయజాలను. మీకు శక్తి, యిష్టము, ఉన్నచో, మీరు చేయుడని, గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను, వాని భార్య, భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు, మిగిలిన వారితో గలసి, స్నానము చేసెను. గంధర్వుడు, భార్య మాఘస్నానమును ధూషించి, నిరాకరించుటచే, ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి, తిరిగి వచ్చి, తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో, గంధర్వుని భార్యను, మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో, గంధర్వులు, తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య, గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి, అసహాయురాలై తిరుగుచుండెను.

ఆమె అడవిలో తిరుగుచూ, విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి, వయ్యారముగా, క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి, విశ్వామిత్రుడు తన్మయుడై, ఆమెను ప్రేమించుటచే, యిద్దరూ  కామక్రీడలలో తెలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు, తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడిoచుచుండిరి. ఆ 
దృశ్యమును చూచి, మండిపడుచు, తపస్వివై యుండి కూడా, యిలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని, 
విశ్వామిత్రుని, పాషాణమై పడియుండమని, భార్యను శపించి, వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక, వానర ముఖం కలిగియుండగా, నారదుడు ఆ విషయము తెలుసుకొని, విశ్వామిత్రుని కడకు వచ్చి, " విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై, నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము. గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి, ఈ పాషాణముపై చల్లుము", అని వివరించగా, విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా, ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ  రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నందిన విశ్వమిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.

దేవతలారా! మాఘస్నానము మహిమ, మాటలకు అందదు. చాలా గొప్పది. కావున మీరు, గాడిద ముఖము కలిగి, సిగ్గుపడి, పద్మగిరిలో నున్న ఇంద్రునిచే, మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు, దేవతలకు, యింద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*మాఘ పురాణం - 18 వ అధ్యాయము*

*ఇంద్రుని శాపవిముక్తి*

శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను." దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు, మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు, నశించును.మాఘ వ్రతము నాచరించినవారు, నాకిష్టులు. వారు దేవతలై, వైకుంఠమును చేరుదురు.

మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేదములు, శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో, శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో, రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని  దానములలో, ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము, సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరీ, ఇలా సర్వనదులయందును, పది సంవత్సరముల పాటు, సూర్యోదయ సమయమున, స్నానము చేసినచో, వచ్చు పుణ్యము, మూడు దినములు, అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి, పూజ  మున్నగువానితో, వివిధ పుష్పములతో, సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన, మోక్షము వచ్చును, అని శ్రీమన్నారాయణుడు, దేవతలకు, మాఘవ్రత మహిమను వివరించెనుl.

దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి, యింద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి, చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.ఎంత ప్రయత్నించినను, ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని, శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి, మరునాడు మాఘస్నానాదికమును చేసి, ఆ తీర్థమును తొండపై పోసిరి.

పవిత్రోదకముచే తడిసిన తొండ, దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కరించి యిట్లు పలికెను." నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున, నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి, "మనుష్య జన్మము కష్ట ప్రదము, స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి, తపమాచరించుటమేలని" తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి, నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.

నేనును బంధువుల వద్దనుంటిని, వారి నిరాదరణ ఫలితముగ, చూచువారెవరును లేకపోవుటచే, భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు, బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు, జీవించుచుంటిని. భక్తి, వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమననేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి, పరిహాసము చేసితిని. ధనమును దాచి, సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి, నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు, నీతి నియమములను విడిచి, దురాచారవంతురాలనై, జీవితమును గడిపితిని, తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.

పులి, కోతి, ఎద్దు, మున్నగు పెక్కు జంతువుల జన్మనందితిని, పెక్కు బాధలను పడితిని. ఒకనాటి  జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును, ఆకలి కల వానికి పెట్టితిని, ఆ చిన్న మంచి పని వలన, మీరు దయయుంచి, నాకు శాపవిముక్తిని కలిగించిరి" అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే, ఆమె దేవతత్వమునంది,' దేవప్రియ' అను పేరును పొందెను. దేవతలలో, ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును, దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో, వికారరూపముతో తిరుగుచున్న యింద్రుని జూచి, బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికిపారిపోయెను. దేవతలను ఇంద్రుని జూచి, వెంబడించి, వానిని ఊరడించి, ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు, మహావిష్ణువు, నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను, ఆ, ప్రకారము చేయుదము" రమ్మని, తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెనుl.

ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి, సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా, జహ్నుముని, స్వామీ! యీ విష్ణు కథామృతము, ఇంకను వినవలెననున్నది. ఇంకను చెప్పుడని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు .

ధనసంపాదనము తప్ప, ధనవినియోగము నాతడు  చేయలేదు. పూజ, దానము, మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత, నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి, దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై, పంపాతీరమున, మఱ్ఱిచెట్టు పైనుండి, అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి, ఆ ప్రాంతమునకు, శిష్యులతో వచ్చి, మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు, మాఘస్నానము, పూజ, మున్నగునవి  చేయుచు, శిష్యులకు, మాఘమాస మహత్త్యమును, వివరించుచుండెను, అతదు మాఘస్నాన మహిమను వివరించుచు, నొకనాడు, మాఘస్నానము చేసిన వారి సర్వపాపములును, సూర్యోదయమువలన  చీకట్లు నశించినట్లుగా, నశించును. మాఘస్నానము చేయనివాడు  నరకమునపోవును" అనుచు, మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలని శుభములను, చేయకపోవుటవలని అశుభములను,  వివరించుచుండెను. ఆ సమయమున, పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము, వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు, పంపాజలమున, మాఘస్నానమును, వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన, మాఘ స్నానము వలన, వాని పిశాచరూపముపోయి, దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన, వైకుంఠమును చేరెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

*మాఘ పురాణం - 19 వ అధ్యాయము*

*మునుల వాగ్వాదము*

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. "ఓయీ వినుము. గోమతీ నదీ తీరమున, పవిత్రమైన నైమిశారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసికొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, యింద్రియ నిగ్రహము కలిగి, సర్వోత్తములైన వారిలో, పరస్పరము, నేనెక్కువయనగ నేనేయక్కువయను, వివాదము కలిగెను. భృగుమహర్షి, నేను తపోనిష్టుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవరున్నారని యనెను. గౌతముడును," నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసినవాడను. నేనే గొప్పవాడనని" పలికెను. లోమశుడను ముని," నాకు సమానుడు లేడు. నేను మునులకు గురువునని ప్రకటించెను." గార్గ్యుడను ముని, సభలో నిలబడి, "వేదశాస్త్రాదులన్నియు నాకు వచ్చును. కావున నేనే ఉత్తముడనని" యనెను. మాండవ్యుడు "నేను కర్మలను యేమరకుండ యధాకాలముగ చేయుదునుl. 
నిత్యకర్మలనాచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటె ఉత్తముడెవడని" గర్జించెను. శంతనుడను ముని," నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రతకలవాడను. నన్ను మించిన వాడెవడు లేడని" పలికెను. పాలస్త్యుడను ముని లేచి," నేను వేదములు, శాస్త్రములు అన్నియు నేర్చినవాడను. పెద్దలు కూడ నన్నే గౌరవింతురు. కావున నేనే అధికుడనని"యనెను. శౌనకుడును," ఆత్మనేత్తలలో నేను మొదటివాడను, నాకంటె పూజ్యులెవరును" లేరనెను. ఆ మునివరులు, తమ గొప్ప తనమును, బిగ్గరగా, యెవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక, భృగు మహర్షి వద్దకు వచ్చి, వాని జడలను లాగి, పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరినొకరు ధూషించుకొనుచు, కొట్టు కొనుచు, వారి దండములను, ఛత్రములను లాగుచు, కోలాహలమును పెంచిరి.

ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా, కలహప్రియుడైన నారదుడు వచ్చెను, కలహించుకొనుచున్నవారిని, మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి, శ్రీహరికి, యీ విషయమును విన్నవించెను. శ్రీహరియు '"నారదా! ఆ మునులు జ్ఞానులైనను, నా మాయకు లోబడి, కలహించుకొనుచున్నారు. వీరి వివాదము, ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులను వారిని, వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును, యెల్లప్పుడును అయిదు సంవత్సరములవారుగనే యుందురు. వీరి బాల్యమున, చతుర్యుగములెన్నియో మార్లు గడచినవి. వీరితో బాటు వృద్ధుడు, బుద్ధిశాలియగు మార్కండేయుని గూడ పంపుదును. అతడు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా! నీవును అచటకు పోయి చూడుము" అని పంపెను. మార్కండేయ మహర్షి, వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని జూచి, వివాదపడుచున్న మునులు, వివాదమును ఆపి, అస్పష్టములైన మాటలతో, వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును, వారినందరిని కుశల ప్రశ్నాధికముతో, శాoతపరచెను. ఇట్లు కొంతకాలము గడచెను.

కొంతకాలము గడచిన తరువాత, బ్రహ్మజ్ఞానులగు సనక సనందాది మునులు నలుగురును, అచటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షియు, వారిని జూచి, యెదురువెళ్ళి, నమస్కరించి, అర్ఘ్యపాధ్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని, తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని జూచి, సనకాది మునులాశ్చర్య పడి, యిట్లనిరి. మార్కండేయ మునీంద్రా! నీవు వయో వృద్ధుడవు. మునులలో నుత్తముడవు, సప్త మహాకల్పములు, నీ ఆయుష్కాలము. ఇట్టి నీవుo బాలురమైన మాకు నమస్కరించి, పాదోదకమును నీ తలపై జల్లుకొనుచున్నావేమి?  వృద్దులు, బాలురకు యెదురు వెళ్ళుట, నమస్కరించుట, చేయరాదని, శ్రుతివాక్యమున్నది కదా! మేము అయిదేండ్లవారమే కదా! అని పలికిరి.

ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని, మార్కండేయ మహర్షి యిట్లనెను. "భగవద్గావలాలమలారా! ఒకొక్క దినము గడుచుచుండగా, ప్రాణుల ఆయుర్దాయము, కుండ నుండి స్రవించు నీరువలె తగ్గిపోవుచున్నది. ఇరువది యొక్క కల్పములు జీవించినను, మృత్యువు తప్పదు. ఇందసత్యము లేదు. యెక్కువ వయస్సు ఉండుటవలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువుటచేత లాభమేమి, యోగమును పాటించుటచే, ఉపయోగమేమి? తపముచేత, కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు, చిరంజీవియైనచో, వచ్చిన ప్రయోజనమేమి? నిరర్దకముగ కాలము గడచుటచే, దుష్టుల జీవనము, గడచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించు వాడే, యెక్కువగ, వ్యర్థముగ, అజ్ఞానియై, యెక్కువ కాలము గడిపిన, వాని గొప్పదనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు, ప్రాణిలోకము భయమునంది, తాను చేసిన కర్మఫలముననుభవించి, మరల జన్మించును. నిత్యముకాని దేహముతో, విష్ణుకథా ప్రసంగము చేయువాని బ్రతుకు, సార్థకమైనదిl.

మహాత్ములైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులారా! మీరు నిరంతరము, విష్ణు కథా ప్రసంగమును, చేయువారు, నిత్యము, ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి యెల్లప్పుడును, నీ హృదయపద్మములందే యుండును. మేము క్షణకాలమైనను, విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడ చేయము.  నిరంతరము హరి కథా ప్రసంగము చేయు మీరు, బాలురైనను వృద్ధులే, హరికథా ప్రసంగములేని వారెంత వృద్ధులైనను, బాలురే కావున, మాకంటే మీరే గొప్పవారని, మార్కండేయ మహర్షి, సమాధానము నిచ్చెను. మార్కండేయుని మాటలను విని, సనకాది మహర్షులు, శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను  వినుచున్న మునులు, తమలో తాము, యెక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని, సిగ్గుపడిరి. వారందరును, మార్కండేయ మహర్షికి, సనకాది మునులకును, పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలిసికొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగశక్తి యిoడని ప్రార్థించిరి.

నారదుడును, శ్రీహరి వద్దకేగి, జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి, వ్యాస రూపమున, సూతునకు, సర్వశ్రుతుల జ్ఞానమును, బోధించెను. సూతునివలన, మునులు మొదలగు వారందరును, శ్రుతులసారము నెరిగిరి. శౌనకుడు, మునులును, అహంకారము మొదలైన మనోవికారములను విడిచి, ప్రశాంతచిత్తులై, పరమేశ్వర జ్ఞానము, పరమేశ్వర చింతనము, కలిగియుండిరి. హరకేయూరాది భూషణములు, తమ తమ విభిన్నరూపములనందినను కరిగిపోయి, తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా, ప్రాణులను తమ తమ కర్మ విశేషము ననుసరించి, వివిధరూపములు పొంది, తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదవేదాంగములను, సర్వశాస్త్రములను అభ్యసించి, పరమాత్మ మహత్త్యము నెరిగి, పరమాత్మ చింతనమును చేసి, భగవదనుగ్రహము నందుటయే, జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు, భగవచ్చింత, నేను నిరంతరముగ, అలవాటు చేసి, జీవులను తరింపజేయును. జహ్ను మునీశ్వరా! మాఘమాస వ్రతాచరణ, భగవచ్చింతనమును, జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన, ప్రాణి, యిహలోక సుఖములను, పరలోకములను, దుష్కర్మక్షయమును, సత్కర్మాచరణ ఫలమును పొంది, భవసాగరమును తరించును. మునుల అహంకారమును, మార్కండేయ ముని, వినయవివేకములను, సనక సనందనాదుల మహత్త్యమును, పరిశీలించి ప్రాణి వినయమును, భగవచ్చింతనమును, జ్ఞానఫలములని యెరిగి, ఆచరించి, భవసాగరమును, దాటవలెను సుమా, అని గృత్నృమద మహర్షి వివరించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


మాఘ పురాణం - 20 వ అధ్యాయము*

శివ బ్రహ్మల వివాదము*

గృత్నృమద మహర్షి మరల యిట్లు పలికెను. శ్రీమహవిష్ణువు తత్త్వమును, మహత్త్యమును, వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు, యెవరికివారు, తానే ప్రధానుడనని, యనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతల కిష్టుడైన యధిపతిని నేనే. మరియొకరు నాకంటే ఉత్తములు లేరని, యెవరికి వారే తలచిరి. ఎంతకాలము గడచినను, వారి వివాదము ఆగలేదు. కాలము గడచుచునేయున్నది. వివాదము పెరుగుచునేయున్నది.

ఇట్లుండగా, వారి యెదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యులకాంతి కలిగి తేజోమయమై యుండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి, సర్వవ్యాప్తమై, తనకు తానుగా జనించి, సర్వతో వ్యాప్తమైయుండెను. దివ్యము, మనోహరము, అనంతమునగు, ఆ రూపము, శ్రీమహవిష్ణు రూపమని, వారు గ్రహించిరి. సర్వమును, ఆ రూపమునందే, వారు చూచిరి. బ్రహ్మ, శివుడు, ఆ రూపము చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును జూచి, శివబ్రహ్మలిద్దరును, ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు నెరిగిన వారే, తమ యిద్దరిలో నుత్తములని తలచిరి, ప్రయాణమైరి, నాలుగుదిక్కుల క్రిందను, పైనను చిరకాలము సంచరించిరి. ఆరూపమును మొదలునుగాని, చివరనుగాని చూడలేకపోయిరి, తాము ఇద్దరమును, దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడారూపము నిట్లు తలచిరి.

ఈ పురుషుడే జగత్కర సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు. గుణాధికుడు . గురువు. రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయంప్రకాశుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు, మనము వీనికంటె అధికులముకాము. మన వలన నేమియు జరుగుట లేదు. ఇట్టి యధార్థ పరిజ్ఞానము కలిగి, శ్రీమహావిష్ణువు నిట్లు స్తుతించిరిl.

*బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి*

అనంతమూర్తీ! సర్వాద్యమూ, సర్వాధారమూ, అనంత ప్రకాశమూ సర్వమనోహరమూ అయిన నీ స్వరూపమును, మాకు మరింత ప్రత్యక్ష  మగునట్లు చేయుము. సర్వాత్మకా! సర్వేశ్వరా! సర్వప్రాణి నమస్కృతా!  అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు నీ తేజమనంతము, నీవందరికిని అన్నిటికిని యిచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్తరూపుడవు, అనుచునిట్లనిరి.

హేవిషోవంతమూర్తే, తవఘవ విఖిలాకారమాద్య స్వరూపం
సర్వాధారం సురేశందినపతి హత భుక్కోటి సూర్యప్రకాశం |
అవాభ్యమత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం
చిమ్రావేం స్వాత్మశక్త్యాకురు నిఖిలగురో సర్వరూపంత్విదానం ||
నమస్తే విశ్వాత్మన్ విధిహరసురేంద్రాది విబురై
త్రయీ శాత్త్రాలాపైః విగదితన వ్యాంఘ్ర్యంబుజయుగం |
పరంమత్రంయంత్రం పరమపద బీజం జ్వలతియః
ససాక్షాత్పారూప్యం వ్రజతి తవదేవేశసతతం ||
త్రిలోక కర్తా భివదస్యభర్తా హరే మహద్రూపమనేక తేజాః
గురుర్గుర్ణాం నరదోవరాణాం మహార్ణవాంబూపల జస్త్వమేర |
త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట
దృష్టామృతాస్వాద్యమిరాశు పాణిః సురాసురాణామఖిలేశ్వరరస్త్వం ||
లక్ష్మీపతి స్త్వంతు సుగుహ్యగోప్తా గుహాశయః పంకజ పత్రనేత్ర
త్వంపంచ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తేఃs 

సృష్టించ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణశ్చదేవ
త్వమేవ భూర్భూరికృత ప్రవేశః తధాద్య భూతం విదధాసియత్తత్ ||
త్వమగ్ని సూర్యౌ పవనస్త్యమేవ యమోభవాన్ వైశ్రవణస్త్వమేవ
త్వమేవశక్ర స్పురలోకనాధః నాధాబిమస్త్వం భగవన్ నమస్తే ||
పరమం పరాణాం పరమంపవిత్రం పురాణ కర్తారమనం తమాశ్రయం
త్వాం వేదమోహుః కవయః సుబుద్ద్వా నమోస్తుతే పన్నగవైరి కేతో ||
వేదాశ్చవేద్యశ్చ దిగంతరాళం యష్ఠాసురసానమపి త్వమేవ
కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋదశ్చవాతో నిగమాశ్చసర్వే ||
నదీషు గంగాహిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః
రత్నేషు వజ్రంజలజేషు చంద్రః క్షీరోదధశ్చాపి యధాతథాత్వం ||
అహం ప్రభు స్తద్వరహం ప్రభుశ్చ సంస్పర్ద మానౌ బహువర్ణానాం
తస్నాదదావీం పరిహర్తు మేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాసి ||
తేనాత్రతే దర్శనబుద్ది రాసీత్ కృపాలో భగవన్నమస్తే
తూర్ణం జగనాథ మహత్స్వరూపం భూత్వాపున స్చామ్య వపుఃప్రసీద ||

ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని, శ్రీమహా విష్ణువు ప్రసన్నుడై, సహజమైన సౌమ్య స్వరూపముతో, వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా! మీరిద్దరును, చిరకాలము, వివాదపడుచుండుటచే, మీ వివాదమును నిలుపుటకే, నేను యిట్టి విరాట్రూపమును ప్రదర్శించితిని. మీరును, నా విరాట్ రూపమును గమనింప నశక్తులై, మానసిక వికారమును విడిచి, ప్రశాంతబుద్దులై, నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు, కారణమును నేనెరుగుదును. ఆ వివాదము నెవరును, పరిష్కరింపలేరు. సత్వరజస్తమోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడినవారికి, యదార్థము తెలియదు.

సత్త్వ గుణము నిర్మలము స్వయంప్రకాశకము అనామయము. సుఖసంగముచే దేహినిబంధించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూపజ్ఞానమును కప్పి, యిహలోకమునకు చెందిన, ప్రయోజనములను కలిగించు పనులయందు, ప్రవర్తింపజేయును. తమోగుణము, అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి, మోహమును పెంచును. దీనిచే పరమాత్మ, జ్ఞాన ప్రయత్నము, వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసినదానిని మరచుట, ఆలస్యము అనగా, చేయవలసిన కార్యము తెలిసినను, శ్రద్దసరిగా లేకపోవుట, శ్రద్ధాలోపముచే, కార్యనిర్వహణ శక్తి లేకపోవుట, జరుగును. నిద్రయనగా, నీ యజ్ఞానముచే, చేయవలసిన దానిని వీడి నిద్రించుట, కావున ప్రమాదాలస్య నిద్రలు, తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్దుడు కాక, పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని. దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరును సాటి? ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము.

మీకును, యీగుణ ప్రభావము వలన, వివాదము కలిగి, పెరిగినది. మొట్టమొదట నంతయు, చీకటిగ నుండినది, పంచభూతములప్పటి కేర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై, మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము యేర్పడితిమి. మనము ముగ్గురము సృష్టిస్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మసృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుడు  లయకర్తగను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దానినుండి వచ్చిన మనకు మొదట భేదములేదుకదాl!

అని బ్రహ్మకు, శివునికి, శ్రీమహావిష్ణువు, తత్త్వమును స్మృతికి తెచ్చెను, మరియు బ్రహ్మతో నిట్లనెను, "బ్రహ్మ! నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. సర్వప్రాణులను సృషించినవాడవు. దేవతలకు ప్రభువువు. వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతిని. సర్వలోకములకు సంపదనిచ్చువాడవు. స్వశక్తితోడనే పరమాత్మయోగమునందినవాడవు. సర్వ రక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కునివలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వములో నున్న నేనే అనేకత్వము నందితిని.మనమిద్ధరమొకటే. నీవును నా వలెనే సమస్త దేవతలకు పూజనీయుడవు". అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగ తత్త్వమును బోధించెను. అని గృద్నృమదమహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మాఘ పురాణం - 21 వ అధ్యాయము*

*శివస్తుతి*

*శ్రీమహావిష్ణువు చేసిన శివ ప్రశంస - నారదుని శివస్తుతి.*

గృత్నృమదమహర్షి జహ్నుమునితో, మరియు నిట్లనెను. విష్ణువు శివుని జూచి యిట్లనెను. శంకరా! నీవు నాతో సమానుడవు. మన యిద్దరికిని భేదము లేదు. నావలెనే సర్వ పూజ్యుడవు. సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమా! అని యిట్లు స్తుతించెను.

*విష్ణుకృత శివస్తుతి*

శంభో భవానర్కహిమాంశు నహ్నివేత్రత్రయస్తే ఖిలలోక కర్తా
తధాసమస్తామర పూజితాంఘ్రీః సంసేవ్యమానస్పురయోగిబందైః ||
వచాస్తికించిత్తవ మిత్ర భేదస్తే హంచ్వహం త్వం సురనాధసత్యం
వేదాంద వేద ప్రముఖా నిశం ర్వాంసన్యాసినస్వృర్గ విముక్తి హేతుం
వదంతి తద్వత్ సుభజంతిశంభో ప్రయాంతి ముక్తించ తివ ప్రసదం ||
సర్వభేదవినిర్ముక్తః సర్వభేదాశ్రయోభవాన్
త్వంత్వరిష్ఠాయలోకేస్మిన్ మహాదేవో మహేశ్వరః ||
త్వమేవ పరమానందస్త్వమే వాభయదాయకః
త్వమక్గరం పరంబ్రహ్మ త్వమేవహినిరంజనః ||
శివస్స్ర్వగతః సూక్ష్మః ప్రబ్రహ్మవిదామసి
ఋషీణాంచ వశిష్ఠస్త్వం వ్యాసోవేదనిదామసి ||
సాంఖ్యానాంకపిలోదేవః రుద్రాణామపి శంకరః
ఆదిత్యానాముపేంద్రప్త్యం వసూనాం చ హిపొవకః ||
వేదానాంసామవేదస్త్యం సావిత్రి చందసామపి
ఆధ్యాత్మ విద్యావిద్యానాం గతీనాం పరమాగతిః ||
మాయాత్వం సర్వశక్తీనాం కాలకలయతామపి
ఓంకారస్సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ||
ఆశ్రమాణాం చ గార్హ్యస్థ్యం ఏశ్వరాణాం మహేశ్వరః
పుంసాంత్వమేకుపురుషః సర్వభూతహృదిస్థితః ||
సర్వోపనిషదాంచేవ గుహ్యోపనిషదుచ్యతే
కల్పానాంచమహాకల్పః యుగానాంకృత మేవచ
ఆదిత్యః సర్వమారాణాం వాచాందేవి సరస్వతీ ||
ర్వం లక్ష్మీశ్చారురూపాణాం విష్ణుర్మాయావినామసి
సూక్తాణాం పౌరుషంసూక్తం బ్రహ్మసిబ్రహ్మవేదినాం ||
సావిత్రీచాసి జాహ్యిరాం యజుషాం శతరుద్రీయః
పర్వతానాం మహామేరుః అనంతోయోగినామపి ||
సర్వేషాం పరబ్రహ్మచ్వన్మయం సర్వమేనహి
యరైవాహం త్వంహి సర్వముఖ్యోషు శంకర ||

శంకరా! నీకు నాకును భేదమే లేదు. వేదాంతవేత్తలకిది స్పష్టముగ తెలియును. నేను నారదునకు, నీ మహిమను చెప్పగా, నతడు నీయనుగ్రహమునకై తపమాచరించెను. నిన్ను దర్శింపనెంచెను. నీవాతని ననుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా?

కూపంతనాశేష కధాభిగుప్తం అగోచరం నిర్మలమేకరూపం
అనాదిమధ్యాంత మనంతమాద్యం నమామి దేవంతమనః పరస్తాత్ ||
ర్వాందేకపస్యంతి జగతృసూతిం వేదాంత సునిశ్చితార్థాః
ఆనందమాత్రం ప్రణనాభిధానం చతేవరూపం శరణం ప్రపధ్యే ||
ఆశేషభూతాంతర సన్నివిష్టం ప్రభావతాయోని వియోగహేతుం
తేజోమయం జన్మవినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మిరూపం ||
ఆద్యంత హీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతేపరస్తాత్
కూటస్థమవ్యక్తవపు స్తదైవ నమామిరూపం పురుషాభిదానం ||
సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వతనం సర్వతమ ప్రవిష్టం
సూక్ష్మంవిచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మిలే రూపములుస్త భేధం ||
ఆద్యం మహత్త్వే పురుషార్త్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం
ఐశ్వర్య విజ్ఞాన విరాగధర్మైస్పమన్వితం దేవనతోస్మిరూపం ||
ద్వీసప్తలోకాత్మకమంబు సంస్థం విచిత్ర భేదం పురుషైకరాధం
అనంత భూతైరధివాసితంతే వతోస్మ్యహం తజ్జ గదంద స్థంస్థం ||
అశేష దేవాత్మక మేకమాద్యం స్వతేజసారూపితలోక భేదం
త్రికాలహేతుం పరమార్జరూపం నమామ్యహం త్వాం రవి మండలస్థం ||
సహస్రమూర్థానమనంత శక్తీం సహస్రబాహుం పురుషం పురాణం
శయానమంతస్పంలే తదైవ నారాయణాఖ్యం ప్రణతోస్మినిత్యం ||
దంష్ట్రాకరాళం త్రిదశాదినంద్యం యుగాంత కాలావల కాలరూపం
అశేషరూపాండ వినాశహేతుం నమామి రూపం తవకాల సంజ్ఞం ||
ఫణా సహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరభీ పూజ్యమానం
జనార్దన ప్రీతి మహత్కరం త్వాం సతోస్మిరూపంతవ శేష సంజ్ఞం ||
అన్యాహతైస్వర్యమయుగ్మ నేత్రం బ్రహ్మమృతానంద రవజ్ఞమేకం
యుగాంతశేషం దివిసృత్యమానం నతోస్మ్యహంత్వామె తిరుద్ర సంజ్ఞం ||
ప్రక్షీణశోకం విమలం పవిత్రం సురాసురైర్చిత పాదయుగ్మం
మకోమలం హింద్ర సుశుభ్రదేవాం నమామ్యహాం త్వామఖిలాభినాధం ||
చతుర్భుజం శూలమృగాగ్నిపాణీం ప్రయత్నతో భక్తవర ప్రదానం
వృషధ్వజం త్వాం గిరిజారదేహం వతోస్మ్యహందేవ కృపాకరేశం ||

శంకరా! నారదుడు చేసిన,  అమోఘమైన యీ స్తుతిని విని, నీవు నిక్కిలి సంతోషించితివి . మునులందరు, స్తోత్రమును చదువుచు, నిన్ను సేవించిరి కదా. కావున, నీకును నాకును, బ్రహ్మకును, భేదమును లేదు. మనకు భేదమున్నదని తల్చు మూఢులు, నరకమున బడుదురు సుమా! అని శ్రీమన్నారాయణుడంతర్థానము నందెను.

జహ్నుమునీ! విష్ణు ఈ  విధముగ, రజస్తమోగుణ భేదము వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరచి, లోకములకి విషయము నీ విధముగ తెలిపెను. వస్తుతః, ముగ్గురికి భేదములేకున్నను, భేదమున్నదని తలచివాదించు, అహంకార పండితులకొరకీ సంఘటన జరిగినది. మాఘ మాసవ్రతము నాచరించు వారీ విషయమును, తప్పక గ్రహింపవలయును. అజ్ఞానముచే నాలోచించి, దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై, సర్వాత్మకుడైన, విష్ణువునే భావించి, జ్ఞానులై,

ముక్తినందవలెను. అజ్ఞానులు మాఘమాసవ్రతము నాచరించి, జ్ఞానులై యిహపరముల యందు సుఖింపవలయును సుమా! వృధాపదములు, బుద్ధిహీనులకే గాని, బుద్ధిమంతులకుగాదని తెలుపుటే, యీ సంఘటన జరిగినది. లెనిచో సర్వాధికులు, సర్వాధారులు సర్వోత్తములునగు, త్రిమూర్తులకు కలహమేమి? యెక్కువ తక్కువలేమి? మూర్ఖుడైనను, భక్తితో మాఘమాసవ్రతము నాచరించిన, జ్ఞానియై సుఖించునుl.

అహంకారము దుఃఖమును కలిగించునని, అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని, దీని భావము. గర్వమని, అశక్తుడైన వాని నాక్షేపింతురు. సర్వసమర్థుడైన వానికేది అయినను, వానిశక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారమెట్లుండును? ఉండదు. ఏదియును అయనను మించినది లేదుకదా. జ్ఞానము కలుగలలెనని, భగవంతుడే యిట్టి సంఘటన నేర్పరచి, మనవంటి మూఢులకు, అహంకూడదని తెలిపెను. కావున గర్వమును, సిగ్గును, అభిమానమును విడిచి, బుద్ధిమంతుడు మాఘమాసవ్రతము నాచరించి, విష్ణుకథలను విని, తరింపవలెను. యధాశక్తి దానములాచరించి, సాటివారియందు ప్రేమనుచూపుచు, సర్వాత్మకుని దయా విశేషము నందవలయును, అని, గృత్నృమదమహర్షి, జహ్నుమునికి, మాఘమాస మహత్త్యమును, భగన్మహిమను బోధించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో 
_*మాఘ పురాణం - 22 వ అధ్యాయము*_

🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️

 _*క్షీరసాగరమధనము*_

గృత్నృమదమహాముని జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునివర్యా! వినుము, అశ్వమేధయాగము చేసినవాడును, ఏకాదశివ్రత నియమమును పాటించినవాడును, మాఘమాసవ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలమునంది తుదకు మోక్షమును గూడ పొందును. స్వర్గాధిపతియై యింద్ర పదవినందును. మాఘ ద్వాదశినాడు బ్రాహ్మణులతో గలసి పారణ చేయువాదు, అన్నదానము చేయువాదును పొందు పుణ్యము అనంతము అని పలికెను.

జహ్నుముని గృత్నృమదమహాముని! తిధులనేకములుండగా యేకాదశి అన్నిటికంటె శుభప్రదమైనది యెట్లయ్యెను? అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశీ వ్రతమొక్కటే యిచ్చుటయేమి? ఎవరైనను యిట్లు చేసి యితటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగెను. గృత్నృమదమహాముని యిట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్రపౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగుగను, సర్పరాజువాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడువరుసలుగ జుట్టి దేవతొలొక వైపునను రాక్షసులు మరియొక వైపునను పట్తిరి.

వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువామెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్శ్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృతకలశము మున్నగునవి సముద్రమునుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని యింద్రునకిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరువద్దకు పోయి నమస్కరించి యిట్లు స్తుతించిరి.

_*దేవదానవులు చేసిన శివస్తుతి*_

నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే
నమోగిరాం విదూరాయ నమస్తే గిరి ధన్వవే ||
నమశ్శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ
నమోనిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే ||
త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక
త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే ||
త్రయీధర్మైకసాధ్యాయ త్రిరూపాయోరురూపిణే
అరూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః ||
హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే
మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల ||
పాహ్యస్మాన్ కృపాయాశంభో విషాత్ వైస్వానరోసమాత్s

అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషమును మ్రింగి తన కంఠమును నలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటినుండి యేర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవ దానవులు సముద్రమును, ధనమును మాని అమృతపాత్రను స్వాధీనము చేసికొనవలయునని యత్నించిరి, ఒకరికి దక్కకుండ మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు యేర్పడినది.

మాయావియగు శ్రీమహావిష్ణువు మోహిని రూపము నందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు, జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వువలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములైయుండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగవంటి శరీరము కలిగి సర్వాభరణభూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగ సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారాయని మధురస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరిv.

ఆమె దేవదానవులను జూచి దేవతలారా, దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినైయుండి యీ అమృతకలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగ పంచెదను.దేవతల వర్గమొక వైపునను, రాక్షసుల వర్గము మరియొకవైపునను కూర్చుండిరి. ఈమె యెవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండ అమృతమును సమానముగ పంచునని తలచెను.

అందరిని మోహవ్యాప్త పరచుచున్న ఆ జగన్మోహిని అమృతపాత్రను చేత బట్టెను. ఆమె ఆ అమృతపాత్రను రెండు భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరియొకవైపున సురను(కల్లు) ఉంచెను. రాక్షసులున్నవైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచునెవరికిని అనుమానము రాకుండ అటునిటు దిరుగుచునుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి చెవులకింపుగ ధ్వనించుచున్న పాదములయెందెల రవళితోను, హస్తకంకణముల సుమధుర నాదములతోను, ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగ మనోహర, మధురముగ దిరుగుచు అమృతమును దేవతలకును, సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగ చేసి కొన్నవారై త్రాగుచుండిరిl.

_*రాహుకేతువుల వివరణ*_

రాక్షసులపంక్తిలో కూర్చున్న యిద్దరికి దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సువర్చస్సు పెరుగుట తమవారందరును సముద్ర మధనజనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపదిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతలవరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగ దానిని త్రాగుటతో నామెకనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహినీ రూపముననున్న జగన్మోహనుదు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలోనుండిరి. చంద్రుదు మొదలగువారు త్వరత్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలోనుండిరి. వారు యింతశ్రమయిట్లు అయ్యెని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో నిద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను.

చక్రముచే నరుకబది చావుబ్రతుకు లేవి అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని యీస్థితి మాకు దర్భరముగనున్నది. మాగతియేమి మాకాహారమేదియని దీనముగ శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతోగాని, అమావాస్యతోగాని కల సంధికాలములయందు సూర్యుని, చద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరిs.

ఇంద్రుడు మొదలగు దేవతలు అమృతకలశమును తీసికొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్రతీరమున అమృత కలశముంచినప్పుడు రెండు అమృతబిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరియొక బిందువు తులసి మొక్కగను అయినది. కొంత కాలము గడిచెను. సత్యజిత్తను సూద్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండిటిని సంరక్సించెను. ఆ రెండు మొక్కలున్నచోట మనోహరమైన పూలతోటగామారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచు పారిజాతపుష్పములను తులసీదళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్పసమృద్ధమై నయనానందకరముగ నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగ నుండెనుv.

ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకీయవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు దీసికొని వెళ్ళెను. శచీదేవిమున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు యీ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని(యక్షుని) పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్షయజమాని నడుగ కుండ వానికి తెలియకుండ దొంగతనముగ తెప్పించుచుండెనుl.

పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొనయత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండ ఆకాశమున కెగిరిపోయెను. సత్యజిత్తు యెంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యముకాకుండెను. దేవేద్రుడును 'నీవు యక్షుడవు, ఆకాశగమన శక్తికలవాడవు. మానవులకు దొరకవు. కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెనూ. పుష్పములు ప్రతిదినము పోవుచునే యున్నది. సత్యజిత్తునకేమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను.

యక్షుదు యధాపూర్వముగ పారిజాతపుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమనన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగ వాని దివ్యశక్తులతో బాతు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై గూడ సరిగా నడువలేక కుంటుచుండెను. యక్షుడును యెంత ప్రయత్నించినను అచటినుండి పోలేకపోయెను జరిగినదానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని 'ఓరీ నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి, మా పుష్పములను ప్రతిదినము యెందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెనూ యక్షుడును 'నేను యక్షుదను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పముల నపహరించి యింద్రునకు ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని యాజ్ఞచేత నిట్లు చేసితిని. కాని బుధ్ధిసాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు యేమియు మాటలాడక యింటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో నుండెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

MAAGHA PURANAM -- 22

మాఘపురాణం - 22వ అధ్యాయం

గంగాజల మహాత్మ్యము ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమహాత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి, రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరేముందు శివపూజ చేసి యుద్దరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకొనిరి. గనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణు పాదములనుండి పుట్టినదియు, శివుని శిరస్సునుండి ప్రవహించునట్టియు అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును. గాన గంగాజలమునకు అంత ప్రాముఖ్యత వున్నది. ఇంకనూ గంగాజలం గురించి చెప్పబోవునది ఏమనగా ఏనదిలో గాని, సెలయేరులో గాని, చెరువునందు గాని స్నానం చేయునపుడు ‘గంగ గంగ గంగ! అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్ళు జల్లుకొనినచో అది గంగాజలంతో సమానమయినదగును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం గనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచమునందెచ్చటనూ లేదు. అని గంగా జలమును గురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించెను.

🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️

AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*మాఘ పురాణం - 23 వ అధ్యాయము*

*నారదుని దౌత్యము - దేవతల దైన్యము*

గృత్నృమదమహర్షి జహ్నువుతో నిట్లనెను. పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని యింద్రుడుని విచారించెను. పారిజాత పుష్పముపై నున్న యిష్టము అధికమగుటచే, తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు, దేవతలను గూడ, తనతో తీసికొనివచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి, యింద్రుడు, దేవతలు మహోత్సాహముతో, పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే, స్వర్గమునకు దీసికొని పోదలచిరి. ఆ మహోత్సాహములో, శ్రీహరి, పూజా నిర్మాల్యమును, పాదములతో, త్రొక్కిదాటిరి. ఫలితముగా, దివ్యశక్తులను గోల్పోయిరి. శక్తివిహీనులైరి, ఇంద్రాదులింకను రాలేదని, మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాతవృక్షమును పెకలింపదలచి   యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే, వారును, శక్తి హీనులై పడియుండిరి.

మరునాటి ఉదాట్యమున, సత్యజిత్తు, తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన యింద్రాదులను జూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును, విచారమును, చెందెను. వారికి నమస్కరించెను. "ఇంద్రాది దేవతలారా! మీరు మానవులమైన మాకంటె గొప్పవారు. ఇంతటి మీరు, స్వల్ప ప్రయోజనమునకై, యిట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండ, పుష్పములను దొంగతనముగా తీసికొని పోదలచుట దోషము కాదా?" అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక, తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు, నేలపైనున్న మాంసమునకాశపడి, భూమిపై వానియవమానము నందినట్లు, మేమును, పారిజాత పుష్పముల కాశపడి, ధర్మమును తప్పి, దొంగలించి, యిట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితియేమిటో, యెట్టిదో, చెప్పుమని, యడిగిరి. సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక, తన యాశ్రమమునకు పోయెను.

ఇంద్రుడు మొదలగువారు, ఆహారము లేక, దుఃఖపడుచు నచట పదునొకండు దినములుండిరి. వారికి ఆ కాలమున, అమృతాహారము లేదు. కామధేనువు యిచ్చు మధురక్షీరమును లేదు. కల్పవృక్షము, చింతామణి యిచ్చునట్టి, పుష్టికరములైన భక్ష్యభోజ్యములును లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును, దేవతల దురవస్థకు, విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును, తొలగించెను. తానేమి చేయవలెనో, దేవతల దుస్థితి తన వలన యేర్పడినది యెట్లు తొలగునో తెలియక, దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని, యధాపూర్వకముగ పూజించుచు, తానును, భార్యయు, నిరాహారులై యుండిరి. ఈ విధముగా, సత్యజిత్తు కూడ, పదనొకండు దినములు, నిరాహారుడై, శ్రీహరి పూజను మానక, శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడాకాశమున దిరుగుచు, దేవతల దురవస్థను, గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థపోవునో, అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి, యిట్లు స్తుతించెను.

*నారదకృత విష్ణుస్తుతి*

ఆర్తత్రాణపరాయణాయభవతే నారాయణాయాత్మనే
గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయచ ||
మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సాజ్యప్రదే
శ్రీమత్పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః ||
అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయచ
సర్వలోక నిధానాయ నమస్తే గరుడ ధ్వజ ||
నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే
భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ ||
నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన
సర్వేశ సర్వగస్త్యంహి సర్వాధారస్సురేశ్వర ||
సర్వంత్వమేవ వృజసి నత్త్వ రూపస్త్యమవహి
పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్స్నాతనః ||
పరబ్రహ్మసి విష్ణుస్త్యం బ్రహ్మసి భగవాన్ భవః
సృష్తిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ ||
త్రిగుణోసిగుణాధార స్త్రిమూర్తిస్త్యం త్రయీరమః
ఆ సీత్త్యన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం ||
త్వమేనైకార్ణవేజాతే జగత్యస్మిన్ జగత్పతే
జగత్ సహృత్యసకలం ప్రిత్వా భాబేహనే తు భాసకః ||
త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితా విభో
గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః ||
ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం
ప్రసీదపాలయవిభో నమస్తే సురవల్లభ ||

నారదుని స్తుతిని విని, సర్వజ్ఞుడగు శ్రీహరి,యేమియు నెరుగనివానివలె, ''నారదా! స్వాగతము ఇప్పుడెందులకీస్తుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో, అది యెట్టిదైనను, దేవాదులు సాధింపజాలనిదైనను, నీకు సమకూర్చెదను" చెప్పుమని యడిగెను. నారదుడును, తలవంచి," ఇంద్రాదులు చెడుపనిని చేసి, ఆపదపాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి యిష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై, యింద్రుడు, దేవతలతో బాటు వెళ్లి, ఆ పారిజాత వృక్షము వద్ద, అగ్ని సమీపమున, రెక్కలు కాలిపడిన మిడుతవలె, దేవతా గుణముతో పడియున్నాడు. అమృతాహారులైన యింద్రాది దేవతలు, పదునొకండు దినముల నుండి, నిరాహారులై, దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తీ! నీవిప్పుడు, వారిని దయయుంచి రక్షింపవలయునని," నారదుడు కోరెనుl.

నారదుని మాటలను విని శ్రీహరి, 'నారదా! అమృతకలశము నుండి తొణికి పడిన రెండు బిందువుల అమృతమే, పారిజాత వృక్షముగను, తులసిగను అయినది. అనగా ఆ రెండును, అమృతము నుండి పుట్టినవి. రెండు మిక్కిలి పవిత్రములు, సత్యజిత్తనువాడు, ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అదియొక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను, తులసి దళములను అమ్మి, ఆ ధనముతో, దరిద్రులను ఆర్తులను పోషించి, తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను, ఇట్టి యుత్తమునికి, దీనులకును, జీవనాధారమగు పుష్పసంపదను, త్రిలోకాధిపతియగు నింద్రుడు, నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాదీనుడగు సత్యజిత్తు, నన్నర్చించిన నిర్మాల్యమును, పుష్పవాటికలో జల్లగా, భోగలాలనుడగు నింద్రుడు, నా నిర్మాల్యమును గూడ దాటెను. త్రొక్కెను. ఇన్ని దోషములచే, త్రిలోకాధిపతియగు నింద్రుడు, వాని యనుచరులు, శక్తిహీనులై, తోటలో పడి యున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును, తెలిసికాని, తెలియకకాని, దాటిన, తొక్కిన, యెంతటి వాడైనను, శక్తిని కోల్పోయి, దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు, యింద్రాదుల దైన్యమునకు బాధపడుచు, నేమి చేయవలెనో తెలియక, తానును, భార్యతో బాటు, నిరాహారుడై, నన్నర్చించుచు, నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు, నేటి వరకు, పదనొకండు  దినములు, దేవతలు అమృతపానము లేక, నిరాహారులైరి. సత్యజిత్తును, వారిని జూచి, భార్యతోబాటు, నిరాహారుడై యుండెను. దేవతల విముక్తికై, నన్ను ప్రతిదినము, నర్చించునే యున్నాడు. నేడు పదకొండవ దినము. అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు, నేడు కూడ, ఉపవాసముండి, నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు, జాగరణమొనర్చినచో, నేను ప్రసన్నుడై, అతడేది కోరినను వెంటనే యిచ్చెదను. అతడే కాదు. యెవరైనను, యేకాడశి నాడు, ఉపవాసముండి, జాగరణ చేసి, నా మంత్రమును జపించినచో, వారికిని, కోరిన దానినిచ్చెదను" అని, విష్ణువు సమాధానము ' నిచ్చెను. నారదుడును యేమియును మాటలాడలేక, తన దారిన బోయెను, అని గృత్నృమదమహాముని, జహ్నువునకు చెప్పెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మాఘ పురాణం - 24 వ అధ్యాయము*

*శ్రీమన్నారాయణుని యనుగ్రహము - తులసీ మహాత్త్యము*

గృత్నృమదమహాముని జహ్ను మునితో నిట్లనెను. సత్యజిత్తు యేకాదశియందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగ జపించుచు జాగరణ చేసెను. ఏకాదశినాటి రాత్రి, మొదటి జామునందే, శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను.

నీలమేఘమువలె నల్లనిచాయతో, నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్రకుండలములతో, చెక్కిళ్లు ప్రకాశించుతుండగా, సూర్యకాంతినిమించు కిరీటముతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టు బట్టను కట్టి, మనోహరమైన రూపముతో, గరుత్మంతునిపైనెక్కివచ్చెను. మునిగణములు, శ్రీమన్నారాయణుని స్తుతించి, భార్యతోబాటు, శ్రీమన్నరాయణుని పాదములపైబడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి ''నాయనా! కోరిన వరము నిచ్చెదను అడుగు అనెనుl".

అప్పుడు సత్యజిత్తు 'స్వామి! యింద్రాదులకు పూర్వమువలెనే సంచరించు శక్తి నిమ్ము. వారిపై దయనుంచుము. తరువాత నాకును, నాభార్యకును నీ సాన్నిద్యము ననుగ్రహింపుము" అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరిక నంగీకరించెను ఇట్లనెను. "ఓయీ! యీ ఏకాదశితిథి, సమస్త పుణ్యముల నిచ్చును. నేనీ తిథియందే, నీకు ప్రసన్నుడనైతిని, కావున యీ తిథి, నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య, యీ పారిజాత వృక్షమును పెకిలించి, యింద్రునకిండు, పవిత్రము, వనవాసి. నాకిష్టము అయిన యీ తులసిని, నాకిమ్ము, నీకు శుభము కలుగును, మరియొక ఆలోచన వలదు" అని పలికెను. సత్యజిత్తును అట్లేయని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి, పారిజాత వృక్షమును పెకిలించి, యింద్రాదుల కిచ్చెను. తులసిని, లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరియనుగ్రహము వలన, ఇంద్రాదులందరును, శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరిl.

శ్రీహరి, యింద్రాదులు వినుచుండగా, సత్యజిత్తును, వాని భార్యను జూచి, యిట్లనెను. ఈ యేకాదశితిథి నాడు, నీవు భక్తితో, ఈ  విధముగ నన్ను పూజించి, నా అనుగ్రహము నుండుట వలన, మిక్కిలి ఉత్తమమైనది. నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ యేకాదశీ తిథి, సర్వజీవుల పాపములన్నిటిని పోగొట్టి, అనంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులీవిషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి పది దినములును యధా ప్రకారము భుజించి, యేకాదశి నాడు ఉపవాసమును, జాగరణము చేసి, నన్ను స్మరించు వారు, నా సాన్నిద్యమును చేరుదురు. ఇహలోకమున, సర్వసుఖములను, సర్వశుభములను, పొందుదురు. నాకు సంతోషము నిచ్చిన, యీ తిథి, ఉత్తమ సంభావన నిచ్చి, వేలకొలది అశ్వమేధములు చేసినవచ్చు, పుణ్యము నిచ్చును. ధర్మవేత్తలగు మునులును, యీ తిథి, మిక్కిలి పుణ్యప్రదమని యందురు. పన్నెండవ రోజున, దేవతలకు, మరల శక్తి, పుష్టికలుగుటచే, ద్వాదశి తిథిని, ప్రాణదాయిని, విష్ణుప్రియయని, అందురు. అజ్ఞానముచే, ఏకాదశి రోజు  భుజించువారు, మహాపాపముల నందుదురు. దశమినాటి రాత్రి, భోజనమును మాని, ఏకాదశినాడు, రెండు పూటల, భోజనమును మాని, ద్వాదశి నాటి మధ్యాహ్నమున, నొకమారు భుజించి, నాటి రాత్రి భుజింపకయుండిన, చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని యందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము, సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున, ఉపవాసము, జాగరణము చేసి, నన్ను యధాశక్తి  పూజించినవాడు నాకిష్టుడు. నా లోకమును చేరును. ఇట్టి యేకాదసి ఉపవాసము చేసినవానినే గాక, వాని కులము వారినందరిని రక్షించి, అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యము నిచ్చును. నాలుగు వర్ణములవారు, సన్యాసి, వానప్రస్తుడు, స్త్రీబాలవృద్ధులు, అందరును, ఏకాదశినాడు భుజింపరాదు, ఏకాదశినాడు, స్త్రీ సుఖము, నిద్ర, అన్నము, వీనిని విడిచి, నన్ను పూజించవలెను. నా పాదోదకమును, సేవింపవలెను. అన్ని మాసములయందును, శుక్లకృష్ణపక్షములు, రెండిటను వచ్చు యేకాదశులన్నియు, నిట్లే ఉపవాసముండవలెను. చాంద్రాయణాది వ్రతముల నాచరించుట వలన వచ్చెడి పుణ్యము, యేకాదశీ ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా! మునులారా! నా భక్తులారా!  ఎవ్వరును యీ యేకాదశినాడు అన్ని మాసములయందును. రెండు పక్షములయందును, తినరాదు. ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసినవాడు, నా లోకమును చేరి, నన్ను పొందును. ' ఇది తధ్యము' అని, బిగ్గరగా పలికెను. అని గృత్నృమహాముని, జహ్నుమునికి వివరించెనుl.

గృత్నృమహాముని జహ్నుమునితో నిట్లనెను. శ్రీమన్నారాయణుడు యేకాదశి వ్రతవిధానమును మహత్త్యమును వివరించి, యింద్రాదులతో నిట్లనెను. మీరీ పారిజాత దివ్యవృక్షమును తీసికొని, మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు, శ్రీహరి చెప్పినట్లు, పారిజాతవృక్షమును తీసికొని, స్వర్గమునకు పోయిరి. వారందరును వెళ్లిన తరువాత, తులసి, శ్రీమన్నారాయణునితో నిట్లనెను. "స్వామీ! నీ పాపపద్మముల యందాసక్తి గల నన్ను, దయ చూడుము. నాకు నీవు తప్ప మరియొక్క గతిలేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందును" అని పలికిన తులసి మాటలను విని, శ్రీహరి," భూమియందు అమృతము వలన పుట్టిన తులసి! నీవు నాకిష్టురాలవు. నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును.

సందేహము వలదు. నీవు పవిత్రురాలవు. పవిత్రతను కలిగించుదానవు. పాపనాశినివి. తులసి దళములతో కలిగి యున్న నిన్ను చూచినవారు, గంగా స్నానము చేసిన వారువలె, పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించినవారికి, పునర్జన్మ నుండదు. అమృతము నుండి పుట్టిన తులసి  దళములను మాలగా చేసి, నా కంఠమున సమర్పించినవారు, అంతులేనంత, అనంతకాలము, నా లోకమున నుండి, నాలోనైక్యమగుదురు. నిన్ను తమ యిండ్లయందు గాని, తోటలయందు గాని, పెంచువారికి, యే పాపములును అంటవు.ప్రాతఃకాలమున నిద్రలేవగనే నిన్ను చూచి నమస్కరించినవాడు, ఆ దినమున, సర్వ సుఖముల నందును.

*యన్మూలే సర్వతీర్థాని యన్మభ్యే సర్వదేవతాః*
*యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం ||*

అను శ్లోకమును చదివి, నీకు నమస్కరింపవలెను. తులసి! నీ దళములతో నీటిని, తన శరీరముపై జల్లుకొనువాడు, అపవిత్రుడైనను, పవిత్రుడగును. నీ కుదురు మొదలులోనున్న మట్టిని, తిలకముగ, నుదుటిపై ధరించినవాడు, సర్వసుఖములను పొందును. యక్షరాక్షస పిశాచాదుల వలన, వానికి యే బాధయు నుండదు. అమృత సంభవా తులసీ! త్రైలోక్యపావనీ! నేను నిన్ను, లక్ష్మీదేవిని, సమానముగా భావింతును" అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను, కాండములను, శాఖలను, అన్నిటిని, శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శవలన, తులసి మరింత కాంతిని, పవిత్రతనుపొందెను. అప్పుడా తులసి, మనోహరమైన పవిత్రమైన, స్త్రీరూపమునంది, శ్రీహరి అంశను పొందెను. మాయావి, జగదీశ్వరుడు అయిన శ్రీహరి, లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి యెడమ చేతితో తాకబడిన భాగము, కృష్ణవర్ణమై, కృష్ణతులసి యను పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములును, తులసీ సాన్నిధ్యముచే పవిత్రములయ్యెను. తులసి యున్న ప్రదేశము పాపములను పోగొట్టును.

అప్పుడు శ్రీహరి, సత్యజిత్తును చూచి 'నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు ' అని పలికెను. సత్యజిత్తు కూడ శ్రీహరిని పూజించి, బ్రాహ్మణులకు భోజనమును పెట్టి, తన భార్యతో కలసి భుజించెనుl. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత, శ్రీహరి, అందరును చూచుచుండ, సత్యజిత్తు దంపతులతోను, తులసితోను కలసి, గరుత్మంతుని పైనెక్కి, తనలోకమునకు పోయెను. నాయనా జహ్నుముని! యిది యేకాదశీ వృత్తాంతము.  ఏకాదశి తిథి, అశ్వమేధ సహస్ర ఫలము నిచ్చునని, స్పష్టమైనది కదా. అన్నియేకాదశులలోను, మాఘమాసమునందలి యేకాదశి, మరింత శుభప్రదము. ఆనాడు, ఉపవాసముండి, శ్రీహరిని పూజించి, జాగరణ, మంత్రానుష్ఠానము, స్మరణము, చేసినవారు, శ్రీహరికి ప్రీతిపాత్రులై, సాలోక్యమును, సాయుజ్యమును, పొందుదురు. ఏకాదశినాడు, ఉపవాసము, ద్వాదశినాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి, యధాశక్తిగ గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగువానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు/బ్రాహ్మణులకు యీయవలెను. అట్టివారు యిహలోకమున చక్రవర్తియై, తుదకు శ్రీహరి సాయుజ్యమునందును. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును, శ్రీహరి కరుణా కటాక్షమునంది, విష్ణువును చేరుదురు, అని నిస్సందేహముగా చెప్పుచున్నాను" అని గృత్నృమదమహర్షి జహ్నుమునికి వివరించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*మాఘ పురాణం - 25 వ అధ్యాయము*

*కలింగ కిరాతుడు - మిత్రుల కథ*

గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. " ఓయీ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను. వినుము. ఎట్టి పాపాత్ముడైనను, మాఘమాసవ్రతము నాచరించి, పాప విముక్తుడగునని, యీ కథ తెలుపెదను. వినుము. అతి ప్రాచీనమైన యీ కథ, శ్రీహరి 
కథామహిమను తెలుపును.
పూర్వమొక కలింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి, పరివారముతో, నొకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెదకుచు అడవిలో తిరుగుచుండగా, నొకవిప్రుని జూచెను. ఆ బ్రాహ్మణుడు, నర్మదా నదీ స్నానము చేయవలయునని బయలుదేరెను. మార్గ మధ్యలో, ఆయాసముచే, నొక మఱ్ఱిచెట్టు నీడలో విశ్రమించి, మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడతని చూచి, వాని వద్ద నున్న వస్త్రములు, ధనము మున్నగువానిని అపహరింప వలయునని తలచెను. తన వారితో వచ్చి, యీ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటిని, బలవంతముగ తీసికొనెను.

"ఓయీ! నీవు దాచిన ధనమునిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని, కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును, 'నేను దరిద్రుడను నా వద్ద ధనమేమియు లేదని, సమాధానము నిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు, ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు,  అచటి మార్గమున ప్రయాణించువారిని చంపి, వారి నగలను, ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా, అరణ్య మార్గముననే కాక, పట్టణ మార్గమున ప్రయాణించు, వారిని  కూడ  దోచుకొని, చంపుచుండెను. వానికి ధనమును సంపాదింప వలయునను కోరిక, విపరీతముగా పెరుగుచుండెను.

ఇట్టి కిరాతునకు, బంగారు నగలను చేయువాడొకడు, మిత్రుడుగ నుండెను. అతడును కిరాతునివలె, క్రూరుడు, వంచనాపరుడు, బంగారపు నగలను చేయుచు, దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని, స్వర్ణకార మిత్రునికిచ్చెడివాడుl. అతడును నగలమ్మి, అందులో కొంత ధనమును తీసుకొని, మిగిలిన ధనమును కిరాతునకిచ్చెడివాడు. వీరికి మరియొక శూద్రుడు మిత్రుడుగ నుండెను. వాని తల్లియును అట్టిదే. భర్త మరణించిన పిమ్మట, ఆమె మరింత స్వేచ్చావర్తనురాలయ్యెను. ఈ విధముగ, నాకుటుంబమున కుమారుడు, తల్లి యిద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా, నుండిరి. వాని తల్లి, చీకటిలో కామాతురయై, తన విటుడు వచ్చుచోటికి పోయెను. చీకటిగానున్న ఆ యింటికి, ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని, యామె వానికై వేచియుండెను. అచటకు ఆమె కుమారుడు, వ్యభిచారిణి కాముకురాలయిన, తన కిష్టురాలయిన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో నున్న తల్లి, తాను కోరిన ఆమెయనుకొనెను, వాని తల్లియు, ఆ చీకటిలో వచ్చినది, తాననుకొన్న విటుడే అనియనుకొన్నది. ఈ విధముగా, తల్లియు కుమారుడును, ఆ చీకటిలో, ఒకరినొకరు యెరుగక, తమకు కావలసిన వారేయనుకొనిరి. ఫలితముగా, వారిద్దరును, ఆ చీకటిలో కలిసిరి, సమాగమమైన తరువాత, వారిద్దరును, ఒకరి నొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంత కాలమునకు మరణించి, నరకమును చేరి, శిక్షలననుభవించుచుండెను. కుమారుడు మాత్రము, నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే, అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై, కిరాతుని చేరి, వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు, బ్రాహ్మణుని, ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి యిచ్చిన నగలలో, బంగారమును, దొంగలించువాడు. శూద్రుడు, తల్లితో, వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని,, బ్రాహ్మణ మిత్రుడొకడు, కలడు. అతడు వారితో కలసి, వారితోబాటు, పాపకార్యములను చేయుచుండెను, బ్రాహ్మణుడగుటచే, వాడు పౌరోహిత్యమును కూడ చేయుచుండెను. వీరి కలయికతో, పంచ మహాపాపములొకచోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కల్లుత్రాగువాడు, క్రూరుడు, బంగారము నపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరైదుగురును, పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు, కిరాతుడు, పంపగా, గ్రామాంతరమునకు పోయెను, అతడు ఆ గ్రామమున, శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకనిని జూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టియుండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు, వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి,దీనుడై యున్నవానిని చూచి, "నీవెవరవు? ఎక్కడికి పోవుచున్నావని" యడిగెను. అతడును," నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పని చేయువాడనని" పలికెను. అప్పుడు వీరవ్రతుడు, ధ్యానమగ్నుడై యుండి, కనులు తెరచి యిట్లనెను.

"ఓయీ! నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను. వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసినవాడు, హింసాపరుడు. వానికి బంగారమును దొంగలించినవాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు. తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసినవారితో, తిరిగి, నీ బ్రహ్మతేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను, తాకినను, వాడును, వారివలె పాపాత్ముడగును. అట్టివారితో మాటలాడక, తప్పనిసరి అయినను, దర్భను చేత బట్టి, మాటలాడవలెను. అట్టు చేసిన పాపమంటదు.

నీవట్టి పాపాత్ముల సాంగత్యముచే, బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని, పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్పగమనము చేసినవాడు, బంగారమును దొంగలించిన వాడు, వీరితో స్నేహము చేసినవాడు, వీరైదుగురు, పాపులే. ఇట్టివారికెంత దూరముగ నున్న, అంత మంచిది." అని, వీరవ్రతుడు, నిశ్శంఖులునితో పలికి, మిన్నకుండెను.

నిశ్శంఖులుడును, వీరవ్రతుని మాటలను విని, భయపడెను. "జ్ఞానీ! నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపమునుండి, విముక్తి యెట్లు కల్గును? సర్వపాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని", వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలను విని, దయాళువైన వీరవ్రతుడు, "మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము, ప్రాయశ్చిత్తము నిట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు, తీర్థ యాత్రలను, పన్నెండు సంవత్సరముల పాటు, చేయుము. ప్రతి యింటను బిచ్చమెత్తుకొని, ఆ బిక్షాన్నమును, తినుచుండుము. ప్రతి మాఘమాసమున, ప్రయాగ క్షేత్రమున, ప్రాతఃకాల స్నానము చేసి, మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే, ముక్తి కల్గును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును, చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను, మాఘమాసమున, ప్రయాగలో స్నానము చేసినచో, వాని పాపములు పోవును. కావున పన్నెండు సంవత్సరములు పూర్తిగాగాని, సంవత్సరము పాటు కాని, ప్రయాగ మాఘస్నానము నాచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును, వండుకొని తినుము ఈ ప్రకారమొక మాసము చేయుము" అని అనెను. నిశ్శంఖులుడును, అట్లేయని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు, ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును, వాని మాటలకు సంతోషించి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే, వారికిని ఆచరింపదగినదని చెప్పెను. నిశ్శంఖులుడును, వీరవ్రతునకు నమస్కరించి, పన్నెండు సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసికొన్న తరువాత, నాకు ధర్మము నుపదేశింప గోరుదునని" యడిగెను. ఆ ధర్మము నప్పుడు చెప్పుదును పొమ్మని, పలికెను.

నిశ్శంఖులుడును, కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి, వీరవ్రతుడు చెప్పిన మాటలను, వారికి చెప్పెను. వారును నిశ్శంఖులుని మాటలను విని, భయమును, పశ్చాత్తాపమును, పొందిరిl. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి, ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్నభోజనము, మాఘస్నానము చేసి,, పాపవిముక్తులైరి. నిశ్శంఖులుడు, వ్రతమును పాటించుచు, తీర్థయాత్రలు చేయుచు, కాశీ నగరము చేరి, కొంతకాలముండి, తరువాత, ప్రయాగకు పోయి, మాఘమాస వ్రతము నాచరించెను. అన్ని తీర్థముల స్నానము, పాపనాశనము, ప్రయాగ స్నానము. నిశ్శంఖులుడును, వీరవ్రతుడు చెప్పినట్లు, పన్నెండు సంవత్సరములు ప్రాయశ్చిత్తము నాచరించెను. పాపవిముక్తుడై, వీరవ్రతుని వెదకుచు, నైమిశారణ్యమునకు బోయి, వీరవ్రతునకు నమస్కరించి, యిట్లు పలికెను.

వీరవ్రతుడు, తనకు నమస్కరించిన నిశ్శంఖులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. రెండు గడియలు ఆలోచించి యిట్లనెను. " ఓయీ నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే, దుష్టసాంగత్యజనిత దోషలుము కూడ పోయినది. నీవిప్పుడు బ్రహ్మతేజస్సుతో నున్నావు. మంత్రపూతమగు జలముతో, మూడు దినములు స్నానము చేయింతును. నిరాహారముగ, నీవీ మూడు దినములుండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంఖులునిచే మంత్రజలమున స్నానము, మూడు దినములు, చేయించెను. నిశ్శంఖులుడు, వీరవ్రతుడు చెప్పినట్లు, నిరాహారుడై యుండెను.

వీరవ్రతుడు నిశ్శంఖులునకు ఇట్లు ఉపదేశించెను." ఓయీ! నిరంతరము సంతోషముగనుండుము. వేదమార్గమును అతిక్రమింపకుము. శాస్త్రముననుసరించి కార్యములనాచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మము నాచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము, సంధ్యా వందనము, మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరిని హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని జూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలె చూడుము. చదివిన వేదములను మరువకుము. అతిధుల నవమానింపకుము. పితృదినమున శ్రార్థమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండుధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చింపుము. తులసి మాలను ధరించి, తులసీ దళములతో, లక్ష్మీనారాయణులను, బిల్యదళములతో, శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును, సేవింపుము. నివేదాన్నమును భుజింపుము, యతీస్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోదాది శత్రువులను జయింపుము, మాఘస్నానమును మానకుము, మనస్సు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాదికము నాచరింపుము, అని, వీరవ్రతుడు, నిశ్శంఖలునకు, ధర్మప్రశస్తిని, ఆచరణ విధానమును చెప్పెనుl.

నిశ్శంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతినంది, మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి, వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును, ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను, పుత్ర పౌత్రులను పొంది, సుఖముగ నుండెను తరువాత మరణించి ముక్తి నందెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*మాఘ పురాణం - 26 వ అధ్యాయము*

*పుణ్యక్షేత్రములలో నదీస్నానము*

ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్టులవారు వివరించగా, ఆ రాజు "మహర్షి! మీ కృపవలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు గలదు, అది ఏమనగా, మాఘమాసమందు యే యే తీర్థములు దర్శింపవలెనో సెలవిం" డని వినమ్రుడై కోరగా వశిష్టులవారు మరల యిట్లనిరి.
  "దిలీప మహారాజా! మాఘస్నానములు చేయుట యందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థమహిమలను గురించి వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘస్నానములు చేయలేక, తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఏలననగా మాఘమాసములో యే నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీస్నానము సర్వపాపహరమైనది. ఆవశ్యమైనది కూడా, అటులనే ప్రయాగ అతిముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నాన మాచరించిన యేడు జన్మలలోని పాపములన్నియు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానముతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలము కల్గుటయేగాక మరల జన్మలనేవి కలుగదు.

ఇక త్రయంబకమను ముఖ్యమైన క్షేత్రం కలదు, ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జనించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పొగొట్టుకొనుట కిచ్చటనే ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింప జేసినాడు. కావున మాఘమాసములో గోదావరియందు స్నానము చేసిన యెడల తక్షణమే సకల పాపములూ హరించి పోవుటయే గాక, ఇహమందు, పరమందు కూడా సుఖపడుదురు, మన దేశములో యెన్నో నదులున్నవి, ప్రతి నదీతీరమున యెన్నో క్షేత్రములున్నవి, ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యములు అవి వందకు పైగావున్నవి. అటువంటి కొన్నిపేరు స్మరించినచో ఆ నదీ తీరాలలో నున్న క్షేత్రదేవతలను కూడ స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తుచేసుకొందాము. నందిని, మందాకిని, నళిని, తామ్రవర్ణి, భీమరధి, గంగా, యమున, నేత్రావతి, పంపానది, కృష్ణవేణీ, మహేద్రతనయ, గోదావరి, నర్మదా మొదలైనవి మహానదులు. భగీరధి, గంగ, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణీ, బాహుద, భీమరధి, తుంగభద్ర, రేణుక, మలావహరి, కావేరి, క్పతమాల, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశాపతి, పల్గుని కరతోయ, పుణ్యద, ప్రణిత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నమువలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యమునందించునని, మహానదులు, పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగ, యమున మొదలైన నదులు, మహానదులుగానూ పుణ్యనదులుగాను అయివుండవచ్చును. ఈ నదులలో చేసిన స్నానం విశేషఫలప్రదం, మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను, పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీతీరములయందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్దములగు ఉపనదులు కూడా కలసి తమతమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే "వరం తప" అని ఉపనది ప్రవహించేచోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతి వృత్తము గలదు. సావధానుడవై ఆలకింపుము.

విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకును, యీశ్వరునకు అయిదేసి తలలు వుండెడివి. ఈశ్వరునికి పంచరుద్రుదు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు! బ్రహ్మ దేవుడు నాకును ఐదు తలలున్నవి; నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున, చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు యిద్దరూ యుద్ధము చేయగా, శివుడు బ్రహ్మ యొక్క ఐదవతలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి, తాను నరికిన బ్రహ్మ తలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలోవున్న బ్రహ్మతల యెండిపోయి, పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి "భిక్షాందేహీ" యనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకురాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంటపోవుట సహించలేక, అతనికి "పురుషత్వము నశించునుగాక" అని శపించిరి. ఈశ్వరుడును చేయునదిలేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే, ఐక్యమయి పోయినాడు, అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన, ఆ లింగమమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెనుl. కోటిసూర్యుల తేజస్సు కలిగి, ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు, శివుని వద్దకు వచ్చి, వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి.

ఆ విధముగా భూలోకమునకు వచ్చి, శివుడు, అప్పటినుండి లింగాకారముగా మారినందున, భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు, శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*మాఘ పురాణం - 27 వ అధ్యాయము*

*సులక్షణ మహారాజు కథ*

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జన్మ సంసారము అను సముద్రమును, దాటనక్కరలేని సాధనమే, మాఘమాసవ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక కథను వినుము. పూర్వము ద్వాపరయుగమున అంగదేశమును పాలించుచు సులక్షణుడను రాజు కలడు. అతడు సూర్యవంశమున జన్మించినవాడు. బలపరాక్రమములు కలవాడు. ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి నూరుగురు భార్యలున్నను, సంతానము మాత్రము లేదు. రాజులందరును, వానికి సామంతములై, కప్పములు చెల్లించుచున్నను, సంతానము లేదను విచారము మాత్రము, రాజునకు తప్పలేదు.

నేనేమి చేసిన కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును, పెద్దలు, పుత్రులు లేనివారికి, దరిద్రునికి, కృతఘ్నునకు, వేదహీనుడగు విప్రునకు, సద్గతి లేదనియందురు. పుత్రులు లేని నేను, మహర్షుల యాశ్రమమునకు పోయి, అచట పెద్దలను ప్రార్థించినచో, పుత్రులు కలుగుటకు, వారేమైన ఉపాయము చెప్పగలరేమో? ప్రయత్నించి చూచెదను, అని నిశ్చయించెను. అనేకమంది మహర్షులు కల నైమిశారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిశారణ్యమునకు వెళ్లెను, అచట మునులకు నమస్కరించి, తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి, యిట్లనిరి. "రాజా! వినుము. నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు, సర్వసంపన్నుడవైనను, మాఘమాసమున, రధసప్తమి నాడు, కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకీ జన్మలో, సంతానము కలుగలేదు. ఇందువలననే, యింతమంది భార్యలున్నను, నీకు సంతానము కలుగలేదు" అని చెప్పిరి. అప్పుదు రాజు, "నాకు సంతానము కలుగునుపాయము" చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడా మునులొక ఫలమును మంత్రించి, రాజునకిచ్చిరి. దీనిని నీ భార్యలందరికిని పెట్టుము. ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషముతో, మునులకు నమస్కరించి, కృతజ్ఞతను వెల్లడించి యింటికి వచ్చెను. రాణులు సంతోషముతో వానికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషముతో, స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు, ఆ ఫలమును శయ్యా గృహమునుంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య, ఆ ఫలము దొంగలించి, తానొక్కతియే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా, ఆ ఫలము లేదు. సేవకులను, రాణులను తర్కించి అడుగగా, వారు తమకు తెలియదనిరి, తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు యేమియు చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకామె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య యిట్లు గర్భవతి యగుట మిగిలిన భార్యలకిష్టము లేదు. ఆమె గర్భము పోవుటకై, వారెన్నియో ప్రయత్నములను చేసిరి. కాని దైవబలమున, అవి అన్నియు, వ్యర్థములయ్యెను. కాని వారు చేసిన ప్రయత్నము వలన, గర్బపాతమునకిచ్చిన మందుల వలన, చిన్న భార్య మతిచెడెను. ఎవరికి తెలియకుండ అడవిలోనికి పారిపోయెను. ప్రయాణపు బడలికకు, ఆమె అలసెను. ఒక పుత్రుని కని, యొడలు తెలియక పడియుండెను. గుహలోనున్న పులి, బాలింతను యీడ్చుకొని, పోయి, భక్షించెను.

అప్పుడే పుట్టిన బిడ్డ, రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా, హంసల గుంపు వచ్చి, రెక్కలను చాపి, యెండ మున్నగువాని బాధ, ఆ శిశువునకు లేకుండ చేసినది. తేనె పండ్ల గుజ్జు మున్నగువానిని, బాలునకు పెట్టి, ఆ పక్షులు వానిని రక్షించినవి. బాలుడును, పక్షుల పెంపకమునకు అలవాటుపడి, అచటనే తిరుగుచుండెను. అచటి సరస్తీరమున అతడాడుకొనుచుండగా, హంసలు నదిలో విహరించెడివి. ఒకనాడు పవిత్రదినమగుటచే,  సమీప గ్రామముల వారు, సకుటుంబముగా ఆ సరస్సునందు స్నానమాడవచ్చిరి, అట్లు వచ్చినవారిలో, ఇద్దరు భార్యలుండి, సంతానను లేని గృహస్థు ఒకడు, వారితో బాటు, స్నానమునకు వచ్చెను. అచట తిరగాడుచున్న బాలుని చూచి, ముచ్చటపడి, యింటికి గొనిపోవలెను అని తలచి, ఈ బాలుడెవరు? యెవరి సంతానము అడవిలో యేల విడువబడెను? అని యెంత ఆలోచించినను, వానికి సమాధానము దొరకలేదు, వనమున, జలమున, గర్భమున, నెచటనున్న వానినైనను రక్షించి, పాలించు వాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా! ఆయనయే, నాకీ బాలుని యిట్లు చూపినాడని తలచెను. బాలుని యింటికి గొనిపోయెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు, ఎవరికి వారు, వారే ఆ బాలుని పెంచవలెను అని, పరస్పరము వివాద పడుచుండిరి. ఈ విధముగా రెండు సంవత్సరములు గడచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయములో, పెద్ద భార్య, ఆ బాలుని అడవిలో విడచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు, బాలుని యెంత వెదకినను, కనిపించలేదుl.

అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు, వింటివలెనున్న తులసి పొదవద్దకు వెళ్ళెను. అచటె పండుకొనెను. తులసీ స్పర్శవలన, బాలునకావనమున, యెట్తి ఆపదయు రాలేదు. శ్రీహరి అనుగ్రహమున, వానికి రాత్రి గడచినది. యెవరును లేని ఆ బాలుడు యేడ్చుట తప్ప, మరేమి చేయగలడు? వాని దైన్యము, నిస్సహాయత, ఆ అడవిలోనుండు పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు, అచటికి వచ్చినవి, బాలుని నిస్సహాయత, ధైర్యము, వానిలోని దివ్యలక్షణములను మేల్కొలిపి, వానిపై జాలిని కలిగించినవి. ఆ ప్రాణులును కన్నీరు కార్చినవి.

ఒకరి బాష మరొకరికి తెలియని రాజకుమారుడు, పశుపక్ష్యాదులు యిట్టి సహానుభూతి నందినప్పుడు, మరియొక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా! అట్లే బాలుడును, పక్షియోమృగమైనప్పుడు వాని దుఃఖము యెట్లుండునో కదా, బాలుడు పశుపక్ష్యాదులు , విభిన్నజాతులవారైనను, వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము. ఒక చోటనుండి  వచ్చినదే. అదియే దివ్యత్వము, కాని విచిత్రమేమనగా, బాలునికి తనజాతిదే అయిన స్త్రీ వలన ఆపదవచ్చినది. ఆ విప్రుని మొదటి భార్య,ఆమెలోని దివ్యత్వము లోపించినది. సృష్టి విచిత్రమని యనుకొనుట తప్ప, మనకే సమాధానమును తోచదు. ఇదియే భగవంతుని లీల, అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు యెండ వానిపై బడకుండ, రెక్కలతో నీడను కల్పించినవి, తమ విచిత్ర రూపములతో, వాని మనస్సును, శోకము నుండి మరల్చినవి. మృగములును. తేనె, ముగ్గినపండ్లు వంటి ఆహారములను, వానికి తెచ్చి యిచ్చినవి. ఈ విధముగా, మృగములు, పక్షులు, వానికి తెచ్చి యిచ్చినవి. ఈ విధముగా మృగములు, పక్షులు, వానికి తాము చేయగలిగిన యుపచారములను చేసి, వాని దుఃఖములను  మాన్పించి, తమ యుపచారములచే, వాని ఆకలిని తీర్చినవి. బాలుడు, తులసి పొదలో నుండుట, తులసిని జూచుట, తాకుట, మున్నగు పనులను, ఆతర్కితముగ చేయుటచే, పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన, దైవానుగ్రహము నాతడు పొందగలిగెను. తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని, యుపచారములను పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన, యిట్టి సానుభూతిని, యితరుల నుండి పొందగల్గెను. అప్రయత్నముగ వాని నోటి నుండి, కృష్ణ, గోవింద,  అచ్యుత మున్నగు భగవన్నామముల యుచ్ఛారణ శక్తి కలిగినది. అతడా మాటలనే పలుకుచు, తులసి పాదులో నివసించుచు, ఆడుకొనుచు, కాలమును గడుపసాగెను. అడవిలోనున్న తులసియే, దీనుడైన యొక బాలునకట్టి దయను, పశుపక్ష్యాదుల ద్వారా చూపినది. అట్టి తులసి, మన యిండ్లలోనుండి, మనచే పూజింపబడిన, మనపై యెట్టి అనుగ్రహమును చూపునో విచారింపుడు. తులసి మన యింట నుండుట వలన, మనము తులసిని పూజించుట వలన, మనకు దైవానుగ్రహము కలిగి, మరెన్నియో యిహపరలోక సుఖములనంద వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహమును మరింత పొందవచ్చును.

_*రాజకుమారుని పూజ - శ్రీహరి యనుగ్రహము*_

సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్యయేమైనదో తెలిసుకొనవలెనని, సేవకులను పంపి, వెదకించెను. కాని ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి యూరకుండెను. అడవిలోనున్న రాజకుమారుడు, పూర్వమునందువలెనే, శ్రీహరినామస్మరణ చేయుచు, పశుపక్ష్యాదులతో, మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు, యిట్టి బంధువుల నెరుగడు. కేవలము, శ్రీహరి నామోచ్ఛారణము, శ్రీహరి పూజ, వానికి నిత్యకృత్యములయ్యెను. శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కల్గెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేరు. ఒకనాడు, ఆకాశవాణి, మాఘస్నాన వ్రతము నాచరింపుమని, వానికి చెప్పెను. రాజకుమారుడును, ఆకాశవాణి చెప్పిన మాటల ననుసరించి, మాఘస్నానము, పూజ, మున్నగు వానిని, ప్రారంభించెను.

మాఘశుక్ల చతుర్దశినాడు, రాజకుమారుని పూజాంతమున, శ్రీహరి వానికి దివ్యదర్శనమునిచ్చెను. శుభమును కలిగించు బాహువులలో, బాలుని కౌగిలించుకొనెను. ఓ బాలకా! "నాభక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను. బాలుడును నాకు నీపాద సాన్నిధ్యమును, చిరకాలమను గ్రహింపుమని కోరెను. శ్రీహరి "బాలకా! నీవు రాజువై, యీ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకుము, పుత్రపౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగభాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకుపొమ్ము. రాజువై చిరకాలము కీర్తిని, సర్వసంపదలను, సర్వసమృద్దులను, సర్వసుఖములను, అనుభవింపుము. మాఘమాస వ్రతమును మాత్రము విడువక, చేయుము. ఆ తరువాత, నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న, సునందుడను, వానిని పిలిచి, రాజకుమారుని, వాని తండ్రి వద్దకు చేర్చుమని, చెప్పెను. సపరివారముగ, అంతర్దానమందెను. సునందుడును, రాజకుమారుని దీసుకొని, సులక్షణ మహారాజు వద్దకు, వెళ్ళెను. రాజకుమారుని పూర్వ వృత్తాంతమును, శ్రీహరి అనుగ్రహమును, వానికి వివరించెను. పుత్రుని, వానికి అప్పగించెను. తన స్థానమునకు, తాను పోయెను.

సులక్షణ మహారాజు ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కుమారునకు, సుధర్ముడని, పేరిడెను. బాలుడు, విద్యాబుద్ధులను పొంది, పెద్దవాడైన తరువాత, వానిని, తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను. వృద్ధుడైన సులక్షణుడు, భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి, కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలును, సమాగమనము చేసి, పరలోకమునకు, భర్తననుసరించి తరలిరి. సుధర్ముడు, భక్తితో, తండ్రికి, తల్లులకు, శ్రద్ధతో, శ్రార్ధకర్మల నాచరించెను. సుధర్ముడును, తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగ, ప్రజారంజకముగ, చిరకాలము, రాజ్యమును పాలించెను. పుత్రులను, పౌత్రులను, పెక్కు మందిని పొందెను. అతడెప్పుడును, మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోను, మనుమలతోను, భార్యలతోను కలసి, జీవించియున్నంతవరకు, మాఘమాస వ్రతము నాచరించెను. తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి, శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

జహ్నుమునీ! ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును  విడువక ఆచరింపవలయును. అట్లు చేసిన, శ్రీహరి భక్తులకు, యెట్టి భయమునుండదు. ఈ వృత్తాంతమును వినినవాడును, విష్ణుభక్తుడై మాఘమాసవ్రతము నాచరించి, విష్ణుప్రియుడై, యిహపరలోక సుఖములనంది, శ్రీహరి సాన్నిధ్యమునందును. సందేహము లేదు. అని, జహ్నుమునికి గృత్నృమదమహర్షి చెప్పెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో 
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
మాఘ పురాణం - 28 వ అధ్యాయము*

*క్రూర కథ*

గృత్నృమహమహర్షి జహ్నుమునితో నిట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము నాచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశమువారి నందరినుద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహదేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ యుండెను. ఆమె యొక రైతు భార్య. మిక్కిలి కోపము కలది. ఆ  దంపతులకు జ్ఞానియగు పుత్రుడుకలడు. అతడు దయావంతుడు ధర్మాచరణమనిన యిష్టము కలవాడు. వాని భార్య పతి భక్తి కలిగినది ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుటయందిష్టము కలదు. బంధువులకు దీనులకు అతిథులకు అందరికి యధా శక్తి సేవ చేయనది. అత్తమామలకెప్పుడును సేవచేయుచుండెను. క్రూర కోడలిని యే దోషము లేకున్నను నిందించెడిది. కొట్టెడిది. అప్పుడప్పుడామె భర్తను  తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుచు నోర్పుతో వినయ విధేయతలతో వారికి యధాశక్తిగ సేవలు చేయుచుండెడిది.

ఒకనాడు యిట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను జూచి, క్రూరా పుత్రుడు, తన తల్లిదండ్రులతో నిట్లనెను. "నాయనా! అమ్మా! నా మాటను విడును. నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది. మీకు కోడలిపై కోపమెందులకు? కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించు యీ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను గాని, నా భార్యగాని మీకేమి అపకారమును చేసితిమి? మీయీ కోపమునకు కారణమేమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపముచే, ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము, మున్నగునవి నశించును కదా! సర్వజ్ఞులైన, పెద్దలైన మీరు, కోపమును మాని, మాయందు దయను చూపి, సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు" అని పలికెను.

పుత్రుని మాటలను విని క్రూర, భర్తతోబాటు మిక్కిలి కోపముతొ, యిట్లనెను. "మూర్ఖుడా! పో పొమ్ము. నీవెంత? నీ భార్యయెంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యను యేమి చేసినను తప్పులేదు," అని పలికి కొడుకును కోడాలిని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగ కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను. కాని సహజమైన శాంతమును పొందెను. 'అయ్యో తల్లితండ్రులను ద్వేషించుట యెంత తప్పు. అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటిలేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా! విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగుమాటలతో నూరడించెను. ఓర్పుగా నుండుమని సమాధాన పరచెనుl.

కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసి వేసెను. ఆమె కుమారుడీ ఆకృత్యమును జూచి తల్లినేమియు అనలేక పితృభక్తి వలన నేమియు చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలెనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను. కోడలు ఆ గదిలో ఏడురోజులు అన్నము, నీరులేక ఆవిధముగా నిర్భంధములోనుండెను. యిరుగుపొరుగువారు, బంధువులు, మిత్రులు యీపని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు, కోడలిని అట్లె నిర్బంధించి పీడించెను. ఏడవదినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండ తలుపు తెరచి చూచెను. మరణించిన భార్యను జూచి సంతాపమునంది నిశ్చేష్టుడైయుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను.

క్రూరయూ తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖవివశుడైన పుత్రుని జూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము యెక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె యెడ్పును విని అందరును యేమియనుచు చూడవచ్చిరి. విషయమును తెలిసికొని క్రూరను బహువిధములుగ నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను.

క్రూర పశ్చాత్తాపమునందెను, పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగ శోకించుటను జూచి జనులందరును విచారించిరి. కాని ఈ సమయమున విచారించి లాభమేమి? పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు, కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసివత్ర నరకము(కత్తుల బోను) చిరకాలమనుభవించిరి. తరువాత చంపా తీరమున 
సర్పములై జన్మించిరి. రావి చెట్టు తొఱ్ఱలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు, ఉపధీరుదు అను యిద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి, చంపానదిలో మాఘమాస స్నానము నాచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగ చెప్పుకొనిరిl.

సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుటవలన, వారి పాపములు పోయినవి. పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్యా! మాఘమాసవ్రత మిట్టిదని యెంతకాలము చెప్పినను పూర్తికాదు. ఇంతమందియే మాఘమాసవ్రత మహిమ వలన తరిoచిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి యెంతమందియో, ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్ష్యాదులు, వారు వీరననేల, సర్వప్రాణులును, మాఘమాసవ్రతము నాచరించుట వలన, చూచుట వలన, వినుట వలన, తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము నాచరించినచో, చేసిన పాపములు పోయి, పుణ్య లోకములు కలుగుననుటకెన్ని ఉదాహరణములను చెప్పగలను? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా!" అని గృత్నృమదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో

మాఘ పురాణం 29

మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.

మాఘమాసమునందు నదీస్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశీ వ్రతం చేసి ఉపాసం వున్న వారలు వైకుంఠప్రాప్తినొందగలరు. 

మాఘమాసమందు ఏకాదశీ వ్రతమొనరించి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి. 

పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మంధర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగాను, చేసుకొని క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాల సముద్రమును మధించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విష జ్వాలలకు సమస్త లోకములూ నాశనమవసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులూ సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. 

అందుకే శివునికి నాటినుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగవులాడుకొన సాగిరి. అంతట శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలచాడు.
మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి. ఆమె వారిరువురి మధ్యకూ వచ్చి అమృతాన్ని ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకిష్టమేనా? అన్నది. 

దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మంద భాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈమోసమునకు రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీమహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. 

దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై, వనమంతా జల్లాడు. దేవేంద్రుడు పారజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరార సాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాద మొనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటినుండి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొన సాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును.

ఫలశ్రుతి:
సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులూ క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువు ను మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియూ, పుత్రపౌత్రాభివృద్ధియు, వైకుంఠప్రాప్తి నొందగలరు.

సర్వే జనాః సుఖినో భవన్తు!!
మాఘపురాణం సంపూర్ణం



🅰🆅🅱 సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
మాఘ పురాణం - 30 వ అధ్యాయము*

*మార్కండేయుని వృత్తాంతము*

వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కావిశ్వనాధుని దర్శనము, విశ్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి "మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్దగా ఆలకింపుమని, యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే. రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాస్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పఠిoచి, గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండేయునకు "కుమారా! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాముl. అయినను గురువులయెడ,పెద్దలయెడ, బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన, నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధీగును" అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండృల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి, మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు, మునీశ్వరులు, గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరుకూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, ఆయన మార్కండేయుని వారించినారు, అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి" మహానుభావా! మీరిట్ళు వారించుటకు కారణమేమి?" అని ప్రశ్నించెను.అంత వశిష్ఠుల వారు," ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుదిచ్చిన వరము ప్రకారము యీతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును" అని చెప్పెను.

అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ, చాలా విచారించిరి. 'చిరంజీవివై వర్ధిల్లు' మని దీవించినందున, వారి వాక్కులసత్యములగునని బాధపడి," దీనికి మార్గాంతరము లేదా? "యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి, వశిష్టులు కొంతసేపాలోచించి, "మునిసత్తములారా! మనమందరమునూ, ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని, బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల ఆగమునకు బ్రహ్మ్ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ 'చిరంజీవిగా జీవించు నాయనా' అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాoతమును, బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెళ్ళబుచ్చి కొoతతడవాగి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి "పరమేశ్వరుడు యీ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక" యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి "ఓ మునులారా! మీరు పోయిరండు. ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు" అని పలికి, "వత్సా మర్కండేయా! నీవు కాశీ క్షేత్రమునకు పోయి, విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని" ధైర్యము చెప్పి పంపి వేసెను.

మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, 'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ ' నిమ్మని కోరగా మృకండుడు ఆతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి .విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే
యుండసాగెనుl.

క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా, ఆ నిమిత్తమై, వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి, ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి, జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా, యముడాశ్చర్యపడి, తానే స్వయముగా వచ్చి, మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి, యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా, నాతడు భయపడి, శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి, తన భక్తుని ఆక్రందనను విని, మహారౌద్రాకారముతో, శివలింగమును చీల్చుకొని వచ్చి, త్రిశూలముతో యముని సంహరించి, మార్కండేయుని రక్షించెను.l

యముడు చనిపోవుటచే, అష్టదిక్పాలురు, బ్రహ్మాదిదేవతలు వచ్చి ,శివుని అనేక విధముల ప్రార్థించిరి, "కోపముచల్లార్చుకో మహేశా! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా! అతని ఆయువు నిండిన వెంటనే, యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని, ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన, మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట నీశ్వరుడు యముని బ్రతికించి," యమా! నీవు నా భక్తుల దరికి రావలదు సుమా! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన, తన కుమారుడు, దీర్ఘాయుష్మంతుడు అయినందులకు, మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి, యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏












కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్యాకేజీ యాత్ర @17000/-

మహాలయ పక్షము 2025

🙏 దక్షిణ భారత తీర్థ యాత్ర 🙏 ప్యాకేజ్ @17300/-