కాలభైరవుడు
కాలభైరవుడు
🚩🚩🚩🚩🚩
కాలభైరవుడు ఎవరు? శివాలయం బయట ఎందుకు ఉంటాడు?
🚩🚩🚩🚩🚩
కాలభైరవుడిని పరమేశ్వరుడి పరిపూర్ణ అవతారం.
అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన మహాశక్తిమంతుడు... దుష్టశిక్షకుడిగా, గ్రహపీడల్ని తొలగించే దేవ దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. వారణాసి గా పిలువబడే కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు.
“భైరవః పూర్ణ రూపోహి శంకరస్యపరాత్మనః
మూఢాస్తంవై నజానంతి మోహితాశ్శివమాయయా “
...అంటుంది శతరుద్రసంహిత.
శివపురాణమూ, కాశీఖండమూ కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి.
భైరవుడిని స్మరించుకోవడానికైనా ఓ యోగం ఉండాలంటారు. పక్కనే కాలభైరవక్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో మనం పట్టించుకోం. లోపలికెళ్లాలన్న ఆలోచనా రాదు. అందుకో కారణం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు.
పరమశివుడు మనల్ని ఓరకమైన మాయాలో పడేస్తాడట. దీంతో... కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామట. ఆ మాయాపొర తొలగిననాడు... పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు కట్టెదుట దర్శనమిస్తాడు. కాలభైరవ ఉపాసన ప్రాచీనమైనది. భైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవుడి ఆలయాలున్నాయి.
ఎవరీ కాలభైరవుడు...
శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టికర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరుంటారు? నేరుగా బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు కూడా ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు. అంతలోనే...సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను సృష్టించాడు పరమేశ్వరుడు. దీంతో, మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది.
‘పిచ్చి మహర్షులూ! పరమతత్వం గురించి చెప్పేదేముంది? నేనే ఆ మహాతత్వాన్ని.
స్వయంభువును నేను. విధాతను నేను.
సృష్టిస్థితిలయల కారకుడినీ నేను. మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే..’ అంటూ ప్రగల్బాలు పలికాడు. అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపించాయి.
మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయాపొర కమ్మేసింది. ‘కాదుకాదు...నేనే గొప్ప’ అంటూ వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికెళ్లారు. వేదాలు పురుషరూపాన్ని ధరించి
"యదంతస్థ్సాని భూతాని యత్సర్వం ప్రవర్తరే..."- సకల ప్రాణుల్నీ తనలో లీనం చేసుకున్నవాడైన రుద్రుడే పరమతత్వం అంటూ ఆ వేదపురుషుడు పరమేశ్వరుడిని కొనియాడాయి.
ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని నిర్ధారించింది. అంతలోనే...దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు.
ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల ఫక్కున నవ్వింది. దీంతో శివుడు ఆగ్రహంతో వూగిపోయాడు.
భృకుటి ముడిపడింది. అందులోంచి భయంకరమైన ఆకారంతో ఓ కాలపురుషుడు ఆవిర్భవించాడు.
అతడే కాలభైరవుడు.
భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది. పాపాల్ని పరిహరించేవాడిగా "పాపభక్షుడు" అయ్యాడు. కాలభైరవుడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. శివుడి ఆదేశాన్ని అనుసరించి ...తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ నరికేశాడు కాలభైరవుడు. కానీ, ఆ తల కిందపడిపోకుండా భైరవుడి చేతికి అంటుకుపోయింది. అంతలోనే విష్ణువు చుట్టూ తిరుగుతున్న మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా మెచ్చుకున్నాడు. దీంతో, నాగభూషణుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేకపోయాడు. ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కాశీనగరంలో కాలుపెట్టగానే, మహాద్భుతం జరిగినట్టు...కపాలం వూడిపడింది.
దీంతో కాలభైరవుడు ఆనంద తాండవం చేశాడు. కాశీక్షేత్రంలోని ఆ ప్రాంతమే ‘కపాలమోచన’ దివ్యతీర్థంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు. స్థానికులు ‘లాట్ భైరవ’ అని పిలుచుకుంటారు.
ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు. కార్తికమాసంలోని కృష్ణపక్ష అష్టమినే...కాలాష్టమిగా, కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించుకునే వారూ ఉన్నారు. ఆ రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు.
పరమశివుడి ఆదేశం ప్రకారం...కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి.
కాశీ లో ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా క్షేత్ర పాలకుడిని సందర్శించుకోవడం ఆచారం. ఇక్కడ అష్టభైరవుల ఆలయాలున్నాయి. విశ్వనాథుడి ఆలయానికి కొద్దిదూరంలో కాలభైరవ స్వామి దర్శనమిస్తాడు.
రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు.
దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిచడం ఈ క్షేత్ర ప్రత్యేకత.
మణికర్ణికాఘాట్ ప్రాంతంలో కాలభైరవుడిని మశాన్ (శ్మశాన)బాబాగా కొలుస్తారు.
ఉజ్జయినిలో వెలసిన కాలభైరవుడు కూడా మహాశక్తిమంతుడని భక్తుల విశ్వాసం.
దిల్లీ నగరంలోనూ కాలభైరవ క్షేత్రం ఒకటుంది.
అసితాంగ భైరవుడూ, రురు భైరవుడూ, చండ భైరవుడూ, క్రోధన భైరవుడూ, ఉన్మత్త భైరవుడూ, కపాల భైరవుడూ, భీషణ భైరవుడూ, సంహార భైరవుడూ... ఇలా ఎన్నో రూపాల్ని ధరించాడు కాలభైరవుడు.
ఒక్కో రూపాన్ని ఉపాసిస్తే, మనలోని ఒక్కో దుర్గుణం తొలగిపోతుందని సాధకులు చెబుతారు.
కాలభైరవ అష్టకం
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ l
నారదాది యోగివృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే॥ (1)
భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠం మీప్సితార్థ దాయకం త్రిలోచనమ్ ।
కాలకాలం మంబుజాక్ష అక్షశూలం అక్షరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే॥ (2)
శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయ మాదిదేవ అక్షరం నిరామయమ్ ।
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥ (3)
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్ ।
వినిక్వణన్ మనోజ్ఞహేమకింకిణీ లసత్కటిం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥(4)
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుమ్ ।
స్వర్ణవర్ణ కేషపాశ శోభితాంగ నిర్మలం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥ (5)
రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్యం అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం । మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్ర భూషణం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥(6)
అట్టహాస భిన్నపద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్టపాప జాలముగ్ర శాసనం ।
అష్టసిద్ధిదాయకం కపాల మాలికా ధరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే (7)
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసి లోక పుణ్యపాపశోధకం విభుమ్ ।
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥ (8)
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం ।
శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్.
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం కాలభైరవాష్టకమ్ సంపూర్ణం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి